అరటిదూట బూందీ పెరుగు పచ్చడి | అరటిదూట బూందీ పెరుగు పచ్చడి రెసిపీ
అరటిదూట బూందీ పెరుగు పచ్చడి- అరటిదూట ముక్కలని సన్నగా తరిగి మెత్తగా ఉడికించి పెరుగులో మసాలాలు కలిపి ఉడికించుకున్న అరటిదూట ముక్కలు కలిపి దగ్గరగా ఉడికించి చిక్కబరిచి ఆఖరుగా బూందీ చల్లి చేసే ఈ పెరుగు పచ్చడి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.
పెరుగు పచ్చడులు అనేకం, అందులో ఇదొకటి. ఈ పెరుగు పచ్చడి ముందు కాస్త భారంగా ఉండే పదార్ధాలు తినేసి ఆఖరుగా తేలికగా అనిపించే పెరుగు తినే తీరు పచ్చడి కాదు. ఇది ఒక రకంగా కాస్త భారీగా ఉండే పచ్చడే, అంటే సాంబార్ తీరు. కాబట్టి ఈ పెరుగు పచ్చడి చేసిన రోజున ఏదో ఒక వేపుడో ఇగురో చేసుకుని ఈ అరటి దూట పెరుగు పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది.
పొట్ట సంబంధిత ఇబ్బందులున్నవారు అరటి దూటతో చేసే కూరలు లేదా ఇలా పెరుగు పచ్చడులు చేసుకుని తింటే చాలా మేలు చేస్తుంది. ఈ సింపుల్ అరటిదూట పెరుగు పచ్చడి తినడం తెలుగు వారు కాస్త తక్కువే అని చెప్పాలి. తమిళవారు కేరళవారు చాలా ఇష్టంగా ఎక్కువగా తింటారు.

టిప్స్
అరటిదూట:
-
ముందుగా చేతులకి నూనె రాసుకుని అరటిదూటని సన్నని చక్రాల మాదిరి కోసి వెంటనే అక్కడొచ్చే పీచుని వేలితో మెలితిప్పి లాగేసి వెంటనే బియ్యం పిండి నీరు లేదా మజ్జిగలో అయినా వేసేసుకోవాలి. లేదంటే ముక్కలు నల్లబడిపోతాయ్.
-
అరటిదూట ముక్కల నుంచి బాగా పీచుని లాగేయాలి లేదంటే దూటలోని పీచు రాదు ఆ పీచుతో తినలేరు.
-
చక్రాలుగా కోసుకున్న దూట ముక్కలని ఒకదాని మీద మరొకటి పేర్చి సన్నని చిన్న ముక్కలుగా కోసుకోవాలి. కోసిన ముక్కలు కోసుకున్నట్లు గా బియ్యం నీళ్లలో వేసేయాలి.
-
నేను అరటిదూట ముక్కలని విడిగా ఉడికించాను, మీరు కుక్కర్లో వండుకోదలిస్తే హై ఫ్లేమ్ మీద మూడు విజిల్స్ రానివ్వండి సరిపోతుంది.
అరటిదూట బూందీ పెరుగు పచ్చడి | అరటిదూట బూందీ పెరుగు పచ్చడి రెసిపీ - రెసిపీ వీడియో
Banana Stem Boondi Perugu Pachadi | Aratidhoota Boondi Perugu Pachadi
Prep Time 10 mins
Soaking Time 1 hr
Cook Time 20 mins
Total Time 1 hr 30 mins
Servings 8
కావాల్సిన పదార్ధాలు
- 200 gms అరటిదూట
- ½ litre పెరుగు
- 1 cup బూందీ
- ¼ tsp పసుపు
- ఉప్పు (రుచికి సరిపడా)
- 1 sprig కరివేపాకు (ఒక రెబ్బ)
- కొత్తిమీర (కొద్దిగా)
- 1 cup నీళ్లు
-
ఆవాల ముద్ద కోసం:
- ½ tsp ఆవాలు
- 1 tsp పచ్చిశెనగపప్పు
- 1 tsp కందిపప్పు
- ¾ tsp మిరియాలు
- 1 tbsp ధనియాలు
- 1 tsp జీలకర్ర
- 2 పచ్చిమిర్చి
- 2 ఎండుమిర్చి
- 1 tsp బియ్యం
- ⅓ cup పచ్చి కొబ్బరి
- అల్లం (చిన్న ముక్క)
-
తాలింపు కోసం:
- 2 tbsp నెయ్యి
- ½ tsp ఆవాలు
- ½ tsp జీలకర్ర
- 2 pinches ఇంగువ
- 1 sprig కరివేపాకు (ఒక రెబ్బ)
విధానం
-
ఆవాల ముద్ద కోసం ఉంచిన పదార్ధాలు అన్నింటిలో నీరుపోసి ఒక గంట నానబెట్టండి.
-
నానిన దినుసులన్నీ మిక్సర్ జార్లో వేసి పచ్చికొబ్బరి అల్లం ముక్క వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి.
-
రెండు చెంచాల బియ్యం పిండిలో నీరు పోసి కలిపి పక్కనుంచండి.
-
చేతులకి నూనె రాసుకుని అరటిదూటని సన్నని చక్రాల మాదిరి కోసి దూటలో వచ్చే పీచుని మెలితిప్పి లాగేయండి. ముక్కలని బియ్యం పిండి నీళ్లలో వేసేయండి.
-
అరటిదూట చక్రాలని ఒక దానిమీద ఒకటి పేర్చి సన్నని ముక్కలుగా కోసుకోండి. కోసుకున్న ముక్కలని బియ్యం పిండి నీళ్లలోనే వేసేయండి.
-
కుక్కర్లో లేదా విడిగా అరటిదూట ముక్కలని వేసి అందులో నీరూ, కొంచెం పసుపు ఉప్పు వేసి మెత్తగా ఉడికించుకోండి.
-
ఉడికిన ముక్కలని వడకట్టి పూర్తిగా చల్లారనివ్వండి.
-
పెరుగుని బాగా చిలకండి. చిలికిన పెరుగులో ఆవాల ముద్దా, ఉప్పు పసుపు నీరు కరివేపాకు వేసి కలిపి మీడియం ఫ్లేమ్ మీద రెండు పొంగులు రానివ్వండి.
-
పొంగుతున్న పెరుగు మిశ్రమంలో మెత్తగా ఉడికించి చల్లార్చుకున్న అరటిదూట ముక్కలు వేసి 4-5 నిమిషాలు ఉడికించండి.
-
4-5 నిమిషాలు ఉడికించిన తరువాత బూందీ వేసి కలిపి ఒకే నిమిషం ఉడికించి దింపేసుకోండి.
-
నెయ్యి వేడి చేసి అందులో మెంతులు ఆవాలు ఎండుమిర్చి జీలకర్ర ఇంగువ కరివేపాకు ఒకటి వేపుకున్నాక మరొకటి వేసి గుభాళించేట్టు తాలింపు వేపుకోండి.
-
వేగిన తాలింపుని పెరుగు పచ్చడిలో కలిపేసుకోండి.
-
ఈ పెరుగు పచ్చడి శరీరానికి ఎంతో చలువ చేస్తుంది ఇంకా చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment ×
3 comments