ఈసీ కుక్కర్ పరమాన్నం | చావల్ కి ఖీర్ | పాయసం
“పాయసం” అనే మాట సంస్కృతం మాట. “పయస్సు” అంటే పాలు సంస్కృతంలో. పాయసాన్ని తెలుగు వారు పొంగలీ, పరమాన్నం అని కూడా అంటారు. తమిళవారు అక్కరసి, సెక్కరై పొంగల్ అనీ అంటారు. మాలయాళీలు పాయసం అనే అంటారు. ఇంక పంజాబీ వారు పాలు, బియ్యం, పంచదార వేసి “చావల్ కి ఖీర్” అంటారు. ముస్లిమ్స్ కూడా చావల్ కి ఖీర్ చేస్తారు. కానీ వారి విధానం భిన్నం. మొత్తానికి యావత్ భారతదేశం అంతటా “పాయసం” చేస్తారు. భారతదేశంలో మిగిలిన రాష్ట్రాల మాట ఎలా ఉన్నా, తెలుగు వారికి పరమాన్నం ఎంతో పవిత్రమైన పదార్ధం. ప్రతీ శుభకార్యానికి పాయసం వండాల్సిందే! పాయసం ప్రసాదం గురుంచి వేదాలలో ఉందంటారు, అందుకే దాదాపుగా ప్రతీ ఆలయాల్లో పాయసాన్ని ప్రసాదంగా ఇస్తారు. ఇంకా ఆయుర్వేదంలో పాయసానికి ప్రేత్యేకమైన స్థానం ఉంది. ఆలాంటి పాయసాన్ని నేను ఈ రెసిపీ లో చాలా సింపుల్గా చేస్తున్నా. అసలైన పద్ధతి ఇంకా సులభం. నెయ్యి, డ్రై - ఫ్రూట్స్ ఏవీ వేయారు. ఆ పద్ధతి మరో సారి చెప్తా. ఈ పాయసం నా చిట్టి చిట్కాలతో చేస్తే పాయసం బెల్లం వేసినా విరగదు. ఎంతో కమ్మగా అదే రుచితో ఉంటుంది. పండుగలప్పుడు ఈ స్టైల్ లో పరమన్నం చేస్తే పని సులభమవుతుంది.
పాలు :
• సంప్రదాయంగా చేయాలంటే పాయసాన్ని ఆవుపాలతో చేస్తారు. నేను రుచిగా చేయడానికి చిక్కని గేదె పాలు వాడుతున్నా.
• పాలు చిక్కగా ఉంటే పాయసం చాలా రుచిగా ఉంటుంది.
• నేను ఈ పాయసంలో బియ్యం, పాలు సమానంగా, నీళ్ళు 1.1/2 తీసుకున్నా. ఇలా నీళ్ళు పాలు కలిపి వండితే బియ్యం త్వరగా ఉడుకుతుంది. లేదా చిక్కని పాలల్లో ఉడకాలంటే చాలా టైమ్ పడుతుంది.
• అసలైతే చిక్కని పాలతో నిదానంగా బియ్యం ఉడికితే పాయసం రుచి చాలా గొప్పగా ఉంటుంది.
బెల్లం:
• బెల్లం తురుమి కొద్దిగా నీళ్ళు వేసి బెల్లం కరిగించి వడకడితే బెల్లంలో ఉండే తుక్కు, ఇసుక పోతుంది.
పచ్చకర్పూరం:
• పాయసంలో వేసే చిటికెడు పచ్చకర్పూరం పాయసానికి ప్రేత్యేకమైన రుచినిస్తుంది.

టిప్స్
• పాయసానికి నేను సోనామసూరి బియ్యం, పెసరపప్పు 30 నిమిషాలు నానబెట్టి వాడాను. బియ్యం, పెసరపప్పు నానితే పాయసం సులభంగా ఉడుకుతుంది.
• పాయసం ఇంకా కమ్మగా ఉండాలంటే పాలు పెంచుకోవచ్చు.
• పాయసాన్ని లో – ఫ్లేమ్ మీదే కుక్కర్లో 3-4 కూతలు వచ్చేదాకా వండుకోవాలి. అప్పుడు మెత్తగా ఉడుకుతుంది పాయసం
• టైమ్ ఉంటే బెల్లం పాకం పోసాక పాయసాన్ని సన్నని సెగ మీద కలుపుతూ ఎక్కువ సేపు వండితే పాయసం పాకంలో ఉడికి ఉడికి రుచి పెరిగి మాంచి రంగు తిరుగుతుంది. టైమ్ లేదనుకుంటే పాకం పోసాక పాయసం రెండు పొంగులు రాగానే దింపేసుకోవచ్చు.
• ఈ పద్ధతిలో అంటే కుక్కర్లో ముందే బియ్యాన్ని పాలల్లో మెత్తగా ఉడికించి తరువాత బెల్లం పాకం పోసి వండితే పాయసం విరగదు.
ఈసీ కుక్కర్ పరమాన్నం | చావల్ కి ఖీర్ | పాయసం - రెసిపీ వీడియో
Easy Cooker Kheer | Rice Kheer | Payasam or Paramannam
Prep Time 2 mins
Soaking Time 30 mins
Cook Time 20 mins
Total Time 52 mins
Servings 4
కావాల్సిన పదార్ధాలు
- 1/2 cup బియ్యం (30 నిమిషాలు నానబెట్టినది)
- 2 tbsps పెసరపప్పు (30 నిమిషాలు నానబెట్టినది)
- 1/2 cup పాలు
- 1.5 cup నీళ్ళు
- 1.5 cup బెల్లం
- 1/4 cup నీళ్ళు - బెల్లం కరిగించడానికి
- 3 యాలకలు
- 3 tbsps నెయ్యి
- 10 జీడిపప్పు
- 3 tbsps ఎండు ద్రాక్ష
- 1/2 tsp యాలకల పొడి
విధానం
-
కుక్కర్లో పాలు, నీళ్ళు, బియ్యం వేసి లో – ఫ్లేమ్ మీద 3 కూతలు వచ్చేదాకా వండుకోండి .
-
మరో పాన్లో బెల్లం తురుము కొద్దిగా నీళ్ళు పోసి బెల్లం కరిగించి వాడకట్టుకోవాలి .
-
మెత్తగా ఉడికిన పాయసంలో వాడకట్టిన పాకం పోసి పాయసన్ని 3-4 నిమిషాలు కలుపుతూ ఉడికించాలి. ఉడుకుతున్న పరమాన్నంలో పచ్చకర్పూరం వేసి కలుపుకోవాలి .
-
పాన్లో నెయ్యి కరిగించి అందులో జీడిపప్పు కిస్మిస్ వేసి కిస్మిస్ని వ పొంగు రానిచ్చి ఉడుకుతున్న పరమాన్నంలో కలిపేయాలి అలాగే యాలకలపొడి కూడా.

Leave a comment ×
2 comments