గంజి అన్నం
ఉడికించి గంజి వార్చిన అన్నంలో వార్చిన గంజి, పలుచని మజ్జిగా కొద్దిగా వాము ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి రాత్రంతా పులియబెట్టిన అన్నం సర్వ రోగ నివారిణి.
ఈ గంజి అన్నం ఆంధ్రులేకే కాదు ఒరిస్సా బెంగాల్ అస్సాం రాష్ట్రాల వారికి కూడా ఉదయం తినే అలవాటు ఉంది. ప్రాంతానికి తగినట్లుగా చిన్న మార్పులతో ఉంటుంది. ఇడ్లీ దోశల కంటే ఎన్నో వందల రెట్లు మేలు చేసే ఆహారం!!!
వేసవిలోనే కాదు ఎండ వేడి ఎక్కువగా ఉండే దక్షిణభారత దేశం వారు రోజూ ఉదయాన్నే టిఫిన్గా తినదగిన ఆహారం!!! పొట్టకి సంబంధిత ఎలాంటి వ్యాధులున్నా కొన్ని వారాల పాటు కారం పులుపు నూనెలు మసాలాలులేని ఆహారం తీసుకుంటూ ఉదయం సాయంత్రం ఈ గంజి అన్నం తింటే చాలు శరీరానికి చలువ చేస్తుంది పొట్టలోని గ్యాస్ తగ్గి తేలికపడుతుంది.
ఈ రోజుల్లో ఈ గంజి అన్నం తెలిసినా ఇడ్లీ అట్టు పూరీలా మోజుతో తినే వారు కాస్త తగ్గారు కానీ, నేటికీ వేసవిలో ఆంధ్రుల ఇళ్లలో కచ్చితంగా చేసుకునే వారున్నారు. వెనుకటికి పొలాలకు వెళ్లే వారు ఈ గంజి అన్నం తిని వెళ్లేవారు. ఉదయం నుండి సాయంత్రం దాకా ఎండలో పని చేసే వారికి శరీరం అలిసిపోకుండా వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది ఈ గంజి అన్నం.
జ్వరం వచ్చినప్పుడు, గ్యాస్ సమస్యలున్నా, షుగర్, బీపీ వ్యాధి ఉన్నవారు రోజూ తినదగిన ఆహారం. చిన్న పిల్లలకు ఉదయాన్నే ఈ గంజి అన్నం పెట్టడం ఎంతో మేలు చేస్తుంది.
సాధారణముగా వెనుకటికి అన్నంలో ఎక్కువ నీరు పోసి అన్నం ఉడికిన తరువాత అన్నంలోని గంజి వార్చుకునే అలవాటుండేది. తోఇనగా మిగిలిన అన్నాన్ని వార్చుకున్న గంజిలో కలిపి రాత్రంతా పులియబెట్టేవారు. ప్రస్తుతం అన్నంలో సరిపోను ఎసరు పోసి కుక్కర్లో వండేస్తున్నాం. కాబట్టి నేను మీకు చూపించడానికి అన్నం వండుకునే తీరు గంజి వార్చే విధానం రెండూ చూపిస్తున్నాను!!!

టిప్స్
మిల్లెట్స్ తో :
నేను తెల్ల పాలిష్ బియ్యం వాడి ఈ గని అన్నం చేస్తున్నాను. మీరు నచ్చితే ఇదే రెసిపీ మిల్లెట్స్ని బాగా రెండు మూడు గంటలు నానబెట్టి ఒకటికి ఆరు నీళ్లు పోసి మెత్తగా ఉడికించి గంజి వార్చి కూడా ఇదే తీరులో చేసుకోవచ్చు.
మట్టి పాత్ర:
మట్టి పాత్రలో ఈ గంజి అన్నం చేసుకోవడం ఎంతో మేలు!!! కుదరని వారు మామూలు గిన్నెల్లోనే చేసుకోండి
ఉల్లిపాయ:
ఉల్లిపాయ రాత్రే గంజి అన్నంలో వేస్తే ఉల్లిలోని ఘాటు తగ్గడంతో పాటు ఉదయాన్నే కోరుకుని తినేలా ఘాటు తగ్గుతుంది.
ఉల్లిపాయ పెద్ద పాయాలుగానే విడదీయకుండా వేసుకోండి. చైనా ముక్కలు కొస్తే గాజీలో ఊరి ఉల్లిపాయ అన్నంలో కలిసిపోతుంది.
పచ్చిమిర్చి:
ఒకటి లేదా రెండు వేసుకోండి. వేసుకోకపోయినా పర్లేదు. మరీ చప్పగా తినలేని వారు వేసుకోండి.
వాము:
నేను తీసుకున్న కొలతకి రెండు చిటికెళ్ళు వేసుకుంటే చాలా చక్కగా సరిపోను ఉంటుంది ఫ్లేవర్
ఇంకో తీరు:
ఆంధ్రాలో గోదావరి జిల్లాల వైపు కొందరు అన్నం ఇదే తీరులో చేసి ఇంకా దబ్బకాయ లేదా నిమ్మకాయ ఆకులు కడిగి అన్నంతో పాటే వేసి పులియబెడతారు. ఉదయానికి ఆకులో పరిమళం అంతా అన్నానికి పడుతుంది.
గంజి అన్నం - రెసిపీ వీడియో
Fermented Rice | Porridge Rice | Ganji Annam
Prep Time 5 mins
Cook Time 25 mins
Resting Time 12 hrs
Total Time 12 hrs 30 mins
Servings 4
కావాల్సిన పదార్ధాలు
- 1 cup బియ్యం (185 gm)
- 4 cups నీళ్లు (లీటర్)
- 2 cups మజ్జిగ (½ లీటర్)
- 2 Pinches వాము
- ఉప్పు - రుచికి సరిపడా
- 1 ఉల్లిపాయ (4 పాయలుగా చేసుకున్నది)
- 2 పచ్చిమిర్చి
- 1/2 liter నీళ్లు
విధానం
-
కడిగి నానబెట్టిన బియ్యంలో కప్పుకి నాలుగు కప్పుల నీళ్లు పోసి అన్నాన్ని మెత్తగా వండుకుని మిగిలిన గంజిని వార్చేయండి. తీసుకున్న గంజిని చల్లార్చండి. ( గంజి అన్నం కోసమే అన్నం వండితే అన్నాన్ని గంజి వార్చకుండా అన్నం ఉడికిన తరువాత దింపి పూర్తిగా చల్లార్చి మిగిలిన పద్ధతి ఫాలో అవ్వండి).
-
ఇదే మిల్లెట్స్తో చేసుకోదలిస్తే మిల్లెట్స్ కడిగి కనీసం 3-4 గంటలు నానబెట్టాలి, కప్పుకి 6-8 కప్పుల నీళ్లు పోసి మెత్తగా ఉడికించి గంజి వార్చుకోవాలి.
-
చల్లారిన అన్నంలో చల్లారిన గంజి మజ్జిగతో పాటు మిగిలిన పదార్ధాలన్నీ వేసి కలిపి మూత పెట్టి రాత్రంతా పులియబెట్టాలి.
-
తెల్లారాక మరో సారి కలిపి నచ్చితే ఆవకాయ లేదా అలాగే ఉల్లిపాయ పచ్చిమిర్చి కొరుక్కుంటూ తినొచ్చు.

Leave a comment ×
3 comments