టమాటో బాత్ | టొమాటో ఉప్మా
ఈ రెసిపీని టమాటో బాత్ అని ఆంధ్రాలో అంటారు. దీన్నే తమిళనాడులో కిచిడీ అంటారు. కర్ణాటకలో మాత్రం రవ్వతో కాక రైస్ తో చేసే చేసే దాన్ని టొమాటో బాత్ అంటారు.
నేను ఆంధ్ర వాళ్ళు ఎంతో ఇష్టంగా చేసుకునే టొమాటో బాత్ రెసిపి చేస్తున్నా. ఒక రకంగా ఇది టొమాటో ఉప్మా. ఇది ఆంధ్రాలో పెళ్ళిళ్ళలో టిఫిన్ గా పెడతారు కూడా. బొంబాయ్ రవ్వ లో టొమాటో ముక్కలు వేసి చేస్తారు. నాకు ఈ రెసిపి రోజూ చేసి పెట్టినా చాలా ఇష్టంగా తింటాను.
సహజంగా ఉప్మా అనగానే చిరాకు పడతారు, కాని చేసే తీరు, వండే పధ్ధతిలో చేస్తే రోజూ పెట్టిన తింటారు. అలా రోజూ చేసుకుని తినేంత బాగుంటుంది ఈ టొమాటో బాత్. ఇది లంచ్ బాక్సులకి కూడా చాలా పర్ఫెక్ట్.
ఈ టొమాటో బాత్ కారం పొడి లేదా సెనగపప్పు చట్నీతో చాలా రుచిగా ఉంటుంది.

టిప్స్
హోటల్ లో చేసే టొమాటో బాత్ ఎందుకంత రుచిగా ఉంటుంది:
• రవ్వ ని వేపే తీరులో రుచి ఆధారపడి ఉంది. రవ్వని సన్నని సెగ మీద కలుపుతూ వేపితే ఉప్మా రుచి, రూపం చాలా బాగుంటుంది
• రవ్వని నెయ్యి లో వేపితే టొమాటో బాత్ రుచి సువాసన చాలా గొప్పగా ఉంటుంది. నచ్చితే అచ్చంగా నెయ్యితో చేసి చూడండి, భలేగా ఉంటుంది.
• తాలింపు కరకరలాడేట్టు వేపితే ఎసరులో ఉడికినా ఇంకా కాస్త పలుకుగానే ఉండి చాలా రుచిగా ఉంటుంది
• జీడిపప్పు ముందు వేపి తీసి ఆఖరున కలిపితే జీడిపప్పు మెత్తబడదు. కరకరలాడుతూ రుచిగా ఉంటుంది. నచ్చితే మెత్తగానూ తినవచ్చు ఎసరులో ఉడికించి
• కూరకాయలు మరీ మెత్తగా వేపితే ఎసరులో ఉడికి మెత్తగా అయిపోయి ఉప్మాలో కలిసిపోయి నోటికి అందవు. అందుకే 80% వేపుకుంటే మిగిలినది ఎసరులో మగ్గిపోతుంది.
• ఆఖరున వేసే కాస్త నెయ్యి కొద్దిగా కొత్తిమీర పరిమళం చాలా బాగుంటుంది.

టమాటో బాత్ | టొమాటో ఉప్మా - రెసిపీ వీడియో
Tomato Bath | Perfect Tomato Bath Recipe | How to make Tomato Bhath
Prep Time 5 mins
Cook Time 20 mins
Total Time 25 mins
Servings 4
కావాల్సిన పదార్ధాలు
- 1 cup బొంబాయి రవ్వ
- 2 టమాటాలు
- 1/4 cup కేరట్ తరుగు
- 1/2 cup ఉల్లిపాయ తరుగు
- 1/4 cup తాజా బటాని
- 1 పచ్చిమిర్చి
- 1 tbsp అల్లం తరుగు
- 1 రెబ్బ కరివేపాకు
- 2 tbsps కొత్తిమీర తరుగు
- జీడి పప్పు - పిడికెడు
- 1 tsp ఆవాలు
- 1 tsp సెనగపప్పు
- 1 tsp మినపప్పు
- 1 tsp జీలకర్ర
- 1/2 tsp పసుపు
- ఉప్పు
- 2 tbsps నూనె
- 1/4 cup నెయ్యి
- 3 cups నీళ్ళు
విధానం
-
రవ్వని లో-ఫ్లేం మీద మంచి సువాసన వచ్చే దాక వేపుకోండి. లో-ఫ్లేం మీద వేపితేనే చాలా మృదువుగా ఉంటుంది టమాటో బాత్.
-
1 tbsp నెయ్యి, 2 tbsps నూనె వేడి చేసి అందులో జీడిపప్పు వేసి ఎర్రగా వేపి తీసి పక్కనుంచుకోండి
-
అదే నూనె లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, సెనగపప్పు, వేసి ఎర్రగా వేపి, ఉల్లిపాయ ముక్కలు వేసి 2 నిమిషాల పాటు వేపుకోండి.
-
ఆ తరువాత పచ్చిమిర్చి, అల్లం తరుగు వేసి ఉల్లిపాయలు మెత్తబడే దాకా వేపుకోండి.
-
టమాటో ముక్కలు వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకుని, కేరట్ తరుగు, బటాని, పుసుపు, కరివేపాకు, ఉప్పు వేసి కాయకూరలని 80% కుక్ చేసుకోండి.
-
ఇప్పుడు నీళ్ళు పోసి ఎసరుని తెర్ల కాగనివ్వండి, ఆ తరువాత రవ్వ వేసి బాగా కలిపి మూత పెట్టి 3 నిమిషాలు మగ్గించుకోండి
-
ఆ తరువాత కొత్తిమీర, జీడిపప్పు, 2 tbsps నెయ్యి వేసి బాగా కలిపి దింపి సర్వ్ చేసుకోండి

Leave a comment ×
100 comments