అవిసెగింజల కారం పొడి
కారంగా ఘాటుగా ఘుమఘుమలాడిపోతూ సన్నని పలుకులు అక్కడక్కడా తగులుతూ ఉండే అవిసె గింజల కారం పొడి గురుంచి ఎంత చెప్పినా తక్కువే!
కారం పొడి అనే మాట తెలుగు వారి సొంతం! అవును మరి అంతగా ఆస్వాదిస్తూ ఆనందిస్తూ తింటారు. ఈ పొడి ఇడ్లీ, అట్టులోకే కాదు కూర కారంగా కూడా పనికొస్తుంది. వేపుడు కూరలకి ఆఖరున పైన ఈ పొడి వేసి కలిపి దింపితే చాలు కూర రుచికి రుచి ఆరోగ్యం కూడా.
సాధారణంగా కూర కారాలు సాంబార్ కారాలు తెలుగు వారికి బాగా తెలిసినవే, అవిసె గింజలు వేపి చేసే ఈ పొడి కూడా దాదాపుగా అంతే కాకపోతే చిన్న కొలతల మార్పు అంతే! బాచిలర్స్తో ఈ పొడి ఉంటె ఏ వంట అయినా అద్భుతంగా చిటికెలో చేసేస్తారు!

టిప్స్
అవిసెగింజలు:
అవిసెగింజలు నూనెలో సన్నని సెగ మీద మాడకుండా కలుపుతూ చిట్లేదాకా వేపుకోవాలి. సన్నని సెగ మీద వేపితేనే పప్పు లోపలి దాకా వేగి చిట్లుతుంది, అప్పుడు పొడి రుచిగా ఉంటుంది.
మినపప్పు:
పొడిలో నేను పొట్టు మినపప్పు వేసి వేపాను, పొట్టు పప్పు రుచి చాలా బాగుంటుంది, ఇంకా మాంచి సువాసనతో ఉంటుంది. దొరకని వారు పొట్టు లేని పప్పునే వాడుకోండి
పొడి గ్రైండ్ చేసే తీరు:
ఈ పొడి ఇడ్లీ అట్టుతో తినడానికి అయితే కాస్త బరకగా గ్రైండ్ చేసుకోండి, కూర కారంగా వాడుకోదలిస్తే మెత్తని పొడిగా చేసుకోండి. నిజానికి కొన్ని వేపుళ్ళకి బరకగా ఉండే పొడి కూడా రుచిగా ఉంటుంది. నచ్చితే మీరు బరకగా ఉండే పొడిని వాడుకోండి.
ఈ పొడి వేపుళ్ళకి ఎలా వాడుకోవాలి:
ఈ పొడి వంకాయ, గోరుచిక్కుడు, బంగాళా దుంప, కేరట్ వేపుడు ఇలా ఏ వేపుడు కూరల్లోనైనా కారం వేయకుండా ఆఖరున ఈ పొడి వేసి కలిపి దింపేసుకోవడమే! ఉప్పు పొడిలో ఉంది కాబట్టి ఉప్పు తగ్గించి వేసుకోండి.
అవిసెగింజల కారం పొడి - రెసిపీ వీడియో
Flax Seeds Powder | Avisaginjala Karam podi
Prep Time 2 mins
Cook Time 15 mins
Total Time 17 mins
Servings 4
కావాల్సిన పదార్ధాలు
- 2 tsp నూనె
- 1/2 cup అవిసెగింజలు
- 17 - 20 ఎండుమిర్చి
- 1 tbsp పచ్చి సెనగపప్పు
- 1 tbsp పొట్టు మినపప్పు
- 1 tsp జీలకర్ర
- 2 tbsp ధనియాలు
- 7 - 8 వెల్లులి
- చింతపండు - చిన్న ఉసిరికాయ సైజు
- ఉప్పు
విధానం
-
Tsp నూనె వేడి చేసి అవిసె గింజలు వేసి సన్నని సెగ మీద చిట్లనివ్వాలి, చిట్లుతున్న అవిసెగింజలని మరో పళ్లెంలోకి తీసుకోండి
-
మరో tsp నూనె వేడి చేసి అందులో పచ్చి సెనగపప్పు, పొట్టు మినపప్పు వేసి మాంచి సువాసన వచ్చేదాకా వేపుకోవాలి.
-
పప్పు రంగు మారి మాంచి సువాసన వస్తుండగా జీలకర్ర ధనియాలు వేసి ఎర్రగా వేపి తీసుకోండి
-
తరువాత యనేందు మిర్చి వేసి రెండు నిమిషాలు వేపుకోవాలి, ఎండుమిర్చి రంగు మారుతున్నప్పుడు వెల్లులి వేసి వేసి వేపుకోండి పొట్టుతోనే.
-
వేగిన ఎండుమిర్చి అవిసెగింజలు చల్లారుస్తూన్న పళ్లెంలోకి వెల్లులి మరో కప్పులోకి తీసుకోండి
-
చల్లారుతున్న పప్పులోనే చింతపండు ఉప్పు కూడా వేసి కలిపి మిక్సీలో ఇడ్లీ అట్టుల్లోకి అయితే బరకగా, కూరల్లోకి అయితే మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఆఖరున వెల్లులి వేసి 2-3 సార్లు పల్స్ చేసి తీసుకోండి .
-
గాలి చొరని డబ్బాలో పెట్టుకుంటే ఈ పొడి కనీసం రెండు నెలలు నిల్వ ఉంటుంది.

Leave a comment ×
1 comments