బెండకాయ పులుసు
పుల్లగా కారంగా చిక్కగా ఉండే ఆంధ్రా స్టైల్ బెండకాయ పులుసు ఒక్కటి చాలు ఆ పూట భోజనాన్ని తృప్తిగా ముగించడానికి. బెండకాయ ముక్కల్లో చిక్కని చింతపండు పులుసు పోసి చేసే ఈ పులుసు దాదాపుగా ప్రతీ తెలుగు వారింట్లో చేసుకునే సింపుల్ రెసిపీ.
భోజనంలో ఏదో ఒక కాయ కూరతో కాచే పులుసులు తిననిదే తెలుగు వారి భోజనానికి పరిపూర్ణత రాదు. అందుకే చింతపండు పులుసు పోసి చేసే పులుసులు తెలుగు వారితో పాటు దక్షిణాది రాష్ట్రాల వంటల్లో ప్రధానంగా కనిపిస్తాయి.
బెండకాయ పులుసు చిన్న మార్పులతో అంటే కాసింత మసాలాలు వేసి చేస్తారు, కొబ్బరి ముద్ద వేసి చేస్తారు, నేను చాలా సింపుల్ పద్ధతి చేస్తున్నాను. ఈ పద్ధతి చాలా సులభం అంతే రుచి కూడా.
చేసే ముందు టిప్స్ చదివి చేయండి బెస్ట్ బెండకాయ పులుసుని ఆస్వాదించండి.

టిప్స్
బెండకాయలు:
-
బెండకాయలు లేతగా ఉంటె పులుసు రుచి బాగుంటుంది. ఇంకా బెండకాయ అంగుళం పైన సైజు ముక్కలుగా తరుక్కోండి
-
బెండకాయ ముక్కలు నూనెలో బాగా వేగితే జిగురు తగ్గుతుంది.
ఉప్పు కారాలు:
పులుసులకి ఉప్పు కారాలు ఉండాలి అప్పుడే రుచి. నేను ఈ పులుసులో ఎండు కారం వేయలేదు. నచ్చితే మీరు వేసుకోవచ్చు.
సెనగపిండి:
పులుసుని చిక్కబరచడానికి ఇంకా కమ్మదనాన్ని సెనగపిండి నీళ్లు పోసి మరిగించాను, మీరు కావాలంటే బియ్యంపిండి నీళ్లు కూడా పోసుకోవచ్చు.
బెల్లం:
ఈ పులుసుకి కాస్త బెల్లం ఉంటేనే రుచి. ఆ తీపి తగినట్లుగా ఉప్పు కారాలు ఉండాలి, అప్పుడే రుచి. అచ్చంగా నేను చెప్పిన కొలత బెల్లం వేసి ఉప్పు కారాలు తగ్గితే తియ్యగా ఉంటుంది పులుసు.
బెండకాయ పులుసు - రెసిపీ వీడియో
Bendakaya Pulusu | Okra in tamarind gravy | Vendakkai Puli Kulambu | How to Make Bendakaya Pulusu
Prep Time 5 mins
Cook Time 20 mins
Total Time 25 mins
Servings 5
కావాల్సిన పదార్ధాలు
- 300 gms లేత బెండకాయ ముక్కలు (1 ఇంచ్ కట్)
- 3 tbps నూనె
- 1 tsp ఆవాలు
- 1/2 tsp మెంతులు
- 1 tsp జీలకర్ర
- 1 tsp పచ్చి సెనగపప్పు
- 1 tsp మినపప్పు
- 2 కరివేపాకు రెబ్బలు
- 1/2 cup ఉల్లిపాయ తరుగు
- 4 పచ్చిమిర్చి చీలికలు
- 2 ఎండుమిర్చి
- 1/4 tsp పసుపు
- 5 దంచిన వెల్లులి
- 400 ml చింతపండు పులుసు (పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు నుండి తీసినది)
- 1 tbsp సెనగపిండి నీళ్లు (పిండిలో 100ml కలిపినా నీరు)
- 3 tbsp బెల్లం
- ఉప్పు - రుచికి సరిపడా
విధానం
-
నూనె వేడి చేసి అందులో ఆవాలు మెంతులు సెనగపప్పు జీలకర్ర మినపప్పు, ఎండుమిర్చి ముక్కలు, దంచిన వెల్లులి, కరివేపాకు వేసి మెంతులు ఎర్రబడే దాకా వేపుకోవాలి.
-
వేగిన తాలింపులో ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయ మెత్తబడే దాకా వేపుకోవాలి.
-
వేగిన ఉల్లిపాయలో పసుపు బెండకాయ ముక్కలు వేసి కలిపి 5 నిమిషాలు పైన బెండకాయ ముక్కల పైన యెర్రని మచ్చలు ఏర్పడే దాకా వేపుకోవాలి.
-
వేగిన బెండకాయ ముక్కల్లో చింతపండు పులుసు ఉప్పు బెల్లం వేసి బెండకాయలు మెత్తబడే దాకా మూతబెట్టి మీడియం ఫ్లేమ్ మీద మరగనివ్వాలి.
-
బెండకాయ మెత్తబడ్డాక గడ్డలు లేకుండా కలుపుకున్న సెనగపిండి నీళ్లు పోసి కలిపి మరో 3-4 నిమిషాలు ఉడికించి దింపేసుకోండి. (పులుసు చిక్కగా అనిపిస్తే కాసిని నీళ్లు పోసి పలుచన చేసుకోండి).

Leave a comment ×
3 comments