రాయలసీమ స్పెషల్ ఎగ్ దోశ
దక్షిణ భరత దేశం వారికి ఎన్ని రకాల దోశలో. అందులోను ఎన్ని తిన్నా అలా తింటూనే ఉండాలనిపించే దోశల్లో ఎగ్ దోశ ఒకటి. ఎగ్ దోశ టిఫిన్గా లంచ్గా లేదా డిన్నర్గా ఎలా ఎప్పుడైనా చాలా రుచిగా ఉంటుంది.
తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం ఎగ్ దోశ అభిమానులు చాలా ఎక్కువ. అందుకే చాలా రిక్వెస్ట్లు వచ్చాయ్ బెస్ట్ ఎగ్ దోశ కావాలని. ఎగ్ దోశ సింపుల్గా దోశల పిండి మీద ఎగ్ పోసి చేసేదేగా అన్నట్లుగా అనిపిస్తుంది కానీ రాయలసీమ వారి ఎర్ర కారం పూసి చేసే ఎగ్ దోశ చాలా రుచిగా ఉంటుంది.
చాలా చోట్ల దోశ మీద ఎగ్ వేసి దాని మీద కారం పొడి చల్లుతారు, కానీ రాయలసీమ వారు చేసే ఎగ్ దోశ అందుకు కాస్త భిన్నం ముందుగా దోశమీద ఎర్రకారం పూస్తారు దాని మీద ఎగ్ వేసి ఎక్కువ నూనెతో కరకరలాడేట్టు కాలుస్తారు.
రాయలసీమలో దొరికే ఎర్రకారం చాలా తీరుల్లో చేస్తారు, నేను చిత్తూరు, తిరుపతి, కళహస్తీలలో ఎక్కువగా చేసే ఎర్రకారం చేస్తున్నా. ఈ ఎర్ర కారం నూనె పైకి తేలెట్లు వేపుకుంటే కనీసం నెల రోజులు నిలవుంటుంది ఫ్రిజ్లో. ఈ స్పెషల్ ఎర్ర కారంతో పాటు, ఎగ్ దోశని పర్ఫెక్ట్గా ఎలా కాల్చాలి లాంటి టిప్స్ అన్నింటితో స్టెప్ బై స్టెప్ ఇమేజెస్తో ఉంది చూడండి.

టిప్స్
ఎర్ర కారం:
-
ఎర్రకారం కోసం నేను మీడియం కారం ఉండే మిరపకాయలు వాడను, అప్పుడు దోశ పాటు ఇచ్చే మిగతా పచ్చడులు నంజుకు తినేలా ఉంటుంది అట్టు.
-
ఎర్రకారం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అంటే మిరపకాయలలోని గింజలు కూడా మెత్తగా మెదిగి గుజ్జుగా అవ్వాలి.
-
ఎర్ర కారం నిలవ ఉంచుకోదలిస్తే నూనె ఎక్కువగా ఉండాలి, అప్పుడు నిలవ ఉంటుంది కారం.
దోశ కాల్చే తీరు:
-
ఎగ్ దోశ కచ్చితంగా క్రిస్పీగా ఉంటేనే రుచిగా ఉంటుంది. అందుకు కాసింత ఎక్కువ నూనె వేసి కాల్చుకోవాలి. అప్పుడు అట్టు రుచిగా ఉంటుంది.
-
ఎగ్ దోశకి అట్టు అంతా.. అంటే అట్టు అంచులు, మధ్యన నూనెతో కాలాలి అప్పుడు అట్టు కరకరలాడుతూ ఉంటుంది.
ఎగ్ ఎప్పుడు వేయాలి:
- నూనెలో కాలుతున్న దోశ మధ్యన కొద్దిగా ఎరుపెక్కడం మొదలవుతుంది, దోశ పైన పిండి సగం పైన ఉడికి ఉంటుంది, అప్పుడు ఎర్ర కారం గుడ్డు వేసి మీడియం ఫ్లేమ్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ కాలిన తరువాత కారం గుడ్డు వేస్తే గుడ్డు ఉడికేలోగా అట్టు మాడిపోతుంది.
దోశ క్రిస్పీగా రావాలంటే?:
- అట్టు పిండి కాస్త గట్టిగా ఉండాలి, ఎక్కువ నూనె వేసి కాల్చాలి అప్పుడు హోటల్ స్టైల్లో వస్తుంది దోశ. పిండి పలుచన అయిన కొద్ది అట్టు మెత్తగా వస్తుంది.
పిండి ఎలా రుబ్బాలి?
-
పప్పు, బియ్యం మెంతులు కచ్చితంగా 4 గంటలు నానాలి. 12-16 గంటలు పులవాలి. అప్పుడు అట్టు రుచిగా ఉంటుంది.
-
పప్పు మిక్సీలో కంటే గ్రైండర్లో ఎక్కువసేపు రుబ్బితే అట్టు పర్ఫెక్ట్గా వస్తుంది. మిక్సీలో రుబ్బే వారు కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా రుబ్బుకోవాలి.
రాయలసీమ స్పెషల్ ఎగ్ దోశ - రెసిపీ వీడియో
Egg Dosa | Rayalaseema Special Karam Egg Dosa | How to make Perfect Egg Dosa
Prep Time 5 mins
Soaking Time 4 hrs
Cook Time 20 mins
Total Time 4 hrs 25 mins
Servings 20
కావాల్సిన పదార్ధాలు
-
దోశ పిండి కోసం
- 1 cup మినపప్పు (4 గంటలు నానబెట్టినవి)
- 2.5 cup దోశల బియ్యం (4 గంటలు నానాబెట్టాలి)
- 1 tsp మెంతులు (4 గంటలు నానబెట్టాలి)
- 1/2 cup అటుకులు (4 గంటలు నానాబెట్టాలి)
-
ఎర్ర కారం కోసం
- 100 gm ఎండు మిరపకాయలు
- 50 gm చింతపండు
- 15 వెల్లులి
- ఉప్పు
- నీళ్ళు – పేస్ట్ చేసుకోవడానికి
- 75 ml నూనె
- 1/2 tsp ఆవాలు
- 2 రెబ్బలు కరివేపాకు
- నీళ్ళు పచ్చడిలో కలుపుకోడానికి
-
దోశ కోసం
- నూనె – దోసలు కాలచడానికి
- ఉప్పు – పిండి తగినంత
- గుడ్లు
- ఎర్ర కారం పచ్చడి
విధానం
-
పప్పు బియ్యం మెంతులు అటుకులు అన్నీ 4 గంటలు నానబెట్టి మెత్తగా రుబ్బి 12 గంటలు పులియబెట్టాలి (పర్ఫెక్ట్ పిండి కోసం టిప్స్ చూడండి).
-
12 గంటలు పులిసిన పిండిలో తగినంత ఉప్పు నీరు కలిపి పక్కనుంచుకోండి.
-
ఎర్రకారం కోసం ఎండుమిర్చి, ఉప్పు, చింతపండు, వెల్లులి తగినంత నీళ్ళు పోసి మెత్తని పేస్ట్ చేసుకోండి.
-
నూనె వేడి చేసి ఆవాలు కరివేపాకు వేసి వేపుకోవాలి, వేగిన తాలింపులో ఎర్రకారం పేస్ట్, కొద్దిగా నీళ్ళు పోసి నూనె పైకి తేలేదాక మధ్య మధ్యన కలుపుతూ మూతపెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి.
-
నూనె పైకి తేలాక పూర్తిగా చల్లార్చి సీసాలో ఉంచుకుంటే ఫ్రిజ్లో రెండు నెలలు నిలవ ఉంటుంది.
-
బాగా వేడెక్కిన పెనం మీద పెద్ద గరితేడు పిండి పోసి పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి పిండిని. ఆ వెంటనే 2.1/2 tbsp నూనె అట్టు అంచులు మధ్యన వేసి కాల్చుకోవాలి.
-
అట్టు మధ్యన ఎర్రబడుతుండగా ఎర్రకారం గుడ్డు వేసి స్ప్రెడ్ చేసి ఒక నిమిషం కాలనిచ్చి తిప్పి మరో వైపు 30 సెకన్లు కాల్చి తీసేసుకోండి.
-
ఈ ఎగ్ దోశ వేడిగా పల్లీల పచ్చడి, శెనగపప్పు పచ్చడితో ఎంతో రుచిగా ఉంటుంది.

Leave a comment ×
17 comments