కాలీఫ్లవర్ మెంతి కూర
నోటికి కమ్మగా తిన్నాక పొట్టకి హాయిగా ఉండే సింపుల్ రెసిపీ కాలీఫ్లవర్ మెంతి కూర. పాలు పోసి ఉడికించే చిక్కని గ్రేవీతో కమ్మగా ఉంటుంది ఈ కాలీఫ్లవర్ మెంతి కూర రెసిపీ.
ఈ కూర అన్నం రొట్టెలు చపాతీ ఇలా ఎందులోకైనా ఎంతో రుచిగా ఉంటుంది. చేయడం కూడా చాలా తేలిక. పాలు పోసి నిదానంగా మరిగించే చిక్కని గ్రేవీ రుచి చాలా గొప్పగా ఉంటుంది.
కొన్ని తింటున్నంత సేపు ఎంతో రుచిగా ఉంటాయి, తిన్నాక ఇబ్బంది పెడతాయి, కొన్ని తింటున్నప్పుడు తిన్నాకా ఎంతో హాయిగా ఉంటాయి. ఈ కాలీఫ్లర్ కూర తింటున్నప్పుడు తిన్నాకా ఎంతో హాయిగా అనిపిస్తుంది. స్పైసీగా ఉండే మసాలా కూరలు కాక కమ్మని కూరలు కావాలంటే ఈ క్యాలిఫ్లవర్ కూర చేసి చుడండి అందరికి నచ్చేస్తుంది.

టిప్స్
కాలీఫ్లవర్-కేరట్ :
-
కాలీఫ్లవర్ మరీ పెద్ద ముక్కలు కాకుండా మీడియం సైజు ముక్కలుగా చేసుకోండి.
-
కేరట్ కూడా మీడియం సైజు ముక్కలు ఉండాలి.
-
నచ్చితే ఇందులో కొద్దిగా బీన్స్, బటాణీ స్వీట్వే కార్న్ వేసుకోవచ్చు.
-
కాలీఫ్లవర్ కుక్కర్లో వేసాక రెండే విజిల్స్ హై-ఫ్లేమ్ మీద రానివ్వాలి, అంత కంటే ఉడికితే ముక్కలు చిదురవుతాయ్.
ఆకుకూరలు:
-
ఈ కూరకి చిరు చేదుగా ఉండే మెంతి కూర రుచి బాగుంటుంది. నచ్చితే మీరు పాలకూర, తోటకూర ఏదైనా వేసుకోవచ్చు. కానీ ముందు ఆకు పసరు వాసన పోయే దాకా వేపుకోవాలి.
-
మెంతి కూర మిగిలిన ఆకు కూరలంత పసరు వాసన ఉండదు కాబట్టి కాలీఫ్లవర్తో పాటే వేసి మగ్గించేసాను.
ఇంకొన్ని :
- ఈ కూరలో పసుపు కారం వేయకూడదు, ఈ కూర ఇలాగే ఉండాలి. కారమంతా పచ్చిమిర్చి నుండే రావాలి.
వెల్లులి పూర్తిగా ఆప్షనల్.
కాలీఫ్లవర్ మెంతి కూర - రెసిపీ వీడియో
Cauliflower Methi Curry | How to Make Cauliflower Methi Curry
Prep Time 5 mins
Cook Time 25 mins
Total Time 30 mins
Servings 5
కావాల్సిన పదార్ధాలు
- 300 gm కాలీఫ్లవర్ ముక్కలు
- 1/2 cup కేరట్ ముక్కలు
- నీళ్లు - ముక్కలు మునిగేంత
-
గ్రేవీ కోసం
- 1.5 tsp నూనె
- 1 cup ఉల్లిపాయ ముక్కలు
- 4 పచ్చిమిర్చి
- 1 ఇంచ్ అల్లం
- 4 వెల్లులి (ఆప్షనల్)
- 1/2 cup పచ్చి కొబ్బరి
- నీళ్లు - గ్రైండ్ చేసుకోడానికి
- ఉప్పు - తగినంత
- 300 ml పాలు
-
కూర కోసం
- 1.5 tsp నూనె
- 1 tsp జీలకర్ర
- 3 కట్టలు మెంతికూర ఆకులు
- 2 tsp నెయ్యి
విధానం
-
కుక్కర్లో కాలీఫ్లవర్ ముక్కలు కారట్ ముక్కలు తగినంత నీళ్లు పోసి 2 విజిల్స్ హై - ఫ్లేమ్ మీద రానిచ్చి స్టవ్ ఆపేయాలి.
-
మరో గిన్నెలో నూనె వేడి చేసి గ్రేవీ కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి ఉల్లిపాయలు మెత్తబడే దాకా ఉడకనివ్వాలి. దింపే ముందు పచ్చికొబ్బరి వేసి 2 నిమిషాలు వేపుకోవాలి.
-
వేగిన ఉల్లి కొబ్బరిని మిక్సీలో నీళ్లు ఉప్పుతో మెత్తని పేస్ట్ చేసుకోండి.
-
వెన్నలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్లో పాలు పోసి కలిపి ఉంచండి.
-
కూర కోసం నూనె వేడి చేసి అందులో జీలకర్ర వేసి చిట్లనివ్వాలి, తరువాత ఉల్లిపాయ గ్రేవీ వేసి మీడియం ఫ్లేమ్ మీద 15 నిమిషాలు ఉడకనివ్వాలి.
-
చిక్కబడిన గ్రేవీలో ఉడికించిన కాలీఫ్లవర్ కేరట్ ముక్కలు మెంతి కూర వేసి కలిపి మూత పెట్టి 15 నిమిషాలు మగ్గనివ్వాలి, మధ్య మధ్యలో కలుపుతూ. (అవసరమైతే కాలీఫ్లవర్ ఉడికించిన నీరు పోసుకోవచ్చు).
-
దింపే ముందు కొద్దిగా నెయ్యి వేసి కలిపి దింపేసుకుంటే కమ్మని కాలీఫ్లవర్ మెంతి కూర రెడీ! ఇది అన్నం రొటీస్తో చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment ×
1 comments