భిండీ కుర్కురే | భెన్ఢీ కుర్కురే

బెండకాయ చీలికలకి సెనగపిండి మసాలాలు పెట్టించి ఎర్రగా కారకరలాడేట్టు చిప్స్ మాదిరి వేపే భిండీ కుర్కురే ఉత్తర భారత దేశంలో ఎంతో ఇష్టంగా తినే రెసిపీ.

బెండకాయ ముక్కలు కరకరలాడుతూ ఉంటాయి అందుకే దేన్నీ భిండీ కుర్కురే అంటారు. సాధారణంగా భిండీ కుర్కురేని పప్పు అన్నంతో నంజుడుగా తింటారు. దీన్నే దాల్ చావల్ భిండీ కుర్కురే అనే కంబో కూడా దొరుకుతుంది దాబాల్లో హోటల్స్లో. భిండీ కుర్కురే చాలా సింపుల్ రెసిపీ, మసాలాలు బెండకాయ చీలికలకి పట్టించి నూనెలో ఎర్రగా వేపి తీసుకోవడేమే!!! కానీ…బెండకాయలని ఎంచుకునే దగ్గరనుండి ఎర్రగా వేపే తీరుదాకా టిప్స్ ఉన్నాయ్, అవి జాగ్రత్తగా పాటిస్తే బెండకాయ చిప్స్ లా కరకరలాడుతూ ఉంటాయి.

అంత పర్ఫెక్ట్ కోసం రెసిపీ చేసే ముందు మీరు కింద ఉన్న టిప్స్ చూడాల్సిందే!!!

Crispy Bhindi Kurkure

టిప్స్

బెండకాయ:

భిండీ కుర్కురే కి కచ్చితంగా లేత బెండకాయలనే వాడాలి. బెండకాయలు లేతగా ఉంటేనే కరకరలాడుతూ వేగుతాయ్ ముక్కలు. బెండకాయలు ముదిరితే ఎంత వేపినా బెండకాయ జిగురుగానే ఉంటుంది.

బెండకాయని తరిగే టిప్స్:

లేత బెండకాయని మధ్యకి చీరి అందులోని గింజల్ని తీసేయాలి ఆ తరువాత రెండు అంగుళాల మునక్కాడ బద్దల్లా చీరుకోవాలి.

బెండకాయ కోటింగ్

చీరుకున్న బెండకాయ బద్దలని సెనగపిండి మిశ్రమాన్ని నెమ్మదిగా నిమురుతూ పట్టించి తరువాత ముక్కలని ఎగరేస్తూ పట్టిస్తే సమానంగా పట్టుకుంటుంది.

బెండకాయ ముక్కలని కొద్దిగా అంటే చెంచా నీళ్లు మాత్రమే వేసి కోట్ చేసుకోవాలి. ఆ నీరు కూడా బెండకాయ ముక్కని పిండి గట్టిగా అంటిపట్టి ఉంచడానికి అంతే!!! నీరు అంతకంటే ఎక్కువగా వేస్తే జారుగా అవుతుంది అప్పుడు నూనెలో వేయగానే బెండకాయ ముక్కలనుండి పిండి విడిపోతుంది.

బెండకాయ ముక్కలని వేపే తీరు:

బెండకాయ ముక్కలని మరిగే వేడి నూనెలో వేసి గరిటెతో కదపకుండా 2 నిమిషాలు వదిలేస్తే ముందు పిండి ఉడుకుతుంది తరువాత ముక్కలని పట్టి ఉంటుంది, ఆ తరువాత నెమ్మదిగా కదిపి తిప్పుకుంటూ రంగు మారేదాకా మీడియం ఫ్లేమ్ మీద రంగు మారుతున్నప్పుడు హై ఫ్లేమ్ మీద వేపితే ముక్కలు కారకరలాడేట్టు వేగుతాయ్

వేపిన బెండకాయ కుర్కురేని చల్లారేదాకా జల్లెడలో వేసి ఉంచాలి. బెండకాయ ముక్కలు గంటల తరువాత కూడా కరకరలాడుతూ ఉండాలంటే మూతపెట్టకుండా పలుచని క్లాత్ కప్పి ఉంచాలి.

Crispy Bhindi Kurkure

భిండీ కుర్కురే | భెన్ఢీ కుర్కురే - రెసిపీ వీడియో

Crispy Bhindi Kurkure

Starters | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 15 mins
  • Resting Time 10 mins
  • Total Time 30 mins
  • Servings 5

కావాల్సిన పదార్ధాలు

  • 400 gms లేత బెండకాయ
  • 3/4 cup సెనగపిండి
  • 1/8 tsp వాము
  • 1/8 tsp జీలకర్ర
  • 2.5 tbsp బియ్యం పిండి
  • ఉప్పు - రుచికి సరిపడా
  • 1/2 tsp కారం
  • 1/2 tsp గరం మసాలా
  • 1/2 tsp ధనియాల పొడి
  • 1 tsp వేపిన జీలకర్ర పొడి
  • 1/2 tsp చాట్ మసాలా
  • 1 చెంచా నీళ్లు
  • నూనె వేపుకోడానికి
  • చాట్ మసాలా - పైన చల్లుకోడానికి

విధానం

  1. లేత బెండకాయలని తొడిమ ముచ్చిక తీసేసి ముందు మధ్యకి చీరుకోవాలి. చీరుకున్న బెండకాయ మధ్యన ఉన్న గింజలు నార పూర్తిగా తీసేసి వాటిని మళ్ళీ మధ్యకి చీరుకోవాలి. ఆ తరువాత రెండు అంగుళాల ముక్కలుగా తరుక్కోవాలి(బెండకాయల గురుంచి టిప్స్ చుడండి).
  2. సెనగపిండి మిగిలిన పదార్ధాలన్నీ వేసి బాగా కలుపుకోండి.
  3. బెండకాయ బద్దల్లో సెనగపిండి మిశ్రమం వేసి ఎగరేస్తూ ముందు ముక్కలకి కోటింగ్ ఇవ్వాలి.
  4. ఆ తరువాత చెంచా నీరు పిండి ముక్కల మీద చల్లి నెమ్మదిగా పట్టించి 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వండి.
  5. మరిగే నూనెలో బెండకాయ బద్దలు వేసి మీడియం ఫ్లేమ్ మీద కదపకుండా 2 నిమిషాలు వదిలేయండి. ఆ తరువాత మంట హై ఫ్లేమ్లోకి పెట్టి కారకరలాడేట్టు ఎర్రగా వేపుకుని చల్లారేదాకా జల్లెడలో వేసుకోండి.
  6. ఆఖరుగా పైన ¼ చెంచా చాట్ మసాలా చల్లుకోవాలి. అంతే కరకరలాడే భిండీ కుర్కురే తయారు. పప్పు చారు అన్నంతో లేదా టీ టైం స్నాక్గ చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

5 comments

Crispy Bhindi Kurkure