పాలకోవా
పాలకోవా దక్షిణ భరతదేశమంతటా చేస్తారు. అందులోనూ ఆంధ్రాలో అయితే మండలానికి ఒక తీరుగా చేస్తారు. ఏ ఊరి పాలకోవా ప్రేత్యేకత దానిదే. కొందరు ఎర్రగా కోవా చేస్తారు, ఇంకొందరు తీపి ఎక్కువగా ఇంకా కొందరు తరకలుగా తీస్తారు పాలకోవాని.
మరొకరు వెన్నలా పప్పుగుత్తితో ఏనుపుతారు. ఇలా చేతికో తీరు ఊరికో రుచి పాలకోవా చరిత్ర చాలా పురాతనమైనది. కవి సామ్రాట్ శ్రీనాథుడు ఎంతో ఇష్టంగా వర్ణించాడు పాలకోవా గురుంచి. ఇక తెలుగు సినిమాలో పాటలు మాటలు కవిత్వాలు చెప్పాలా ప్రేత్యేకంగా!
మైగ్రేన్ ఉన్నవారు సూర్యుడు ఉదయించడానికి మునుపే 2 చెంచాల పాలకోవా తింటే మైగ్రేన్ తగ్గుతుంది అంటోంది ఆయుర్వేదం.
పాలకోవా చేయడం చాలా తేలిక కానీ, కాస్త ఓపిక ఉండాలంతే! రెసిపీ చేసే ముందు టిప్స్ తెలుసుకుని చేస్తే బెస్ట్ పాలకోవా వస్తుంది.

టిప్స్
నాటు ఆవుపాలు:
• పాలకోవాకి కేవలం దేశవాళీ నాటు ఆవుపాలు వాడాలి. అప్పుడే పాలకోవా లేతగా వెన్నలా జారిపోతుంది నోట్లో. నా స్టైల్ పాలకోవాకి వెన్న శాతం తక్కువగా ఉండే ఆవు పాలు ఉత్తమం.
• గేదేపాలు లేదా జెర్సీ ఆవు పాలతో కూడా కోవా చేసుకోవచ్చు కానీ అందులోని వెన్న శాతానికి కోవా మృదుత్వం పోయి మరో రూపంలో ఉంటుంది కోవా. పైగా త్వరగా మీగడ కట్టేస్తుంది, ఆ మీగడ పాలల్లో కరగదు.
• అసలు గేదె పాలు వాడకూడదు అని కాదు గానీ ఆవుపాల కోవా రుచి చాలా ప్రేత్యేకం. ఆవుపాలు దొరకని వారు వెన్న శాతం తక్కువగా ఉండే పాలు వాడుకోవచ్చు.
నిమ్మరసం:
• కేవలం 4 చుక్కలు చాలు ఈ కొలత పాలకి. ఉంటే నిమ్మరసానికి బదులు చిన్న ఉప్పు రాయాంత పటిక(alum) వాడుకోండి. పటిక వాడితే కోవా తెల్లగా చాలా బాగుంటుంది.
పంచదార;
• నచ్చితే పంచదార కొలతకి బెల్లం కూడా వాడుకోవచ్చు. కానీ కరిగించిన బెల్లం పాకం పోసుకోండి. కానీ రంగు ఎర్రగా మారుతుంది.
బెస్ట్ పాలకోవా కోసం కొన్ని టిప్స్:
-
కోవా తయారు చేయడానికి లీటర్ పాలకి కనీసం మూడు లీటర్లు పట్టే ముకుడు ఉంటే మేలు
-
కోవా తయారీ కి “U” ఆకారంలో ఉండే మందపాటి ఇనుప మూకుళ్ళు లేదా నాన్-స్టిక్ పాన్లు చాలా మేలు. పని సులభమవుతుంది
-
పాలని కలపడానికి అట్లకాడలు బెస్ట్. ఇంకా కూరలకి వాడే గరిటలు వాడితే ఒక్కోసారి పాలు విరిగిపోతాయ్.
-
పాలు పోసాక స్టవ్ వెలిగించి హై- ఫ్లేమ్ మీద అడుగునుండి కలుపుతూనే ఉండాలి. కలపకపోతే పాలు మీగడ కట్టేస్తాయ్. ఆ మీగడ కోవాలో కరగదు తరకలుగా ఉండిపోయి అంత రుచిగా ఉండదు కోవా. అదే నాటు ఆవు పాలు వాడితే పొరపాటున మీగడ వచ్చినా అది లేతగా కడుతుంది, ఆ మీగడ కపితే కరిగిపోతుంది పాలల్లో. గేదె పాలతో వచ్చే చిక్కు ఇక్కడే, మీగడ మందంగా కడుతుంది, ఒక పట్టాన కరగదు.
-
ఈ పాలకోవాకి నెయ్యి లాంటివి అస్సలు అవసరం లేదు. మరిగిన పాలల్లోనే బోలెడు కొవ్వు ఉంటుంది, అదే సరిపోతుంది.
పాలకోవా - రెసిపీ వీడియో
Milk Khoya | Palakova | How to make Palakova Recipe
Cook Time 45 mins
Resting Time 2 hrs
Total Time 2 hrs 45 mins
Servings 4
కావాల్సిన పదార్ధాలు
- 1.5 liters ఆవు పాలు
- 4 చుక్కలు నిమ్మరసం
- 1/2 cup పంచదార
- 1/2 tsp యాలకల పొడి
విధానం
-
ఆవుపాలని పోసి హై – ఫ్లేమ్ మీద కలుపుతూ ఉండాలి .
-
20 నిమిషాలకి సాగమవుతాయి , 30 నిమిషాలకి చిలికిన చిక్కని పెరుగులా అవుతుంది.
-
చిలికిన పెరుగులా అయినా కోవా లో 4 చుక్కలు నిమ్మరసం వేసి బాగా కలిపితే 5 నిమిషాలకి సన్నని రవ్వలా అవుతుంది కోవా .
-
40 నిమిషాల తరువాత పంచదార వేసి బాగా కలిపితే 250ml అవుతుంది కోవా, అప్పుడు యాలకల పొడి వేసి కలిపి దింపేయాలి .
-
ప్లేట్ లో పలుచగా పోసి 2 గంటలు వదిలేయండి. తరువాత అట్లకాడతో లాగి సర్వ చేసుకోండి.

Leave a comment ×
4 comments