Curries
4.8 AVERAGE
4 Comments

కొంచెం కారంగా ఘాటుగా ఉంటూ అన్నం పులావ్ పూరి చపాతీల్లోకి ఇంకా లంచ్ బాక్సులల్లోకి పర్ఫెక్ట్ జోడీ. సింపుల్ ఆలూ కాప్సికం కర్రీ చిక్కని గ్రేవీతో చేయడానికి ఎంతో సులభంగా తినడానికి ఎంతో కమ్మగా ఉంటుంది.

కొన్ని రెసిపీస్లో వేసేవి నాలుగైదు పదార్ధాలే అయినా ఎంతో రుచిగా ఉంటుంది. అలాంటిదే ఈ కర్రీ కూడా. నిజానికి నాకు సింపుల్ కూరలంటేనే చాలా ఇష్టం. వేసే ఆ నాలుగైదు పదార్ధాలు నోటికి అందుతూ మనసారా ఆస్వాదించగలుగుతాం. అలాంటిదే ఈ ఆలూ క్యాప్సికం కర్రీ.

ఆలూ కాప్సికం కర్రీ చాలా తీరులో చేసుకోవచ్చు. నేను తక్కువ నూనెలు మసాలాలు లేకుండా సింపుల్గా చేసాను. నచ్చితే మీరు వేసుకోవచ్చు, అది ఎలాగో ఏవేవి వేసుకోవాలో టిప్స్లో వివరంగా ఉంది చుడండి.

Aloo Capsicum Curry | Potato Capsicum Curry

టిప్స్

ఆలూ:

నేను దుంపలని చెక్కు తీసి ముక్కలుగా తరిగి నూనెలో వేపి చేసాను. మీరు కావాలంటే ఉడికించి వేపుకోవచ్చు, లేదా మెత్తగా ఉడికించిన దుంపని చేత్తో చిదిమి వేసుకొచ్చు.

కాప్సికం:

కాప్సికంకి బదులు మీరు ఫ్రెంచ్ బీన్స్ వేసుకోవచ్చు, ఇంకా బీన్స్తో పాటే కొన్ని కేరట్ ముక్కలు వేసుకోవచ్చు. కానీ ఆలూతో పాటే బీన్స్ కేరట్ వేసి వేపుకోవాలి.

అల్లం వెల్లులి పేస్ట్:

నేను ఇందులో అల్లం వెల్లులి వాడలేదు, నచ్చితే మీరు వేసుకోవచ్చు. ఇది నేను రోజూ తినే సింపుల్ కూరల తీరులో చేశాను

గరం మసాలా:

ఈ కూర చపాతీ, పులావుల్లోకి అయితే ఆఖార్తున కొద్దిగా గరం మసాలా చల్లుకోండి. వేయకపోయినా పర్లేదు.

కూర చిక్కబడితే:

కూరలో ఉన్న దుంపల కారణంగా చల్లారాక కూర చిక్కబడుతుంది. అలాంటప్పుడు కొద్దిగా వేడి నీళ్లు పోసి పలుచన చేసుకోండి.

వేరుశెనగ గుండ్లు:

వేరు సెనగ అందుబాటులో లేకపోతే జీడిపప్పు వాడుకోవచ్చు. లేదా పచ్చికొబ్బరి కొద్దిగా వేపి పేస్ట్ చేసి కూడా వాడుకోవచ్చు.

ఆలూ కాప్సికం కర్రీ - రెసిపీ వీడియో

Aloo Capsicum Curry | Potato Capsicum Curry | How to Make Aloo Capsicum Curry

Curries | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 20 mins
  • Total Time 25 mins
  • Servings 5

కావాల్సిన పదార్ధాలు

  • గ్రేవీ కోసం:
  • 2 tbsp నూనె
  • 1/4 cup వేరుశెనగ గుండ్లు
  • 4 పచ్చిమిర్చి
  • 1 ఉల్లిపాయ
  • 3 టమాటో
  • 1/2 tsp పసుపు
  • ఉప్పు
  • నీళ్లు - పేస్ట్ చేసుకోడానికి
  • కూర కోసం:
  • 4 tbsp నూనె
  • 3 చెక్కు తీసుకున్న దుంపలు
  • పసుపు - చిటికెడు
  • ఉప్పు - కొద్దిగా
  • 1 పెద్ద కాప్సికం ముక్కలు
  • 1 పెద్ద ఉల్లిపాయ ముక్కలు
  • 1 cup నీళ్లు
  • 1/2 tsp కారం
  • 1/4 tsp గరం మసాలా
  • కొత్తిమీర - కొద్దిగా

విధానం

  1. నూనె వేడి చేసి అందులో వేరు సెనగగుండ్లు వేసి చిట్లనివ్వాలి. చిట్లుతున్న పప్పులో ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసి మెత్తబడనివ్వాలి.
  2. మెత్తబడ్డ ఉల్లిపాయలో టమాటో ముక్కలు ఉప్పు పసుపు వేసి కలిపి మూతపెట్టి మెత్తగా మగ్గనివ్వాలి.
  3. మెత్తగా మగ్గిన వీటిని మిక్సీలో వేసి నీళ్లతో మెత్తని పేస్ట్ చేసుకోండి.
  4. కూర కోసం నూనె వేడి చేసి అందులో చెక్కుతీసుకున్న దుంప ముక్కలు కొద్దిగా పసుపు ఉప్పు వేసి కలిపి మూతపెట్టి లేత బంగారు రంగు వచ్చే దాకా వేపుకోవాలి.
  5. వేగిన దుంపల్లో ఒక కాప్సికం పెద్ద ముక్కలు, ఉల్లిపాయ పాయలుగా తరుకున్నది వేసి 2-3 నిమిషాలు వేపితే చాలు.
  6. తరువాత వేరుశెనగ పేస్ట్ నీళ్లు కారం వేసి కలిపి 7-8 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద దగ్గర పడనివ్వాలి. దింపే ముందు కాస్త గరం మసాలా కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి కలిపి మరో 2 నిమిషాలు ఉడికించి దింపేసుకోవాలి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

4 comments

Aloo Capsicum Curry | Potato Capsicum Curry