పుట్నాల చిక్కీ| వేపిన సెనగపప్పు పట్టి
ఎన్ని చిక్కీలున్నా వేపిన సెనగపప్పు చిక్కీ మాత్రం నాకు ఎంతో ఇష్టం! చిన్నప్పటి నుండి ప్రతీ చిల్లర కొట్లలో దొరుకుతుండడంవల్లో ఏమో! అసలే ఫూడీని కదా ఎప్పుడు ఒకేలా తినడం వల్ల కాదు మరి, అందుకే ఏవేవో ప్రయోగాలు చేస్తుంటాను.
ఓ రోజు ఖర్జూరం వేసి చేస్తే ఎలా ఉంటుదని ప్రయత్నించా అందరికి నచ్చింది. రుచి ఒకే! మరి సువాసన? అని యాలకలు గింజలుగానే వేసా తిన్నవరంతా వావ్ అన్నారు. అలా ఎన్నో ఏళ్ళుగా మా ఇంట్లో చేస్తున్న చిక్కీ రెసిపీ ఇది.
వేపిన సెనగాపప్పునే కొందరు పుట్నాలు అంటారు. అసలైన తెలుగు మాట వేపిన సెనగాపప్పే!

టిప్స్
పప్పు చెక్క కరకరలాడుతూ రావాలంటే:
• ముదురు పాకం రావాలి, పాకం ముదిరాక నీళ్ళలో పల్చగా ఓ తెరలా వేసి 30 సెకన్లు వదిలేసి విరపాలి. చల్లారిన పల్చని పాకం అప్పడంలా విరిగితే అది పర్ఫెక్ట్ పాకం
• కప్ బెల్లం పాకం లో వంట సోడా ¼ tsp మాత్రమే వేస్తే పాకం నురగనురగగా పొంగుతుంది. ఆ పొంగిన పాకం పప్పులకి పట్టి చల్లారాక గట్టిగా కరకరలాడుతూ ఉంటాయ్ చిక్కీలు
• పాకం మరుగుతున్నప్పుడు వేసే నెయ్యి పాకానికి మాంచి రంగునిస్తుంది
పాకం పొడిగా ఎందుకవుతుంది:
• కప్ బెల్లానికి ¼ tsp బేకింగ్ సోడానే వేయాలి అంతకు మించి వేస్తే పప్పులు వేసి కలిపాక పొడి పొడిగా అవుతుంది
చిక్కి కరిగి అంటుకోకుండా ఉండాలంటే:
• ఎయిర్ టైట్ డబ్బాలో చల్లని ప్రేదేశంలో ఉంచాలి.
సెనగపప్పుకి బదులు:
• వేపి పొట్టు తీసుకున్న వేరు సెనగపప్పు వేసుకోవచ్చు. నచ్చితే కొన్ని నువ్వులూ వేసుకోవచ్చు
• ఇంకా ఇందులో వేసిన ఎండు ఖర్జూరం, యాలక గింజలు ప్రేత్యేకమైన రుచినిస్తాయ్
• నచ్చితే గోరు వెచ్చగా ఉన్నప్పుడే చేతికి నెయ్యి రాసుకుని ఉండలు కూడా కట్టుకోవచ్చు.
పుట్నాల చిక్కీ| వేపిన సెనగపప్పు పట్టి - రెసిపీ వీడియో
Putnala Chikki - Candied Roasted Bengal Gram | How to make Putnala Chikki
Prep Time 5 mins
Cook Time 20 mins
Resting Time 1 hr
Total Time 1 hr 25 mins
Servings 8
కావాల్సిన పదార్ధాలు
- 1 cup బెల్లం తురుము
- 1 cup వేపిన సెనగపప్పు
- 3 Pieces ఖర్జూరం ముక్కలు
- 1 tsp నెయ్యి
- 4 - 5 యాలకల గింజలు
విధానం
-
బెల్లం తురుముని ముదురు పాకం వచ్చేలా కరిగించాలి.
-
మరుగుతున్న పాకం లో నెయ్యి వేసుకోవాలి
-
ముదిరిన పాకాన్ని చన్నీళ్ళలో పల్చగా వేయండి. 30 సెకన్లు వదిలేసి విరిపితే అప్పడంలా విరగాలి.
-
పాకం అప్పడం లా విరిగితే వంట సోడా వేసి పాకాన్ని మీడియం ఫ్లేం మీద బాగా కలిపితే పొంగుతుంది
-
పొంగిన పాకంలో ఖర్జూరం, వేపిన సెనగపప్పు, యాలక గింజలు వేసి పట్టి దగ్గరపడే దాకా మీడియం ఫ్లేం మీద కలిపి బాగా కలుపుకోవాలి. ముద్దగా అయ్యాక దిమ్పెసుకోవాలి. ముద్దగా అయిన పాకాన్ని తయారుగా ఉంచుకున్న సిల్వర్ ఫాయిల్ మౌల్డ్ లో పోసి సమంగా సర్దుకోవాలి
-
సిల్వర్ ఫాయిల్ని మౌల్డ్ నుండి తీసి నెయ్యి రాసిన అప్పడాల కర్రతో పల్చాగా అంటే ¼ ఇంచ్ కంటే కాస్త పల్చగా వత్తుకోవాలి.
-
వేడి మీద పప్పు చెక్క మీద గాట్లు పెట్టుకోవాలి. తరువాత రెండు-మూడు గంటలు చల్లారనివ్వాలి
-
చల్లారిన పప్పు చెక్కని గాలి చొరని డబ్బాలో ఉంచండి.

Leave a comment ×
4 comments