బూందీ లడ్డు రెసిపీ | బూందీ లడ్డూ | లడ్డు రెసిపీ

బూందీ లడ్డు రెసిపీ- శెనగపిండిని జారుగా కలిపి నూనెలో ఎర్రగా వేపి ఒక తీగ చెక్కర పాకంలో ఊరేసి కట్టే లడ్డు వారం రోజుల తరువాత కూడా రసాలూరుతూ అమోఘంగా ఉంటుంది.

చూడడానికి అందరూ చేసే లడ్డూలాగే అనిపిస్తుంది కానీ కాదండి. ఈ తీరు లడ్డులో బూందీ ముత్యాల్లా వస్తాయి ఇంకా పాకం పెట్టే తీరు వాటి కొలతలు చాలా భిన్నం. ఈ చిన్న చిట్టి చిట్కాలతోనే రసాలూరి బూందీ లడ్డు తయారవుతుంది. 

రెసిపీ చేసే ముందు ఒక్కసారి కింద టిప్స్ కొలతలు జాగ్రత్తగా పాటిస్తూ చేయండి బెస్ట్ బూందీ లడ్డూని ఆస్వాదించండి. 

టిప్స్

శెనగపిండి:

  1. శెనగపిండిని బాగా జల్లించినదే వాడుకోండి.

నీరు:

  1. అట్టు పిండి కంటే కొంచెం పలుచగా కలుపుకోండి. 

బూందీ దూసే తీరు:

  1. బూందీ గరిటని బాగా మరిగే నూనెకి దగ్గరగా పెట్టి ఉంచాలి.

  2. బూందీ గరిట మధ్యన పిండి పోసి వదిలేస్తే పిండి వాటంత అవి మరిగే వేడి వేడి నూనెలో జారుతాయ్. బూందీ గరిటని తట్టడంగాని పిండిని గరిట మీద అట్టు పోసినట్లు తిప్పడం గాని చేయరాదు. అలా చేస్తే బూందీకి తోకలొస్తాయి. 

బూందీ ముద్దలుగా ఎందుకు వస్తుంది:

  1. మూకుడుకి మించి బూందీ పోసేస్తే నూనెలోకి జారే బూందీకి చోటులేక  ఒక దాని మీద మరో బూందీ పడి ముద్దలు ముద్దలుగా అవుతుంది, పిండి బాగా చిక్కగా అయినా బూందీ పూస ముద్దగా ఉంటుంది. 

బూందీ వేపే తీరు:

  1. కాస్త ఓపికగా పైన చెప్పిన టిప్స్ తీరులో వేపుకుంటే చక్కని గుండ్రంగా ముత్యాల్లాంటి బూందీ వస్తుంది.

  2. లడ్డుకి వేపే బూందీ మరీ ఎర్రగా కరకరలాడేట్టు వేపరాదు కాస్త మెత్తగానే ఉండాలి. 

పాకం:

  1. నా తీరు లాడ్డుకి శెనగపిండికి మూడింతల పంచదార, పంచదారకు సగం నీరు అవసరం అవుతుంది. 

  2. పంచదార కరిగి ఒక తీగ పాకం రాగానే దింపేసుకోండి చాలు, అంత కంటే అవసరం లేదండి. 

పాకం బిగుసుకుంటే:

  1. పాకం ఒక తీగ పాకం తీసుకుంటే అసలు పాకం బిగుసుకోవడం అనేది జరగదు. ఒక వేళ ఏ కారణం చేతనైన బూందీ వేశాక లడ్డు కట్టేప్పుడు పాకం బిగుసుకు పోతే కొంచెం నీరు వేసి పొయ్యి మీద పెడితే ఒదులవుతుంది అప్పడు లడ్డు కట్టుకోండి.  

బూందీ లడ్డు రెసిపీ | బూందీ లడ్డూ | లడ్డు రెసిపీ - రెసిపీ వీడియో

Best Boondi laddu | Boondi laddu Recipe | Perfect Boondi Laddoo recipe

Sweets | vegetarian
  • Prep Time 3 mins
  • Cook Time 1 hr
  • Resting Time 3 hrs
  • Total Time 4 hrs 3 mins
  • Servings 20

కావాల్సిన పదార్ధాలు

  • 1 kg శెనగపిండి
  • నీరు (తగినంత)
  • నూనె (వేపుకోడానికి)
  • పాకం కోసం:
  • 1 ½ kg పంచదార
  • 700 ml నీరు
  • డ్రై ఫ్రూట్స్:
  • 70 gms జీడిపప్పు
  • 30 gms ఎండు ద్రాక్ష
  • 2 pinches పచ్చకర్పూరం
  • 1 tsp యాలకులపొడి

విధానం

  1. బూందీ కోసం జల్లించిన శెనగపిండిలో నీరు పోసి గడ్డలు లేకుండా జారుగా కలుపుకోండి.
  2. పాకం కోసం పంచదారలో నీరు పోసి ఒక తీగ పాకం వచ్చేదాక మరిగించుకోండి.
  3. పాకం మరిగేప్పుడు పాకం పైన తేలే మలినాలని తీసేయండి, ఒక తీగా పాకం రాగానే పాకాన్ని దింపి పక్కనుంచుకోండి .
  4. మరిగే వేడి నూనెకి బూందీ గరిట దగ్గరికి పెట్టి పైన టిప్స్ లో చెప్పిన విధంగా ఎక్కువెక్కువ పిండి పోయకుండా మితంగా పిండి పోసుకుంటూ ముత్యాల్లాంటి బూందీ వేపుకోండి.
  5. వేగిన బూందీని తీసినది తీసి వేడి పాకంలో వేసి గరిటతో బూందీని పాకంలో ముంచండి, ఇలాగే మిగిలిన బూందీ అంతటిని వేగినది వేగినట్లుగా తీసి పాకంలో కలుపుతూ ఉండండి.
  6. పాకంలో వేసుకున్న బూందీని పాకంలోనే పూర్తిగా చల్లారనివ్వండి.
  7. రెండు గంటల తరువాత వడకట్టిన బూందిలో జీడిపప్పు, కిస్మిస్, కర్పూరం, యాలకులపొడి వేసి బాగా కలిపి చేతికి నెయ్యి రాసి గట్టిగా బూందీని పిండుతూ లడ్డుకట్టుకోండి.
  8. లడ్డు కట్టుకున్నాక ఒక గంట వదిలేస్తే లడ్డు బిగుసుకుంటుంది. ఈ తీరు లడ్డు వారం రోజుల తరువాత కూడా రసాలూరుతూ ఎంతో రుచిగా ఉంటుంది. (దయచేసి టిప్స్ని పాటిస్తూ చేయండి.)

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

479 comments