ఆంధ్రా స్టైల్ ఉల్లిపాయ పులుసు
అచ్చంగా ఉల్లిపాయలని నూనెలో వేపి చింతపండు పులుసు బెల్లంలో ఉడికించే ఆంధ్రా స్టైల్ ఉల్లిపాయ పులుసు పుల్లగా కారంగా తియ్యగా తిన్నకొద్దీ తినాలనిపించేలా ఉంటుంది.
ఉల్లిపాయ పులుసు వేడి వేడి అన్నంతో చాలా రుచిగా ఉంటుంది. చింతపండు వేసి చేసే పులుసులంటే దక్షిణ భారతదేశం వారికి ఎంతో ఇష్టం. అందులో తెలుగు వారికి ఇంకాస్త ఎక్కువ ఇష్టం. తెలుగు వారి పులుసులలో కాస్త పులుపు పాళ్ళు ఎక్కువే!!!
ఉల్లిపాయల పులుసు రాష్ట్రానికి ఒక్కో తీరులో ఉంటుంది. నేను ఇదివరకు చెట్టినాడు స్టైల్ ఉల్లిపాయ పులుసు చేసాను చుడండి. చెట్టినాడు స్టైల్ ఉల్లిపాయ పులుసు కాస్త చిక్కగా కొబ్బరీ కమ్మదనం, సోంపు పరిమళంతో ఉంటుంది.
ఆంధ్రుల ఉల్లిపాయ పులుసు కాస్త పలుచగా ఎక్కువ తియ్యగా పుల్లగా ఉంటుంది. ఈ సింపుల్ ఉల్లిపాయ పులుసు రోజూ వారి భోజనానికి, లంచ్ బాక్సులకి పర్ఫెక్ట్.

టిప్స్
ఉల్లిపాయలు:
సాంబార్ ఉల్లిపాయలు, మామూలు ఉల్లిపాయలు చీరి వాడితే పులుసు రుచి చాలా బాగుంటుంది. సాంబార్ ఉల్లిపాయలు లేనట్లయితే మీరు మామూలు ఉల్లిపాయలనే కాస్త మందంగా పొడవుగా చేరుకుని కూడా వాడుకోవచ్చు.
మరికొన్ని టిప్స్:
ఈ పులుసులో వేసే చింతపండుకి తగినట్లుగా కారం ఉప్పు బెల్లం ఉండాలి. అప్పుడే రుచి. బెల్లం నచ్చని వారు వదిలేయొచ్చు. కాబట్టి వేసే కారం మిరపకాయలు రుచి చూసి వేసుకోండి.
పులుసు సన్నని సెగ మీద ఎంత ఎక్కువసేపు మరిగితే అంత రుచి పులుసు చిక్కదనానికి బియ్యం పిండి వాడాను, నచ్చితే మీరు బియ్యంపిండికి బదులు సెనగపిండి కూడా గడ్డలు లేకుండా కలిపి వాడుకోవచ్చు.
తాలింపులో ఎర్రంగా వేపితేనే మెంతులు రుచినిస్తుంది పులుసుకి, లేదంటే చేదుగా తగులుతుంది పంటికి. అందుకే తాలింపు నెమ్మదిగా వేపుకోవాలి
ఆంధ్రా స్టైల్ ఉల్లిపాయ పులుసు - రెసిపీ వీడియో
Andhra Style Onion Stew | Ullipaaya Pulusu | How to Make Ullipaya Pulusu
Prep Time 2 mins
Cook Time 20 mins
Total Time 22 mins
Servings 5
కావాల్సిన పదార్ధాలు
- 1/2 cup ఉల్లిపాయ చీలికలు
- 10 - 12 సాంబార్ ఉల్లిపాయలు
- 1.5 tbsp నూనె (ఉల్లిపాయలు మగ్గించుకోడానికి)
- ఉప్పు
- 1 tsp కారం
- 3 tbsp బెల్లం
- ఉప్పు - రుచికి సరిపడా
- 1/4 tsp పసుపు
- 2 పచ్చిమిర్చి చీలికలు
- 1 tsp బియ్యం పిండి
- 3 tbsp నీళ్లు
- 300 ml చింతపండు పులుసు (50 gm చింతపండు నుండి తీసినది)
- 300 - 350 ml నీళ్లు
-
తాలింపు కోసం
- 1 tbsp నూనె (తాలింపుకి)
- 1 రెబ్బ కరివేపాకు
- 1/2 tsp ఆవాలు
- 1/2 tsp జీలకర్ర
- 1/2 tsp మెంతులు
- 2 ఎండుమిర్చి
- 2 చిటికెళ్లు ఇంగువ
విధానం
-
నూనె వేడి చేసి ఉల్లిపాయ తరుగు సాంబార్ ఉల్లిపాయలు ఉప్పు కారం వేసి కలిపి మూత పెట్టి ఉల్లిపాయల్ని మెత్తబడనివ్వాలి.
-
మెత్తబడ్డ ఉల్లిపాయల్లో చింతపండు పులుసు, నీళ్లు, బెల్లం, పచ్చిమిర్చి చీలికలు, పసుపు వేసి కలిపి మూత పెట్టి 15 నిమిషాలు మరగనివ్వాలి.
-
15 నిమిషాల తరువాత బియ్యంపిండిలో గడ్డలు లేకుండా నీళ్లు కలిపి పులుసులో కలిపి, మూత పెట్టి 2-3 నిమిషాలు చిక్కబడనివ్వాలి.
-
తాలింపు కోసం నూనె వేడి చేసి అందులో మెంతులు వేసి ఎర్రబడనివ్వాలి, ఎర్రబడుతున్న మెంతుల్లో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువా వేసి ఎర్రగా వేపి పులుసులో పోసి మరో 5 నిమిషాలు సన్నని సెగ మీద మరిగితే తాలింపు గుబాళింపు మెంతుల సారం అంతా పులుసులోకి దిగుతుంది.
-
దింపే ముందు ఒక్కసారి ఉప్పు సరి చూసి దింపేసుకోండి.

Leave a comment ×
2 comments