చల్ల మిరపకాయల కారం పొడి | సింపుల్ కారం పొడి రెసిపీ
టైమ్ లేనప్పుడు లేదా ఏమి వండాలో తెలియనప్పుడు ప్రతీ ఇంట్లో ప్రతీ బ్యాచిలర్ దగ్గర ఉండాల్సిన పొడి చల్ల మిరపకాయ కారం పొడి. ఈ సింపుల్ కారం పొడి రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియో తో కూడా ఉంది చూడండి.
తెలుగు రాష్ట్రాలలో కారం పొడులు అనేకం. అందులో ఇదొకటి. ఈ చల్ల మిరపకాయల కారం పొడి ఇడ్లీ అట్టుతో పాటు వేడి వేడిగా అన్నం లో నెయ్యి వేసుకుని తిన్నా చాలా రుచిగా ఉంటుంది.
“చల్ల” అంటే మజ్జిగా అని అర్ధం తెలుగులో. మజ్జిగలో ఊరేసిన మిరపకాయలు కాబట్టి చల్ల మిరపకాయలు అయ్యాయి. చల్ల మిరపకాయలు దక్షిణాదిన అన్ని రాష్ట్రాల వారు చేస్తారు.
చల్ల మిరపకాయల కారం పొడి అన్నంలోకే కాదు వంకాయ, బెండకాయ, దొండకాయ, కాకరకాయ వేపపుళ్ళలో ఆఖరున వేసి దింపేసుకోవచ్చు. వేపుడు పుల్లగా కారంగా ఘాటుగా చాలా బాగుంటుంది.

టిప్స్
ఏ కొలతకి చేసిన ఇవీ కొలతలు: సెనగపప్పు లో సగం కొబ్బరి, కొబ్బరి లో సగం మిరపకాయలు, మిరపకాయాల్లో పావు వెల్లులి, జీలకర్ర ఉండాలి.
వేపిన శెనగపప్పు/పుట్నాల పప్పు: వేపిన సెనగపప్పు వేపినదే అయినా పొడి చేయడానికి ముందు మరో సారి పప్పు వేడెక్కేదాకా వేపుకుంటే పొడి రుచి బాగుంటుంది.
చల్ల మిరపకాయలు: చల్ల మిరపకాయల కారాన్ని బట్టి పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోండి. ఒక వేళ పొడి తయారయ్యాక పొడి కారం సరిపోకపోయినా మిరపకాయలు వేపి పొడి చేసి కలుపుకోవచ్చు.
ఉప్పు: చల్ల మిరపకాయాల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు కొద్దిగానే అవసరం అవుతుంది.
చల్ల మిరపకాయల కారం పొడి | సింపుల్ కారం పొడి రెసిపీ - రెసిపీ వీడియో
Spicy Mirchi Powder with Chillies soaked in Buttermilk | Buttermilk Chilli Podi | Challa Mirapakaya Karam Podi
Prep Time 1 min
Cook Time 10 mins
Total Time 11 mins
Servings 35
కావాల్సిన పదార్ధాలు
- 250 gm వేపిన శెనగపప్పు
- 125 gm ఎండు కొబ్బరి
- 75 gm చల్ల మిరపకాయలు
- 35 gm వెల్లులి
- 35 gm జీలకర్ర
- ఉప్పు – కొద్దిగా
- నూనె- మిరపకాయలని వేపుకోడానికి
విధానం
-
నూనె లో చల్ల మీరపకాయలని ఎర్రగా వేపి తీసి పక్కనుంచుకోండి.
-
మిగిలిన పదార్ధాలన్నింటిని ఒక్కోటిగా వేపుకుని తీసుకోండి.
-
వేపుకున్న మిరపకాయల తొడిమలు తీసేసి కొద్దిగా ఉప్పు వేసి అన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
-
గ్రైండ్ చేసుకున్న పొడి గాలి చొరని డబ్బాలో ఉంచితే కనీసం రెండు నెలలు నిలవ ఉంటుంది.

Leave a comment ×