కరివేపాకు కారం పొడి
కరివేపాకు కారం పొడి ఇష్టపడని వారు బహుశా అసలు ఉండరేమో!!! వేడి వేడి నెయ్యి ఇడ్లి, అట్టు, ఇంకా అన్నంతో సరైన జోడి..
కరివేపాకు కారం పొడి పొడిగా నంజుడికే కాదు, ఏదైనా వేపుడు కూరల్లో ఆఖరున వేసినా అమోఘం! నేను ఎప్పుడూ చేసే కూరలకి వేపుళ్ళకి కరివేపాకు కారంపొడి ట్విస్ట్ ఇచ్చి థ్రిల్ చేస్తుంటాను. బెస్ట్ కారం పొడికి కొన్ని టిప్స్ తో పాటు ఇంకా ఎలా ఈ కారం పొడి వాడుకోవచ్చో వివరాయలు కిందున్నాయి చూడండి.

టిప్స్
ముదురు కరివేపాకు మాత్రమే ఎందుకు వాడాలి?
• ముదురు కరివేపాకుకి సువాసనతో పాటు పొడిచేశాక కాస్త బరకగా తెలుస్తుంది. తినెప్పుడు పంటికి తగిలి రుచిగా ఉంటుంది.
• ఇంకా నాటు కరివేపాకు వాడితే మేలు అది మాంచి గుభాళింపుతో ఉంటుంది. బెస్ట్ కారం పొడికి ఇవి చేయండి:
• కరివేపాకుని కడిగి వడకట్టి గుడ్డ పరిచి నీడన రాత్రంతా ఆరబెడితే చెమ్మారి ఆకు వడలుతుంది, అప్పుడు వేపితే ఆకులోని చెమ్మ పూర్తిగా ఆరి పొడి కూడా నిలవుంటుంది
• వేరు సెనగనూనె రుచిగా ఉంటుంది రీఫైండ్ నూనె కంటే కూడా
• పప్పులు నూనెలో నిదానంగా కలుపుతూ ఎర్రగా వేపుకుంటే లోపలి దాకా వేగి పొడికి మాంచి రుచినిస్తుంది
• కరివేపాకుని 3-4 నిమిషాలు వేపుకుంటే చాలు ఎర్రగా వేపితే సువాసనపోతుంది
• వెల్లూలి నచ్చని వారు వదిలేవచ్చు
• మీరు వాడే మిరపకాయల క్వాలిటీని బట్టి మిరపకాయలు పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోండి .
కరివేపాకు కారంపొడితో ఇలా కూరలు కూడా చేసుకోవచ్చు :
దుంపలతో
• ఉడికించిన ఏదైనా దుంప ముక్కలు నూనె లో వేసి అందులో కాస్త పసుపు చాలా కొద్దిగా ఊపు వేసి బంగారు రంగులోకి వేపి కరివేపాకు కారం పొడి వేసి వ నిమిషం టాస్ చేసి దింపేస్తే సరి
చికెన్ తో
• ఇలాగే మసాలా పేస్ట్ పట్టించి నానబెట్టిన చికెన్ లో కాసిని నీళ్ళు పోసి కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేసి ఉడికిస్తే నీరు ఆవిరై ముక్క మెత్త బడుతుంది, అప్పుడు మరో మూకుడులో నూనె వేసి అందులో కొద్దిగా జీడిపప్పు వేపుకోవాలి. తరువాత ఉడికిన చికెన్ వేసి ఎర్రగా వేపి వేపుడుకి తగినట్లుగా కరివేపాకు కారం పొడి కొద్దిగా గరం మసాలా వేసి దింపితే కరివేపాకు కోడి వేపుడు రెడీ.

కరివేపాకు కారం పొడి - రెసిపీ వీడియో
Curry Leaves Podi recipe | Karivepaku Podi | How to make Curry Leaves Powder
Prep Time 5 mins
Cook Time 15 mins
Resting Time 10 mins
Total Time 30 mins
Servings 15
కావాల్సిన పదార్ధాలు
- 50 gms ముదురు కరివేపాకు ఆకులు
- 2 tbsps సెనగపప్పు
- 3 tbsps మినపప్పు
- 3 tbsps ధనియాలు
- 1 tsp జీలకర్ర
- 15 ఎండుమిర్చి
- చింతపండు (నిమ్మకాయంత)
- 5 - 6 వెల్లూలి
- 1/2 tsp పసుపు
- ఉప్పు
- 2 tbsps నూనె
విధానం
- కరివేపాకుని కడిగి నీడన చెమ్మారిపోయే దాక ఆరనివ్వండి.
-
నూనె వేడి చేసి అందులో సెనగపప్పు, మినప్పప్పు వేసి ఎర్రగా మాంచి సువాసనోచ్చే దాక వేపుకోండి.
-
తరువాత ధనియాలు, ఎండుమిర్చి వేసి వేపి, పూర్తిగా ఆరిపోయిన కరివేపాకు వేసి 3-4 నిమిషాల పాటు వేపుకుని, దింపే ముందు వెల్లూలి, జీలకర్ర, చింతపండు వేసి మరో నిమిషం వేపి దింపి చల్లార్చుకోండి.
-
మిక్సీ జార్ లో ఉప్పు పసుపు, చల్లార్చుకున్న కరివేపాకు పోపు సామాను వేసి మెత్తని పొడిగా చేసుకోండి.
-
పొడిని గాలి చొరని డబ్బాలో పెట్టుకుంటే కనీసం నెల పైనే తాజా ఉంటుంది.

Leave a comment ×
6 comments