చికెన్ మాలై కోఫ్తా
మాలై చికెన్ కోఫ్తా రెసిపీ క్రీమీగా నోట్లో వెన్నలా కరిగిపోతుంది. రొటీస్, నాన్, చపాతీతో ఎంతో రుచిగా ఉంటుంది. రెస్టారెంట్ స్టైల్ “మాలై కోఫ్తా” రెసిపీ అందరికీ ఇష్టమే! మాలై కోఫ్తా రెసిపీనే అభిరుచికి తగినట్లు మార్చేశారు రెస్టారెంట్ వాళ్ళు.
నవాబీ స్టైల్ కోఫ్తా కమ్మగా, కారం తెలసీ తెలియనట్లుగా ఉంటుంది. ఇదే కోఫ్తాని పసుపు ఉప్పు కారం గరం మసాలాలు ఎక్కువగా వేసి ఇంకో తీరులోనూ చేస్తారు. కారంగా ఉండే మాలై కోఫ్తా పులావ్లోకీ రుచిగా ఉంటుంది.
నేను ఇప్పడు కమ్మని “చికెన్ మలాయి కోఫ్తా” చేస్తున్నా. ఒక రకంగా ఇది నేను మలాయి కోఫ్తాకి చిన్న చిన్న మార్పులు చేసి చేస్తున్న రెసిపీ. ఈ కూర కమ్మగా కారం తక్కువుగా ఉంటుంది కాబట్టీ స్పైస్ని ఇష్టపడే వారు ఎలా చేసుకోవచ్చో కింద టిప్స్ లో వివరంగా ఉంది చూడండి.

టిప్స్
కోఫ్తా:
-
కోఫ్తా కోసం బోన్లెస్ చికెన్ని మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసి తీసుకున్నాను.
-
నేను ముందు చెప్పినట్లు ఈ కర్రీ నేను షాహీ స్టైల్లో కారం తక్కువుగా ఉంటూ కమ్మగా ఉండేలా చేస్తున్నా. మీకు స్పైస్ కావాలనుకుంటే కోఫ్తాలో కొద్దిగా కారం, పసుపు, పచ్చిమిర్చి తరుగు ఎక్కువగా వేసుకోవచ్చు
-
కోఫ్తాలు కలిపేప్పుడు నూనె కొద్దిగా వేయాలి లేదంటే ఉండలు షేప్ రావు, వచ్చినా నిలబడవు
-
కోఫ్తా వేపేప్పుడు నూనెలో కోఫ్తాలు వేసి కదపకుండా ఒక నిమిషం వదిలేయాలి, ఆ తరువాత నెమ్మదిగా తిప్పుకుంటూ కాల్చుకుంటే కోఫ్తాలు విరగవు. కోఫ్తాలు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే వేపుకోవాలి
చిక్కని కమ్మని గ్రేవీ కోసం :
• గ్రేవీ కారంగా కావాలనుకుంటే పసుపు, కారం, పచ్చిమిర్చి మీ రుచికి తగినట్లుగా ఉల్లిపాయ వేగిన తరువాత వేసుకోండి.
• గ్రేవీలో ఉల్లిపాయలు ఎర్రగా వేగాలి, అప్పుడు గ్రేవీకి చిక్కదనం, రుచి.
• సాధారణంగా షాహీ, నవాబీ, మొఘలాయి కూరలకి నూనె, నెయ్యి ఉండాలి అప్పుడే రుచి. నేను కూడా ఈ కూర రుచి ప్రధానంగా చేశాను. నేను వేసిన మోతాదులో నూనె నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది. వద్దనుకుంటే తగ్గించుకోండి.
• గ్రేవీలో చిరోన్జీ పప్పు వాడను దొరకని వారు బాదాం పప్పు వేసుకోవచ్చు.
• జీడిపప్పు, చిరోన్జీ / బాదాం కనీసం 30 నిమిషాలు నానబెడితే పేస్ట్ మెత్తగా వెన్నలా వస్తుంది. గ్రేవీకి పేస్ట్ ఎంత మృదువుగా ఉంటే అంత రుచిగా ఉంటుంది.
• జీడిపప్పు, చిరోన్జీ కారణంగా గ్రేవీ చల్లారుతున్న కొద్దీ చిక్కబడుతుంది. అలా చిక్కబడితే ఎప్పుడైనా వేడి నీళ్ళు కలిపి గ్రేవీ పలుచన చేసుకోవచ్చు
• గ్రేవీ రుచి అంతా ఒక్కో పదార్ధం వేసి నూనె పైకి తేలేదాక నిదానంగా వేపడంలోనే ఉంది.
• గ్రేవీ ఇంకా కాస్త పలుచగా ఉన్నప్పుడే దింపేయాలి, లేదంటే చల్లారుతున్న కొద్దీ పేస్ట్ లా అయిపోతుంది.

చికెన్ మాలై కోఫ్తా - రెసిపీ వీడియో
Chicken Malai Kofta | Shahi Chicken Kofta recipe | How to make Malai Chicken Kofta Curry
Prep Time 10 mins
Soaking Time 30 mins
Cook Time 25 mins
Total Time 1 hr 5 mins
Servings 4
కావాల్సిన పదార్ధాలు
-
కాజు పేస్ట్ కోసం
- 1/3 cup జీడిపప్పు (30 నిమిషాలు నానబెట్టాలి)
- 2 tsp చిరోన్జీ /బాదాం (30 నిమిషాలు నానబెట్టాలి)
-
కోఫ్తా కోసం
- 250 gms బోన్లెస్ చికెన్ (మెత్తగా మిక్సీ గ్రైండ్ చేసుకున్నది)
- ఉప్పు
- 1/2 tsp మిరియాల పొడి
- 1/2 tsp గరం మసాలా
- 1/2 tsp అల్లం వెల్లులి ముద్ద
- 1 tbsp నూనె
- 2 tsp కొత్తిమీర తరుగు
- 1 పచ్చిమిర్చి మధ్యకి చీరిన సన్నని తరుగు
- 2 tsp నూనె వేపుకోడానికి
-
గ్రేవీ కోసం
- 3 tbsp నూనె
- 1 tbsp నెయ్యి
- 2 యాలకలు
- 2 లవంగాలు
- ఇంచ్ దాల్చిన చెక్క
- ఉప్పు
- 1 cup ఉల్లిపాయ తరుగు
- 1 పచ్చిమిర్చి తరుగు
- 1/2 tsp అల్లం వెల్లులీ ముద్ద
- 1.5 cup నీళ్ళు
- 1/2 tsp మిరియాల పొడి
- 1 tsp నెయ్యి
- 2 tsp ఫ్రెష్ క్రీమ్ (పాల మీగడ )
విధానం
-
చికెన్ కోఫ్తాల కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి నిమ్మకాయ సైజు బాల్స్ చేసి ఉంచుకోండి. (ఒక సారి టిప్స్ చూడగలరు).
-
పాన్లో 2 tsp నూనె వేడి చేసి కోఫ్తాలు ఉంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలి.
-
నానబెట్టిన జీడిపప్పు, చిరోన్జీ వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి
-
పాన్లో నూనె, నెయ్యి, యాలక, లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేపుకోవాలి.
-
సన్నని ఉల్లిపాయ తరుగు వేసి ఉల్లిపాయలు ఎర్రబడేదాకా వేపుకోవాలి. ఉల్లిపాయలు ఎర్రగా అవుతున్నప్పుడు పచ్చిమిర్చి తరుగు, అల్లం వెల్లూలీ ముద్ద వేసి ఎర్రగా వేపుకోవాలి.
-
మెత్తగా రుబ్బుకున్న జీడిపప్పు పేస్ట్ వేసి నూనె పైకి తేలేదాక మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలి.
-
నూనె పైకి తేలాక నీళ్ళు పోసి గ్రేవీ సగం అయ్యేదాక మీడియం ఫ్లేమ్ మీద మరగనివ్వాలి. మధ్య మధ్యన కలుపుతుండాలి లేదంటే అడుగుపడుతుంది.
-
గ్రేవీ సగం అయ్యాక వేపుకున్న కోఫ్తాలు వేసి 3-4 నిమిషాలు ఉడకనివ్వాలి. (అవసరమైతే కొద్దిగా వేడి నీళ్ళు పోసి పలుచన చేసుకోవచ్చు).
-
ఆఖరుగా ½ మిరియాల పొడి, ½ tsp గరం మసాలా, నెయ్యి, ఫ్రెష్ క్రీమ్ వేసి కలిపి దింపేసుకోవాలి.

Leave a comment ×
4 comments