నెల్లూరు చేపల పులుసు | చేపల కూర | ఫిష్ పులుసు | ఫిష్ కర్రీ
నెల్లూరు చేపల పులుసు - అల్లం వెల్లులి ముద్ద వేయకుండా చింతపండు పులుసు మామిడికాయ ముక్కలు టమాటో పులుపుతో చేపముక్కలని ఉడికించి చేసే నెల్లూరు చేపల పులుసు వేడి అన్నంతో ఇడ్లీ అట్టులతో మహాద్భుతంగా ఉంటుంది!!!
చూడ్డానికి చేయడాని చాలా సాధారణంగా అనిపించినా నెల్లూరు చేపల పులుసు అంటే ఏదో మామూలు చేపల పులుసు కాదని అదొక గొప్ప అనుభూతి. చూడ్డానికి చాలా మాములుగా అనిపిస్తుంది కానీ ఈ పులుసులో పిలుపుని బాలన్స్ చేయడంలోనే ఉంది. అది ఎలాగో ఏ తీరులో బాలన్స్ చేస్తే మీకు పర్ఫెక్ట్ రుచోస్తుంది లాంటి ఎన్నో టిప్స్ కింద చాలా వివరంగా ఉన్నాయ్ పులుసు చేసే ముందు ఒక్కసారి టిప్స్ ఫాలో అవ్వండి.

టిప్స్
చేపలు:
-
సాధారణంగా నెల్లూరు చేపల పులుసుకి రవ్వ బొచ్చా కోరమీను నెత్తళ్లు ఈ రకాల చేపలు వాడతారు.
-
బోనెల్స్ చేపలు అస్సలు వాడరు. పులుసుకి చేపలు ఎప్పుడూ కాస్త మందంగా ఉండాలి అప్పుడే ముక్క పులుసులో చిదిరిపోదు.
-
నాలాగే చాలా మంది చేప తలకాయ ముక్కలు తినరు, కానీ చేపల పులుసులో చేప తల ముక్కలు వేస్తే చాలా రుచిగా ఉంటుంది పులుసు. తల ముక్కలు తినడం ఇష్టపడని వారు పులుసులో అలాగే వదిలేయండి, తరువాత పడేయండి. అంతేగాని తలముక్కలు వేయకుండా చేపలపులుసు చేయకండి.
పులుసు గురుంచి కొన్ని విషయాలు :
-
నెల్లూరు చేపల పులుసులో అల్లం వెల్లులి రెండూ వేయరు.
-
చింతపులుసు టమాటో గుజ్జు పచ్చిమామిడి ముక్కల పులుపు ఇవన్నీ కలిపి పులుపుని ఉప్పు కారంతో బ్యాలెన్స్ చేస్తూ చేయడంలోనే ఉంది నెల్లూరు చేపల పులుసు అసలైన రుచి.
-
ఈ పులుసులో వేసే ప్రతీ పదార్ధంలోంచి నూనె పైకి తేలేదాక నిదానంగా వేపుకుంటేనే అసలైన రుచి. ఇంకా నూనెలుండాలండి అప్పుడే పులుసు చాలా రుచిగా ఉంటుంది. నూనెలుంటే పులుసు 2 రోజులు నిలువున్నా చెక్కుచెదరదు.
పులుపుని బాలన్స్ చేయడం ఎలా?
-
పులుసులో అన్నీ నేను చేపినట్లే వేసినా ఆఖరున వేసే మామిడికాయ పులుపుతో ఉప్పు కారాలు చాలాకపోవచ్చు ఎక్కువా అవ్వొచ్చు, కాబట్టి పులుసు తయారయ్యాక ఒక్క సారి రుచి చూసి పులుపు తగ్గితే కొంచెం చింత పులుసు విడిగా మరిగించి చేపముక్కల్లో పోసేయండి ఆ తరువాత ఒక్క పొంగురానిచ్చి దింపేసుకోండి. ఆలాగే పులుపు ఎక్కువుగా అనిపిస్తే విడిగా కొద్దిగా నూనె వేసి తగినంత కారం ఉప్పు వేసి ఒక్కటే పొంగు రానిచ్చి చేపల పులుసులో పోసి ఒక్క పొంగురానిస్తే సరిపోతుంది. చేపల పులుసు మామలు మాంసం కూరల మాదిరి గరిట పెట్టి కలిపితే ముక్క చిదురైపోతుంది.
-
కొందరు ఆఖరున చిన్న బెల్లం ముక్క వేస్తారు పులుపుని బాలన్స్ చేయడానికి. నచ్చితే చిన్న బెల్లం ముక్క వేసుకోండి మాములుగా మనం పులుసులో వేసుకున్నట్లు.
పులుసు పొడి :
- ఆవాలు మెంతులు జీలకర్ర ధనియాలని వేపి చేసిన పొడి ఆఖరున వేస్తే పులుసుకి ప్రత్యేకమైన రుచి వస్తుంది. కానీ నేను చేసే అరకిలో చేప ముక్కలకి సరిపోయేంత కొద్దిగా తీసుకుంటే దంచడానికి రాదు, అందుకే కాస్త ఎక్కువగా దినుసులు తీసుకున్నాను. సాధారణంగా తక్కువ కొలతల్లో చేసుకున్నప్పుడు సరిపోను మసాలా దినుసులు తీసుకుని అందులో ఎండుమిర్చి వేసి కలిపి వేపుతారు అప్పుడు దంచడానికి వీలుగా ఉంటుంది, కానీ ఎండు కారం కాస్త తగ్గించుకోవాలి.
నెల్లూరు చేపల పులుసు | చేపల కూర | ఫిష్ పులుసు | ఫిష్ కర్రీ - రెసిపీ వీడియో
Nellore Chepala Pulusu | Fish Curry | Nellore Fish Curry | Chapala Pulusu
Prep Time 5 mins
Cook Time 45 mins
Resting Time 5 mins
Total Time 55 mins
Servings 4
కావాల్సిన పదార్ధాలు
-
పులుసు పొడి కోసం
- 2 pinches మెంతులు
- ½ tsp ఆవాలు
- ½ tsp జీలకర్ర
- 1 tbsp ధనియాలు
-
పులుసు కోసం
- ½ kg చేప ముక్కలు ఇంకా ఒక చేప తల ముక్కలు
- 1 ¾ -2 tbsp ఉప్పు
- 3 – 3 ½ tbsp కారం
- ½ litre చింతపండు (45 గ్రాములు చింతపండు నుండి తీసిన పులుసు)
- 1 జామకాయంత మామిడికాయ ముక్కలు
- 2 రెండు టొమాటోల పేస్ట్
- ½ tsp పసుపు
- 2 sprigs కరివేపాకు
- 3 slit పచ్చిమిర్చి
- 1 cup ఉల్లిపాయ
- 1/3 cup నూనె
- కొత్తిమీర తరుగు (కొద్దిగా)
- 2 pinches ఇంగువ
- ½ tsp ఆవాలు
విధానం
-
చేప ముక్కలకి కొద్దిగా ఉప్పు కారం పసుపు వేసి బాగా పట్టించి పక్కనుంచండి.
-
పులుసు పొడి కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి వేపి పొడి చేసి పక్కనుంచుకోండి.
-
నూనె వేడి చేసి అందులో ఆవాలు వేసి వేపుకోండి, ఆ తరువాత ఉల్లిపాయ తరుగు పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు వేసి ఉల్లిపాయ లేత బంగారు రంగు వచ్చేదాకా వేపుకోండి.
-
వేగిన ఉల్లిలో మిగిలిన ఉప్పు కారం వేసి ఒక పొంగు రానివ్వండి.
-
పొంగిన ఉప్పు కారంలో టమాటో పేస్ట్ వేసి నూనె పైకి తేలేదాక మూతపెట్టి మగ్గనివ్వండి.
-
నూనె పైకి తేలిన తరువాత మాత్రమే చింతపండు పులుసు పోసి అంచుల వెంట నూనె పైకి తేలేదాక మరగనివ్వండి.
-
పులుసు మరిగి నూనె పైకి తేలిన తరువాత నెమ్మదిగా చేప ముక్కలు ఒక్కోటిగా పులుసంతా వేసి కొద్దిగా ఇంగువ కూడా వేసుకుని గిన్నె అంచుల పట్టి తిప్పితే పులుసులో ముక్కలు కుదురుకుంటాయ్.
-
చేప ముక్కుల్లోంచి నూనె పైకి తేలేదాక మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వండి, అస్సలు గరిట పెట్టి తిప్పకండి.
-
గిన్నె అంచులవెంట నూనె పైకి తేలాక నెమ్మదిగా మామిడికాయ ముక్కలు వేసి మరో సారి గిన్నె అంచులని పట్టి తిప్పితే మామిడి ముక్కలు పులుసులో మునిగిపోతాయ్. ఇప్పుడు మూతపెట్టి నూనె పైకి తేలేదాక మీడియం ఫ్లేమ్ మీద మరగనివ్వండి.
-
నూనె పైకి తేలాక కొత్తిమీర తరుగు చల్లి దింపేసుకున్న పులుసుని కనీసం 5-6 గంటలు లేదా రాత్రంతా ఊరనిచ్చి తింటే ముక్కకి ఉప్పు కారం పులుసు పట్టి చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment ×
4 comments