చెట్టినాడు స్పెషల్ బెండకాయ మండి
అందరికీ తెలిసిన తీరులో చేసే కూర అయినా వేసే ఒక్క పదార్ధాల వల్ల కూర రుచి మారిపోతుంది అంటుంటారు కదా అలాంటిదే చెట్టినాడు బెండకాయ మండి. ఇది బెండకాయ మండి తమిళనాడు చెట్టినాడు ప్రాంతంలోని చెట్టియార్ కులం వారు చేసుకునే సింపుల్ వంటకం.
ఇది చేయడానికి మామూలు బెండకాయ కూర చేసినంత సేపే కానీ దీని రుచి పుల్లగా కారంగా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. ఈ ప్రేత్యేకత అంతా బియ్యం కడుగు నీళ్ళు పోసి ఉడికించడంలోనే ఉంది. ఈ కర్రీ రోజూ వారి చేసుకునే కూరలలోకి చాలా బాగుంటుంది.
నేను కొన్ని నెలల క్రితం చెట్టినాడు ప్రాంతంలోని కారైకుడికి వెళ్ళాను అక్కడ ఒక హోటల్లో ఈ కూర వడ్డించారు భోజనంలో నాకు చాలా నచ్చేసింది. వేళ్ళు జుర్రుకుంటూ తినేశా అంత రుచిగా ఉంది. నా పక్కనే ఉన్న తమిళ ఫ్రెండ్ అంకుల్ వాళ్ళదే హోటల్ కావడంతో ఆయనని అడిగి రెసిపీ తెలుసుకుని మీతో పంచుకుంటున్నా.

టిప్స్
బియ్యం కడుగు:
- బియ్యం కడుగు అంటే చాలా మందికి తెలిసినదే, మొదటగా బియ్యంని కడిగి ఆ నీటిని పారబోసి తరువాత మళ్ళీ నీళ్ళు పోసి 30 నిమిషాలు వదిలేస్తే తెల్లని తేటలోకి నీరు మారుతుంది ఆ నీరే బియ్యం కడుగు నీళ్ళు. ఈ నీళ్లే ఈ కూరకి ఎంతో ముఖ్యం. సాధారణంగా తెలుగు వారు కొద్దిగా బియ్యం పిండి కలిపిన నీళ్ళు పోస్తారు, పసుపు, కారం వేసి చేస్తారు. చెట్టినాడు వారు బియ్యం కడుగు నీళ్ళు పోస్తారు, కారం పసుపు వేయరు ఇంకా పులుపు తక్కువగా ఉంటుంది.
బెండకాయ:
- బెండకాయ ముక్కలు కనీసం ఒక ఇంచ్ ముక్కలు ఉండాలి ఇంకా నూనెలో వేసిన ముక్కలు హై ఫ్లేమ్ మీద మూత పెట్టి వేపితే జిగురు వదులుతుంది. ఇంకా చెట్టినాడు వారు చేసే తీరులో కాసింత జిగురు ఉంటుంది. నాకు జిగురు ఇష్టం ఉండదు కాబట్టి నేను బెండకాయలని ఎక్కువగా వేపాను. నచ్చితే మీరు తక్కువగా వేపుకోవచ్చు.
చెట్టినాడు స్పెషల్ బెండకాయ మండి - రెసిపీ వీడియో
Chettinadu Special Bendakai Mandi | Okra Curry | Bendakaya pulusu | Bhindi | How to Make Okra Curry
Prep Time 5 mins
Cook Time 17 mins
Total Time 22 mins
Servings 4
కావాల్సిన పదార్ధాలు
- 2.5 tbsp నూనె
- 300 gms బెండకాయ ముక్కలు
- ఉప్పు – రుచికి సరిపడా
- 1/2 tsp ఆవాలు
- మెంతులు – చిటికెడు
- 100 ml చింతపండు పులుసు (నిమ్మకాయ సైజు చింతపండు నుండి తీసినది)
- 4 ఎండుమిర్చి
- 6 - 7 వెల్లులి
- 2 రెబ్బలు కరివేపాకు
- 10 - 12 సాంబార్ ఉల్లిపాయలు
- 1/4 cup ఉల్లిపాయ తరుగు
- 2 పచ్చిమిర్చి చీలికలు
- 400 ml బియ్యం కడుగు నీళ్ళు
విధానం
-
కొద్దిగా నూనె వేడి చేసి అందులో బెండకాయ ముక్కలు కొద్దిగా ఉప్పు బాగా టాస్ చేసి మూత పెట్టి బెండకాయ రంగు మారే దాకా వేపుకోవాలి. అప్పుడు గిజురు వదులుతుంది.
-
వేగిన బెండకాయ ముక్కలని పక్కన ఉంచుకోండి.
-
అదే మూకుడులో ఆవాలు మెంతులు వేసి మెంతులు ఎర్రబడనివ్వాలి. తరువాత మినపప్పు వేసి వేపుకోవాలి.
-
తాళింపులు వేగిన తరువాత ఎండుమిర్చి వెల్లులి కరివేపాకు వేసి వెల్లులి రంగు మారేదాకా వేపుకోవాలి.
-
సాంబార్ ఉల్లిపాయలు సన్నని ఉల్లిపాయ తరుగు పచ్చిమిర్చి చీలికలు వేసి ఉల్లిపాయ రంగు మారి మెత్తబడేదాకా వేపుకోవాలి.
-
వేగిన ఉల్లిపాయాలో చింతవనడు పులుసు పోసి ఒక పొంగు రానివ్వాలి. పొంగిన పులుసులో వేపిన బెండకాయ ముక్కలు వేసి 2 నిమిషాలు ఉడికించుకోవాలి.
-
ఉడికిన బెండకాయ ముక్కల్లో బియ్యం కడుగు నీళ్ళు పోసి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 4-5 నిమిషాలు ఉడికించి రుచి చూసి కావలిస్తే ఉప్పు వేసి దింపేసుకోవాడమే.
-
ఈ బెండకాయ మండి అన్నంతో చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment ×