క్యాబేజి కంది పచ్చడి రెసిపీ - కందిపప్పుని ధనియాలు వెల్లులి జీలకర్రని ఎర్రగా గుభాళించేలా వేపి అందులో కొబ్బరి ఆవిరి మీద ఉడికించి వేపిన క్యాబేజీ వేసి మెత్తగా రుబ్బి తాలింపు పెట్టి చేసే కమ్మని పచ్చడి తింటే దాని రుచి జీవితంలో మర్చిపోవడం అసాధ్యం!!!

కంది పచ్చడి రుచి గురుంచి ఏ తెలుగు వారిని అడిగినా చెబుతారు, అంతలా ఇష్టపడతారు ఆంధ్రులు. తెలుగువారింట శుభకార్యం అంటే తప్పక చేస్తారు కందిపచ్చడి. అయితే సంప్రదాయం చేసే కందిపచ్చడికి ఇది కాస్త లేటెస్ట్ రెసిపీ.

అదనంగా క్యాబేజీ పచ్చికొబ్బరి వేసి చేసే ఈ క్యాబేజీ కంది పచ్చడి మరింత రుచిగా ఉంటుంది. వేడి నెయ్యి అన్నంతో అయితేనే అట్టు ఇడ్లీ దేనితోనైనా నంజుడుగా చాలా గొప్పగా ఉంటుంది.

ఈ క్యాబేజీ కంది పచ్చడి చాలా ఏళ్ళ క్రితం నేను కోనసీమ రాజుల భోజనాల్లో తిన్నాను, తరువాత వారిని అడిగి తెలుసుకుని ఈ రెసిపీని మీకు చెబుతన్నాను. తప్పక ప్రయత్నించండి మీకు నచ్చుతుంది.

టిప్స్

కందిపప్పు:

కందిపప్పు సన్నని సెగ మీద కలుపుతూ వేపితే పప్పు లోపలి దాకా వేగి ఘుమఘుమలాడిపోతుంది, పప్పు అలా వేగాలి కూడా, అలా నిదానంగా వేగితే పచ్చడికి రుచి.

రెండున్న కప్పుల క్యాబేజీకి పావు కప్పు అంటే 60gms కందిపప్పు సరిపోతుంది. పప్పు ఈ కొలత క్యాబేజీకి ఇంతకంటే ఎక్కువగా ఉంటె రుచిగా ఉండదు పచ్చడి.

ఎండుమిర్చి/పచ్చిమిర్చి:

సాధారణంగా ఎండుమిర్చి వాడే చేస్తారు కందిపచ్చడి, నేను సగం ఎండుమిర్చి సగం పచ్చిమిర్చి వేసి చేశాను, మీరు మీకు నచ్చినట్లుగా ఏదైనా వేసి చేసుకోండి. ఎండుమిర్చి వాడితే పచ్చడి ఎర్రగా ఉంటుంది.

వెల్లులి:

ఇష్టపడని వారు వేయకున్నా పర్లేదు.

క్యాబేజీ:

క్యాబేజీని కాస్త పెద్ద ముక్కలుగానే తరుక్కోండి, మరీ సన్నని ముక్కలు తిరిగితే వేగిన తరువాత ఇంకా చిన్నవిగా అయిపోతాయి, గ్రైండ్ చేశాక ఇంక అసలు కనిపించవు. పచ్చడిలో కలిపసిపోతుంది.

చింతపండు:

చింతపండు నానబెట్టి వేస్తే మెత్తగా నలిగి పచ్చడిలో కలిసిపోతుంది.

ఇంకా మీరు ఇలా చేసుకోవచ్చు:

కందిపప్పుకి బదులు సెనగపప్పు, పెసరపప్పు ఇలా ఏదైనా ఇదే కొలతకి మార్చి చేసుకోవచ్చు.

పచ్చడి రుబ్బే తీరు:

నిజానికి కందిపచ్చడి మిక్సీలో రుబ్బే కంటే రోట్లో దంచి రుబ్బితేనే అసలైన రుచి. కానీ నేను మిక్సీలో కాస్త బరకగా రవ్వగా రుబ్బాను. కంది పచ్చడి రవ్వగానే ఉండాలి మెత్తగా గుజ్జుగా ఉండకూడదు.

క్యాబేజి కంది పచ్చడి రెసిపీ - రెసిపీ వీడియో

Cabbage Kandi Pachadi Recipe | Cabbage Kandi Chutney Recipe | Perfect Tips for Making Cabbage Kandi Pachadi

Pickles & Chutneys | vegetarian
  • Prep Time 2 mins
  • Cook Time 20 mins
  • Total Time 22 mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • 1/2 tbsp ధనియాలు
  • 1/4 cup కందిపపప్పు
  • 6 పచ్చిమిర్చి
  • 3 ఎండుమిర్చి
  • 1/4 cup పచ్చికొబ్బరి
  • 4 - 5 Cloves వెల్లులి
  • 1 tsp జీలకర్ర
  • నానబెట్టిన చింతపండు - చిన్న నిమ్మకాయంత
  • 2 ½ cups క్యాబేజీ
  • 2 tbsp నూనె
  • ఉప్పు - రుచికి సరిపడా
  • తాలింపు కోసం:
  • 1 tbsp నూనె
  • 1 tsp ఆవాలు
  • 1 tsp మినపప్పు
  • 1 tsp జీలకర్ర
  • 2 ఎండుమిర్చి
  • ఇంగువ - కొద్దిగా
  • 2 sprigs కరివేపాకు
  • 1/4 tsp పసుపు

విధానం

  1. క్యాబేజీ మీడియం సైజు తరుగుని 8-10 నిమిషాలు స్టీమ్ చేసి తీసుకోండి
  2. నూనె వేడి చేసి ధనియాలు, కందిపప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి వెల్లులి జీలకర్ర వేసి సన్నని సెగ మీద ఎర్రగా వేపుకోండి.
  3. వేపుకున్న పప్పుని, కొబ్బరి, నానబెట్టుకున్న చింతపండు, ఇవన్నీ మిక్సర్ జార్లోకి తీసుకుని చల్లారనివ్వండి.
  4. మిగిలిన నూనెలో ఆవిరి మీద మగ్గిన క్యాబేజీ తరుగు వేసి కాస్త రంగు మారేదాకా వేపుకుంటే క్యాబేజీకున్న పసరు వాసన పూర్తిగా పోతుంది. అప్పుడు తీసి పక్కనుంచుకోండి.
  5. చల్లారిన కందిపప్పులో తగినన్ని నీరు వేసి కాస్త బరకగా, అంటే గోధుమరవ్వ అంత బరకాగా గ్రైండ్ చేసుకోండి. (అవసరం మేరకు నీరు వేసుకోండి, కానీ పచ్చడి గట్టిగా ఉండాలి).
  6. బరకగా రుబ్బుకున్న పచ్చడిలో క్యాబేజీ వేసి రెండు మూడు సార్లు పల్స్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేయకూడదు.
  7. తాలింపుకోసం నూనె వేడి చేసి, తాలింపు సామాగ్రీ ఒక్కోటిగా వేస్తూ ఎర్రగా వేపి పచ్చడిలో కలిపేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.