తెలంగాణ స్టైల్ చేపల పులుసు | చేపల పులుసు

తెల్సి తెలియని స్మోకీ ఫ్లేవర్తో మసాలా ఘాటుతో కారంగా పుల్లగా చిక్కని గ్రేవీతో ఎంతో రుచిగా ఉంటుంది తెలంగాణ స్టైల్ చేపల పులుసు.

ఆంధ్రులు చేసే చేపల పులుసు తెలంగాణా వారు చేసే చేపల పులుసు కాస్త భిన్నం. తెలంగాణా చేపల పులుసు అంటే టొమాటోలు వేయరు, ఇంకా ఎండు కొబ్బరి, గసగసాలు, చక్కా లవంగాలు, కాల్చిన ఉల్లి వేసి పులుసు చిక్కగా కాస్తారు.

తెలంగాణా తీరు చేపల పులుసు కాస్త కారం, ఘాటు పాళ్ళు ఎక్కువే!!! అన్నంతోనే కాదు ఇడ్లీ అట్టు వడ దేనితోనైనా చాలా రుచిగా ఉంటుంది పులుసు.

మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చు చేపల పులుసు

చేపల పులుసు చేసే ముందు కింద టిప్స్ చూసి చేసుకోండి, అప్పుడు ఏ చేప వాడాలి పులుసు ఎలా కాస్తే రుచి వస్తుంది, ఎందుకు చేపల పులుసు మరుసటి రోజు తినాలి, పులుసు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఏమి చెయ్యాలి లాంటి టిప్స్ అన్నీ అర్ధమవుతాయి.

టిప్స్

చేపలు:

  1. నేను బొచ్చ చేప కిలో ముక్కలు వాడాను. మీరు ఇదే తీరు లో ఏ చేపతో అయినా పులుసు కాచుకోవచ్చు

  2. చేపల పులుసులో కచ్చితంగా చేప తలా ముక్క ఉంచండి. అప్పుడే పులుసుకి రుచి. చాల మంది చేపల్లో తల ముక్క వద్దని వదిలేస్తారు. మీరు తినకపోయినా పులుసులో తలా ముక్కలు వేసి మరిగిస్తే పులుసు చాలా రుచిగా ఉంటుంది.

పులుసు:

  1. చింతపండు వేడి నీళ్లలో నానబెడితే సులభంగా గుజ్జు వచ్చేస్తుంది.

  2. ఈ చేపల పులుసుకి చింత గుజ్జు తీసుకోండి, పల్చని పులుసు పోయకండి. ముందు చిక్కని పులుసు మరిగి నూనె పైకి తేలాలి, అలా నిదానంగా మరిగితేనే పులుసుకి రుచి, ఇంకా నిల్వ ఉంటుంది.

ఉల్లిపాయ:

  1. కిలో చేప ముక్కలకి నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు సరిపోతాయి.

  2. ఉల్లిపాయలు పొయ్యి మీద పెట్టి నిదానంగా తిప్పుకుంటూ సన్నని సెగ మీద కాలిస్తే ఉల్లిపాయ లోపలి దాకా మగ్గుతుంది, పైన తోలు కాలిపోతుంది. అప్పుడు ఉల్లికి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది.

బెస్ట్ చేపల పులుసుకి కొన్ని టిప్స్:

  1. చేపల పులుసు కచ్చితంగా సన్నని సెగ మీద నూనె పైకి తేలేదాక ఉడకాలి, అప్పుడే పులుసులో ఉడికిన ముక్క బిరుసెక్కి ముక్క త్వరగా విరగదు, ఇంకా పులుసు మూడు రోజులైనా పాడవదు.

  2. చేపల పులుసు చాలా మంది చేప ముక్కని ముక్కని ఫోర్క్తోగుచ్చి చూసి ముక్క ఉడికితే దింపేస్తారు. నిజమే ఆ తీరులో కూడా చేప ఉడికినట్లే కానీ పులుసు నిల్వ ఉండదు. రెండవ రోజుకి పాడైపోతుంది.

  3. మీ అందరికి తెలిసినదే చేపల పులుసు చేసిన రోజు కంటే తరువాతేహి రోజు ఇంకా రుచిగా ఉంటుంది, ముక్కలకి పులుసు బాగా పట్టి.

ఆఖరుగా ఇంకొన్ని టిప్స్ :

  1. నా దగ్గర వేపిన అల్లం వెల్లులి పేస్ట్ ఉంది అందుకే నేను చేప ముక్కలకి ముందే పట్టించాను నూనెలో వేపకుండా. మీరు మాత్రం నూనె వేసి వేపుకోండి.

  2. చేపల పులుసు నేను కాస్త చిక్కగానే పెట్టాను, ఈ చిక్కదనం వేడి మీద అప్పటికప్పుడు తినడానికి చాలా రుచిగా ఉంటుంది. కానీ చల్లారే పాటికి మరింత చిక్కగా అయిపోతుంది పులుసు. అప్పుడు అన్నంతో బాగానే ఉన్నా, ఇడ్లీ అట్టు వడ ఇలా దేనితోనైనా నంజుకు తినడానికి రుచిగా ఉండదు. అందుకే పులుసు కాస్త పలుచగా పెట్టుకోండి అట్టు ఇడ్లీతో తిందామనుకుంటే!!!

తెలంగాణ స్టైల్ చేపల పులుసు | చేపల పులుసు - రెసిపీ వీడియో

Telangana style Chepala Pulusu | Fish Curry | How to Make Fish Curry

| nonvegetarian
  • Prep Time 1 min
  • Soaking Time 30 mins
  • Cook Time 45 mins
  • Resting Time 1 hr
  • Total Time 2 hrs 16 mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • చేపలని నానబెట్టడానికి:
  • 1 Kg చేప ముక్కలు
  • 1/2 tbsp పసుపు
  • ఉప్పు (రుచికి సరిపడా)
  • 2 tbsp అల్లం వెల్లులి ముద్దా
  • పులుసు పొడి కోసం:
  • 1 tbsp మెంతులు
  • 1 tbsp జీలకర్ర
  • 2 tbsp ధనియాలు
  • 4 యాలకలు
  • 5-6 లవంగాలు
  • 1.5 Inch దాల్చిన చెక్క
  • 1 tbsp గసగసాలు
  • 1/4 Cup ఎండు కొబ్బరి
  • 2 Pinches వాము
  • 1/2 tbsp మిరియాలు
  • పులుసు కోసం:
  • 60 gms చింతపండు
  • 4 ఉల్లిపాయ
  • 2.5 tbsp కారం
  • ఉప్పు
  • 60 ml నూనె
  • 1 litre వేడి నీరు
  • 3 Sprigs కరివేపాకు
  • దాల్చిన చెక్క (చిన్న ముక్క)
  • కొత్తిమీర (కొద్దిగా)

విధానం

  1. చేప ముక్కలకి పసుపు ఉప్పు అల్లం వెల్లులి పట్టించి కాసేపు పక్కనుంచండి( నా దగ్గర వేపియాన్ అల్లం వెల్లులి ముద్ద ఉంది అందుకే ముందే వేసాను మీరు నూనెలో వేపుకోండి)
  2. చింతపండుని వేడి నీటిలో నానబెట్టుకోండి.
  3. పులుసు పొడి కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి సన్నని సెగ మీద కలుపుతూ వేపుకోవాలి. ఆఖరుకి స్టవ్ ఆపేసి గసగసాలు వేస్తే ఆ వేడి చిట్లుతాయ్
  4. వేగిన మసాలా దినుసులని చల్లార్చి మెత్తని పొడి చేసి పక్కనుంచుకొండి
  5. ఉల్లిపాయల్ని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద తిప్పుకుంటూ అన్ని వైపులా మెత్తబడే దాకా కాల్చుకోండి. కాలిన ఉల్లిపాయని తీసి పైన నల్లని పొట్టుని తీసి మిక్సీలో వేసి నీళ్లతో మెత్తని పేస్ట్ చేసుకోండి
  6. చిక్కని చింత గుజ్జులో ఉల్లిపాయ పేస్ట్ కారం ఉప్పు వేసి కలిపి పక్కనుంచుకొండి
  7. నూనె వేడి చేసి అందులో కరివేపాకు తరుగు దాల్చిన చెక్క ముక్క వేసి వేపుకోండి. (ఇక్కడే అల్లం వెల్లులి పేస్ట్ వేసి వేపుకోండి)
  8. వేగిన తాలింపులో కలిపి ఉంచుకున్న ఉల్లి చింత గుజ్జు వేసి ముందు నీరు వేయకుండా కలుపుతూ నూనె పైకి తేలేదాకా మీడియం ఫ్లేమ్ మీద ఉడకనివ్వాలి
  9. పులుసులోంచి నూనె పైకి తేలిన తరువాత పులుసు పొడి వేడి నీళ్లు లీటర్ పోసి హై ఫ్లేమ్ మీద పులుసుని 5 నిమిషాలు మరగనివ్వాలి.
  10. పులుసు బాగా మరిగిన తరువాత చేప ముక్కలు సర్ది మూత పెట్టి నూనె పైకి తేలేదాకా ఉడకనివ్వాలి (మధ్యలో చేప ముక్కలని గరిటతో కడపకండి విరిగిపోతాయి)
  11. నాకు 25 నిమిషాలకి నూనె పైకి తేలింది. అప్పడు కాస్త కొత్తిమీర తరుగు చల్లి దింపి కనీసం గంట సేపైనా ఊరనివ్వాలి ముక్కలని. రాత్రంతా పులుసు వదిలేస్తే ఇంకా రుచిగా ఉంటుంది చేపల పులుసు.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments