కాకరకాయ వేపుడు | కాకరకాయ ఫ్రై | చేదు లేని కాకరకాయ వేపుడు
కాకరకాయ వేపుడు | చేదు లేని కాకరకాయ వేపుడు కాకరకాయ ముక్కల్లో ఉప్పు పసుపు వేసి ఊరనిచ్చి, అందులో నుంచి పసరు పిండి నూనెలో ఉల్లి కాకరకాయ ముక్కలు వేసి ఎర్రగా వేపి ఉప్పు కారం బెల్లం వేసి చేసే ఈ తీరు కాకరకాయ వేపుడు కనీసం వారం రోజుల వరకు నిలవుంటుంది, వేడి అన్నంతో అద్భుతంగా ఉంటుంది.
కాకరకాయ వేపుడులు చాలా తీరుల్లో చేస్తారు, ఈ తీరు కాకరకాయ వేపుడు చేదు చాలా మితంగా ఉంటుంది, తీపి కారంతో కలగలిపిన రుచితో చాలా రుచిగా ఉంటుంది.

టిప్స్
కాకరకాయ:
•కాకరకాయ ముక్కలని మీడియం సైజు ముక్కలుగా తరుక్కోండి. మరీ సన్ననివి తరుక్కుంటే వేగాక ఇంకా చిన్న పలుకులు మాదిరి అయిపోతాయి.
•నేను లేత కాకరకాయ వాడాను, మీరు కావాలనుకుంటే గింజలున్న కాకరకాయ కూడా వాడుకోవచ్చు. అలాగే గింజల్ని కూడా వేసి వేపుకుంటే చాలా బాగుంటుంది.
•మీరు చేదు తినే వారైతే కాకరకాయ పైన ఉండే చెక్కు తీయకుండా అలాగే సన్నని ముక్కలు తరిగి వేసుకోండి.
•చేదు తక్కువగా తినేవారైతే కాకరకాయ ముక్కల్లో ఉప్పు పసుపు వేసి ఊరనిచ్చి గట్టిగా పిండితే చేదుగా ఉండే పసరు దిగిపోతుంది. వేగాక కాకరకాయ చేదు చాలా మితంగా ఉంటుంది.
కాకరకాయ వేపే తీరు:
•కావలిసిన పదార్ధాలన్నీ నూనెలో వేసి మీడియం ఫ్లేమ్ మీద ముక్కలు మగ్గి ఎర్రబడడం మొదలవుతుంది అందాక వేపుకున్నాక బెల్లం సన్నని తరుగు వేసుకోవాలి. దింపేబోయే ముందు కారం వేసుకోవాలి. కారం ముందుగానే వేస్తే మాడిపోతుంది.
•ముక్కలు నిదానంగా వేగితే వేపుడు ఎక్కువ రోజులు నిలవుంటుంది.
కాకరకాయ వేపుడు | కాకరకాయ ఫ్రై | చేదు లేని కాకరకాయ వేపుడు - రెసిపీ వీడియో
Bitter Gourd Fry | Kakarakaya Fry (without bitter taste) | Kakarakaya Vepudu
Prep Time 10 mins
Cook Time 30 mins
Resting Time 1 hr
Total Time 1 hr 40 mins
Servings 5
కావాల్సిన పదార్ధాలు
- ½ kg చెక్కు తీసుకుని తరుక్కున ముక్కలు
- 1 cup ఉల్లిపాయ కాస్త మందంగా ఉండే చీలికలు
- 10 -12 cloves దంచిన వెల్లుల్లి
- ½ tsp జీలకర్ర
- ¼ cup బెల్లం
- ⅓ cup నూనె
- 1 ½ - 2 tbsp కారం
- 2 sprigs కరివేపాకు
- ¼ tsp పసుపు
- ఉప్పు - రుచికి సరిపడా
విధానం
-
చెక్కు తీసుకున్న కాకరకాయని కాస్త మీడియం సైజు ముక్కలుగా తరుక్కోండి.
-
తరుక్కున్న ముక్కల్లో ఉప్పు పసుపు వేసి కలిపి గంటసేపు ఊరబెట్టండి. గంట తరువాత గట్టిగా పిండి పసరు తీసేయండి.
-
నూనె వేడి చేసి అందులో జీలకర్ర వెల్లులి వేసి కాకరకాయ ముక్కలు ఉల్లిపాయ చీలికలు కరివేపాకు ఉప్పు వేసి కలిపి కనీసం 20 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద వేగనివ్వండి.
-
20 నిమిషాల తరువాత పసుపు బెల్లం తురుము వేసి ఇంకో 5-7 నిమిషాలు వేగనివ్వండి
-
దింపబోయే ముందు కారం వేసి కలిపి దింపేసుకోండి. పూర్తిగా చల్లారిన తరువాత డబ్బాలో ఉంచుకుంటే వారం రోజులు నిలవుంటుంది.

Leave a comment ×
2 comments