కేజి బియ్యం ప్రసాదం పులిహోర

పులిహోర కనబడితే చాలు పండుగ వాతావరణం వచ్చేసినట్లే అనిపిస్తుంది దక్షిణాది రాష్ట్రాల వారికి. ఏ శుభకార్యమైనా పులిహోరా ఉండాల్సిందే! వెనుకటికి పెళ్ళిళ్ళలో పులిహోర వడ్డించేవారు ఇప్పుడు బిర్యానీలు పెడుతున్నారు.

కాలం మారినా అభిరుచులు మారినా పులిహోర ప్రేత్యేకత పులిహోరదే!!! అందులోనూ తెలుగు వారు చేసే ఆవ పులిహోర పరిమళం అవతలి వీధి వారికి రావలసిందే అంత ప్రేత్యేకంగా ఉంటుంది తెలుగు వారి పులిహోరా.

అన్నంలో చింతపండు కలిపి తాలింపు వేసి చేసే పులిహోరా ఉందీ, అదే చింతపండుతో పాటు ఆవాల ముద్ద కలిపి చేసే పులిహోరా ఉంది. నేను ఆలయాల్లో ప్రసాదంగా ఇచ్చే ఆవ పులిహోర రెసిపీ చెప్తున్నా. నేను చేస్తున్న కొలత ప్రసాదంగా 30 మందికి భోజనాల్లో వడ్డనకి 20 మందికి సరిపోతుంది.

నేను ఇదివరకే ప్రసాదం పులిహోర రెసిపీ చెప్పాను. అయితే అది 4-5 మందికి సరిపోయే కొలత. ఆ కొలత చేసే తీరు కేజి బియ్యంతో వండే తీరు భిన్నం. నచ్చితే ఆ తీరులోనూ రుచి చూసుకుంటూ చేసుకోవచ్చు. కానీ డానికి కాస్త సమయం పడుతుంది. ఏ శ్రమ లేకుండా ఈ పద్ధతిలో చేస్తే కచ్చితంగా ఆలయాల్లో ఇచ్చే ప్రసాదం పులిహోర రుచి వస్తుంది. ఈ రెసిపీలో ఆ టిప్స్ అన్నీ ఎంతో వివరంగా కచ్చితమైన కొలతలతో చెప్తున్న.

1kg Prasadam Ava Pulihora | Tamarind Rice | Prasadam Pulihora at home

టిప్స్

బియ్యం:

  1. పులిహోరకి సోనా మసూరీ బియ్యం వాడాలి. సాధారణంగా దక్షిణాది వారు బాస్మతి బియ్యం వాడరు

  2. కేజి కొలతకి వండేప్పుడు అన్నం ఉడుకుపట్టాక మూత పైన నీరు పోసి మీడియం ఫ్లేమ్ మీద వండితే అడుగు పట్టకుండా సరిగ్గా ఉడుకుతుంది. ప్లేట్లో పోసిన నీరు ఇగిరిపోయింది అంటే అన్నం 90% ఉడికిపోయినట్లే. పులిహొరకి అన్నం మెత్తగా పూర్తిగా ఉడకకూడదు.

  3. ఉడికిన అన్నం వెంటనే వెడల్పాటి గిన్నె లేదా ప్లేట్లో వేసుకోవాలి గిన్నెలోనే వదిలేస్తే మెత్తబడిపోతుంది.

  4. లేదా కేజి కి 3 లీటర్ల నీళ్ళు పోసి అన్నం 90% ఉడికిన తరువాత గంజి వార్చినా సరిపోతుంది. అప్పుడు కూడా పొడిపొడిగా వస్తుంది. కానీ వేడి మీదే పసుపు ఉప్పు వేస్తేనే అన్నానికి పట్టుకుంటుంది.

చింతపండు గుజ్జు:

  1. ఇంత కొలతకి కూడా చింతపండు గుజ్జు నూనెలో ఉడికించి అన్నంలో కలిపీ చేసుకోవచ్చు. కానీ వేడి నీళ్ళలో నానేసిన చింతపండు గుజ్జు వేడి అన్నంలో కలిపినా అదే రుచి వస్తుంది. వేడి నీళ్ళలో నానినప్పుడు సగం ఉడుకుతుంది, మిగిలినది వేడి అన్నంలో మగ్గిపోతుంది.

  2. చింతపండు బియ్యంలో 10 వ వంతు కంటే కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి. బియ్యం కేజి అయితే 120 గ్రాములు గింజలు లేని చింతపండు సరిపోతుంది. గింజలు ఉంటే 150 గ్రాములు ఉండాలి చింతపండు

ఆవాల పేస్ట్:

  1. ఏ కొలతకి చేసినా ఆవాలు చింతపండుకి సగం ఉంటే సరిపోతుంది. ఆవాలు రుబ్బేప్పుడు చేదెక్కకుండా ఉప్పు వేస్తే సరిపోతుంది

తాలింపు:

  1. పులిహోరకి ఎంతో ప్రధానమైనది తాలింపు. సంప్రదాయ పులిహొరల్లో నువ్వుల నూనె తాలింపు పెడతారు. లేదా వేరు సేనగనూనెతో పెడతారు. నేను నూపప్పు నూనెతో తాలింపు పెట్టాను. నూపప్పు అంటే నల్ల నువ్వుల నూనె నుండి తీసిన నూనె. సాధారణంగా నువ్వుల నూనె పేరుతో అమ్మే నూనె తెల్ల నువ్వుల నూనె. నచ్చితే అదీ వాడుకోవచ్చు.

కేజి బియ్యం ప్రసాదం పులిహోర - రెసిపీ వీడియో

1kg Prasadam Ava Pulihora | Tamarind Rice | Prasadam Pulihora at home

Flavored Rice | vegetarian
  • Prep Time 10 mins
  • Cook Time 40 mins
  • Resting Time 30 mins
  • Total Time 1 hr 20 mins
  • Servings 30

కావాల్సిన పదార్ధాలు

  • అన్నం వండుకోడానికి
  • బియ్యం – కిలో
  • 2 liter + 100 ml నీళ్ళు
  • 1 tsp పసుపు
  • ఛింతపండు గుజ్జు
  • 120 gm గింజలు లేని చింతపండు
  • 200 - 250 ml వేడి నీళ్ళు
  • ఆవాల పేస్ట్
  • 60 gm ఆవాలు
  • 1.5 inch అల్లం
  • 2 ఎండు మిర్చి
  • 1/2 tsp పసుపు
  • ఉప్పు – కొద్దిగా
  • వేడి నీళ్ళు – కొద్దిగా
  • 2 tbsp నూనె
  • పులిహోరకి
  • 2.5 tsp ఉప్పు (లేదా రుచికి సరిపడా)
  • 1/4 cup నూనె
  • 7 - 8 పచ్చిమిర్చిని చీరినవి
  • 3 రెబ్బలు కరివేపాకు
  • తాలింపు
  • 3/4 cup నువ్వుల నూనె/ వేరు శెనగ నూనె
  • 3/4 cup వేరుశెనగపప్పు
  • 1.5 tbsp ఆవాలు
  • 2 tbsp మినపప్పు
  • 2 tbsp పచ్చి శెనగపప్పు
  • 12 - 15 ఎండు మిర్చి
  • 1 tsp ఇంగువ
  • 2 రెబ్బలు కరివేపాకు

విధానం

  1. చింతపండులో వేడి నీళ్ళు పోసి చిక్కని గుజ్జు తీయండి.
  2. మిక్సీలో అవాల పేస్ట్ కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి వేడి నీళ్ళతో మెత్తని పేస్ట్ చేసుకోండి. గ్రైండ్ చేసుకున్నాక నూనె కలిపి పక్కనుంచుకోండి.
  3. బియ్యం లో నీళ్ళు పసుపు పోసి హై ఫ్లేమ్ మీద ఉడుకుపట్టనివ్వాలి.
  4. ఉడుకుతున్న అన్నంని నెమ్మదిగా కలిపి అన్నం పైన ప్లేట్ పెట్టి నీళ్ళు పోసి మీడియం ఫ్లేమ్ మీద 90% ఉడికించుకోవాలి (అన్నం వండే తీరు ఒక సారి టిప్స్లో చూడగలరు).
  5. ఉడికిన అన్నంలో నూనె పోసి నెమ్మదిగా కలిపి వెడల్పాటి గిన్నెలో వేసుకోండి, ఉప్పు, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు చింతపండు గుజ్జు వేసి నెమ్మదిగా కలుపుకోండి.
  6. తాలింపు కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి నూనెలో ఎర్రగా వేపి పులిహోరా లో పోసుకోండి, ఇంకా పైన ఆవాల పేస్ట్ వేసి నెమ్మదిగా పట్టించి 30 నిమిషాల నుండి గంట సేపు వదిలేస్తే అన్నానికి ఉప్పు, పులుపు , ఆవాల పరిమళం పట్టి ఎంతో రుచిగా ఉంటుంది.
  7. చేసే ముందు ఒకసారి టిప్స్ చూసి చేయండి. తప్పక ఆలయాల్లో ఇచ్చే పులిహోర రుచిని ఆస్వాదిస్తారు!!

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

3 comments

  • G
    Gopalski
    What type of rice is best for tamarind rice? There are so many varieties of rice...
  • A
    Akhila
    నమస్తే తేజ గారు,vismai food టీమ్... మీరు చెప్పిన నేను చూసి చేసిన వంటలకు ప్రతి దాని కింద కామెంట్ పెట్టాలి అంటే చాలా ఉన్నాయి.ఆవ పులిహోర ఉంటుంది అని మీ వీడియో చూసే తెలుసుకున్నాను.మీరు చెప్పినట్టు రెసిపీ తయారు చేసి పొట్లాలలో చుట్టి పది మందికి పంచిపెట్టాము..మేము తిన్నాము,ఎంత కమ్మగా అయ్యిందో... కొత్తగా ఏమైనా చేయాలి అంటే vismai food ఆధునిక వంటల పుస్తకాన్ని తెరువాల్సిందే మరి.. హల్లో...ఫూడీస్..అంటూ చాలా buddies ని సంపాదించారు.. congratulations...👍for more success and celebrations team.
  • R
    Ravi
    Recipe Rating:
    My sister cooked best recipe your videos
1kg Prasadam Ava Pulihora | Tamarind Rice | Prasadam Pulihora at home