జంతికలు | మినపప్పు జంతికలు | మురుకులు | మురుకులు రెసిపి | జంతికలు రెసిపి

మినపప్పు జంతికలు మెత్తగా ఉడికించిన మినపప్పుకి మూడింతలు బియ్యం పిండి వాము జీలకర్ర ఇంగువ నువ్వులు వేసి మెత్తగా తడిపి జంతికల మాదిరి వత్తి ఎర్రగా వేపుకునే ఈ జంతికల రుచి అమోఘం. ఇవి కమ్మగా ఎంతో రుచిగా ఉంటాయి.

పండుగంటే సాధారణంగా నడరు జంతికలు కారప్పూస చేస్తుంటారు, ఇంటికో తీరులో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకుంటూ చేసుంటుంటారు, కానీ ఈ మినపప్పు జంతికలు కరకరలాడుతూ యమా రుచిగా ఉంటాయండి.

ఈ జంతికలు తెల్లగా ఉంటాయి ఇంకా వాము ఘాటుతో ఉంటాయి, కారం ఉండదు.

టిప్స్

మినపప్పు:

*నానబెట్టిన మినపప్పుని మెత్తగా ఉడికించి రుబ్బుకుని తీసుకుంటే జంతికలకి మరింత జిగురొచ్చి చాలా రుచిగా ఉంటాయి జంతికలు

బియ్యం పిండి:

*ఏ కొలతకి చేసినా కప్పు మినపప్పుకి మూడింతల బియ్యం పిండి ఉండాలి. నేను బజార్లో అమ్మే పేకెట్ బియ్యం పిండిని వాడాను.

జంతికలు గుల్లగా రావాలంటే:

*పిండిని కాస్త మృదువుగా తడుపుకోవాలి, అప్పుడే గుల్లగా వస్తాయి. పిండి గట్టిగా కలిపితే రాళ్ళలా ఉంటాయి జంతికలు అస్సలు రుచుండవు తినలేరు కూడా.

జంతికలు వేపే తీరు:

*ఈ జంతికలు వెడల్పుగా ఉండే మూకుడులో మాత్రమే వేపుకోవాలి, లోతుగా ఉండే మూకుడులో వేస్తే జంతికలు నూనెలో మునిగి పైకి తేలకుండా విరిగిపోతాయి. ఈ జంతికలు లేత గోధుమ రంగులో ఉంటాయి, ఎర్రగా వేగవు. ఆలా అని వేగిపోయాయ్ అని ముందుకు ముందే తీసేయకండి కాస్త గోధుమ రంగులోకి వచ్చేదాకా వేపి తీసుకొండి.

*దయచేసి మూకుడుకి మించి జంతికలు వేయకండి. ఆలా వేస్తే బాగా వేడి మీద వేగాల్సిన నూనె వేడి తగ్గిపోయి జంతికలు నూనె పీల్చి గుల్లగా రానే రావు. కాబట్టి నూనె మాంచి వేడి మీద ఉంచండి 5-6 జంతికలు వేసి వేపుకుని తీసుకోండి.

ఇంకో తీరు:

*ఈ జంతికలు వాము ఘాటుతో కమ్మగా ఉంటాయి. మీకు కారం కావాలనుకుంటే పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి లేదా ఎండు కారమైన వేసుకోవచ్చు కాకపోతే ఇలా తెల్లగా ఉండవు.

జంతికలు | మినపప్పు జంతికలు | మురుకులు | మురుకులు రెసిపి | జంతికలు రెసిపి - రెసిపీ వీడియో

janthikalu recipe | murukulu recipe | crispy janthikalu | minapappu janthikalu | vismai food

| vegetarian
  • Prep Time 1 min
  • Soaking Time 1 hr
  • Cook Time 1 hr
  • Total Time 2 hrs 1 min
  • Servings 25

కావాల్సిన పదార్ధాలు

  • 3 cups బియ్యం పిండి
  • 1 cup మినపప్పు
  • 2 tbsp వాము
  • 1 tbsp జీలకర్ర
  • 3 - 4 tbsp నువ్వులు
  • 50 gms వెన్న
  • నూనె - వేపుకోడానికి
  • నీళ్లు పిండి మృదువుగా తడుపుకోడానికి

విధానం

  1. మినపప్పుని కడిగి ఒక గంట నానబెట్టుకోండి. నానిన పప్పుని కుక్కర్లో ఒకటికి రెండు నీరు పోసి మెత్తగా ఉడికించుకోండి.
  2. ఉడికిన పప్పుని వడకట్టి పప్పు ఉడికించుకున్న నీటితో మెత్తగా క్రీమ్ మాదిరి గ్రైండ్ చేసుకోండి.
  3. బియ్యం పిండిలో మిగిలిన పదార్ధాలు వెన్నల రుబ్బుకున్న మినపప్పు పేస్ట్ ఇంకా మినపప్పుని ఉడికించుకున్న నీరు వేసి ముందు బాగా కలుపుకోండి.
  4. అవసరానికి తగినట్లు నీరు చేర్చుకుంటూ పిండిని మృదువుగా తడుపుకోండి.
  5. జంతికల గొట్టం లో పిండి ముద్ద ఉంచి ఒక చిల్లుల గరిట మీద మూడు లేదా నాలుగు చుట్లు చుట్టి అంచులని అంటించండి.
  6. అంచులని అంటించిన జంతికని మరిగే వేడి నూనెలో వేసి 5-6 వేసి మీడియం మీద గోధుమ రంగులోకి వచ్చేదాకా లేదా వేసిన జంతికల చుట్టూ బుడగలు తగ్గేదాకా వేపుకుని తీసుకోండి.
  7. తీసుకున్న జంతికలని జల్లెడలో పూర్తిగా చల్లార్చి డబ్బాలో పెట్టుకుంటే కనీసం పది రోజులు నిలవుంటాయి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.