పెళ్ళిళ్ళ స్పెషల్ ఇన్స్టంట్ మామిడికాయ ముక్కల పచ్చడి

పెరుగన్నంలోకి వేడి వేడిగా అన్నంలోకి రుచిగా ఉండే ఇన్స్టంట్ పెళ్ళిళ్ళ స్పెషల్ మామిడికాయ పచ్చడి రెసిపీ టిప్స్ ఇంకా స్టెప్ బై స్టెప్ ఇమేజెస్తో వీడియోతో ఉంది.

మామిడికాయ పచ్చడి అంటే భారతీయులకి ఎంతో ఇష్టం , అందులోనూ తెలుగు వారికి మాత్రం విడదీయలేని అనుబంధం అంటాను. అందుకే ఎన్ని రకాల మామిడికాయ పచ్చళ్ళో తెలుగువారికి. కొత్త మామిడికాయ పచ్చడి “వేడి వేడి అన్నంలో నెయ్యి లేదా నూనె వేసుకుని తింటే”...అనే మాట చదువుతుంటేనే నోట్లో నీళ్ళూరుతాయ్ తెలుగు వారికి అంత ఇష్టం మామిడికాయ పచ్చడి.

మామిడికాయ పచ్చడికి ఎన్నో తీరులు, ఆ తీరుల్లో ఒకటి ఈ ఇన్స్టంట్ పచ్చడి. ఇది ప్రత్యేకించి వేసవిలో జరిగే తెలుగు వారి పెళ్ళిళ్ళలో తప్పక వడ్డిస్తారు. పెరుగన్నంలోకి చాలా బాగుంటుంది.

ఈ పచ్చడి ఆవ పిండి వేసి పెట్టె తీరుగా సంవత్సరం అంతా నిలవుండదు, 2-3 రోజులు ఉంటుంది అంతే. ఫ్రిజ్ లో ఉంచితే మరో రెండు రోజులు ఉంటుంది. పచ్చడి అంటే ఎంత ఇష్టమున్నా వేడి చేస్తుందని ఎండాకాలంలో తినడానికి కాస్త జంకుతారు, కానీ ఈ పచ్చడి వేడి చేయదు, ఎందుకంటే ఈ పచ్చడికి వాడే ఉప్పు కారాలు కూరలో వేసినట్లే వేస్తాము, కాబట్టి వేడి చేయదు. ఇంకా ఈ పచ్చడి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టేసుకోవచ్చు. ఇంక కొత్త మామిడికాయ పచ్చడి రుచి గురుంచి చెప్పక్కర్లేదు, కచ్చితంగా నాలుగు ముద్దలు తినేస్తారు.

ఈ పచ్చడి రుచి అంతా లేత టెంక కూడా రాని మామిడి ముక్కల్లోనే ఉంది. ఇంకా కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి అవి ఫాలో అవుతూ చేయండి బెస్ట్ పచ్చడి ఎంజాయ్ చేయండి.

Wedding Special Instant Mango Pieces Chutney | Instant Mango Pickle Recipe | How to make Mango Pickle

టిప్స్

మామిడికాయ:

  1. మామిడికాయ లేతది టెంక కూడా ఏర్పడని మామిడికాయ రుచి బాగుంటుంది. టెంకతో ఉన్న కాయలో పీచు ఉంటుంది, దాని వల్ల ముక్క త్వరగా మెత్తబడదు. అంటే ఇదే కొలతల్లో ఉప్పు కారం వేసినా కనీసం ఒక రోజు ఆగాలి ముక్క ఊరడానికి.

  2. మామిడికాయని కడిగి తుడిచి ఆరబెట్టి సన్నని ముక్కలు కోసుకోండి.

ఉప్పు :

  1. రాళ్ళ ఉప్పు వేసి మామిడి ముక్కలకి పట్టించి 30 నిమిషాలు ఉంచితే ముక్కలు సాఫ్ట్ అవుతాయ్, అప్పుడు ఫ్లేవర్స్ అన్నీ ముక్కకి పట్టి 2-3 గంటల్లో పచ్చడి తయారవుతుంది.

  2. ఉప్పు నేను కూరలో వేసినట్లే వేశాను. నిజానికి అది సరిపోతుంది. అలా వేశాను కాబట్టే ఎంత తిన్నా పచ్చడి వేడి చేయదు.

కారం:

నేను తెలుగు వారు పచ్చళ్ల కోసం ప్రేత్యేకంగా వాడే కారం వేశాను. ఈ కారం మాంచి రంగుతో పాటు, మామూలు కూరల్లో వేసే కారం కంటే ఘాటుగా కారంగా ఉంటుంది. దొరకని వారు నచ్చని వారు మామూలు కారం వాడుకోవచ్చు.

నూనె:

నేను రిఫైన్డ్ వేరుశెనగ నూనె వాడాను. ఈ పచ్చడి నిలవ ఉండదు కాబట్టి మామూలు రిఫైన్డ్ నూనె కూడా బాగుంటుంది.

ఇంగువ :

నచ్చకపోతే వేయకండి కానీ వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది.

పచ్చడి:

పచ్చడి చేసిన 2-3 గంటలకి అల్లం ముక్కలు పూర్తిగా ఊరవు కాబట్టి పెరుగన్నంలోకి చాలా బాగుంటుంది. 12 గంటల తరువాత వేడి వేడిగా అన్నంలోకి చాలా బాగుంటుంది.

పెళ్ళిళ్ళ స్పెషల్ ఇన్స్టంట్ మామిడికాయ ముక్కల పచ్చడి - రెసిపీ వీడియో

Wedding Special Instant Mango Pieces Chutney | Instant Mango Pickle Recipe | How to make Mango Pickle

Pickles & Chutneys | vegetarian
  • Prep Time 5 mins
  • Soaking Time 30 mins
  • Cook Time 5 mins
  • Total Time 40 mins
  • Servings 12

కావాల్సిన పదార్ధాలు

  • 300 gms లేత మామిడి కాయ ముక్కలు
  • 2 tbsps అల్లం ముక్కలు
  • 1/2 tsp మెంతులు
  • 1/2 tbsp రాళ్ళ ఉప్పు
  • 75 ml నూనె
  • 1/4 tsp ఇంగువ
  • 1 tsp ఆవాలు
  • 2.5 tbsps ఉప్పు
  • 3.5 tbsps కారం
  • 1 tbsp నిమ్మరసం

విధానం

  1. మామిడి ముక్కల్లో అల్లం ముక్కలు ఉప్పు వేసి తడి లేని గరిటతో కలిపి 30 నిమిషాలు ఊరనివ్వాలి.
  2. మెంతులు వేసి సన్నని సెగ మీద ఎర్రగా వేపి అందులో ½ tsp రాళ్ళ ఉప్పు వేసి మెత్తగా దంచుకోవాలి. (ఇంత కొంచెం మిక్సీలో నలగదు అందుకే దంచాను).
  3. నూనె వేడి చేసి ఆవాలు వేసి చిటచిటలాడించి స్టవ్ ఆపేసి నూనె గోరు వెచ్చగా అయ్యేదాక చల్లరనివ్వాలి.
  4. అందులో ఇంగువ బాగా కలుపుకోండి, ఆ తరువాత ఊరబెట్టిన మామిడి ముక్కలు, కారం ఉప్పు, నిమ్మరసం, మెంతి పిండి వేసి బాగా కలుపుకోండి.
  5. కలిపిన ఈ పచ్చడిని 2 గంటలైనా ఊరబెట్టాలి. ఇంకా 3 -4 రోజులు నిలవ ఉంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

2 comments

  • C
    Chandana
    Recipe Rating:
    Mango pickle is super andi..My kid also liked it very much..👍
  • S
    Sreevalli Navuluri
    Please post recepies in cups also.For people in usa,its hard to follow as we dont get anything in gms here.Please post more pickles and healthy recepie options
Wedding Special Instant Mango Pieces Chutney | Instant Mango Pickle Recipe | How to make Mango Pickle