ఫ్రూట్ రవ్వ కేసరి
బొంబాయ్ రవ్వ సెనగపిండి సమభాగాలుగా తీసుకుని అందులో సగం నెయ్యి వేసి ఎర్రగా వేపి పంచదారతో పాటు డ్రై ఫ్రూట్స్, టూటీ ఫ్రూటీ ఎసెన్స్ వేసి చేసే స్వీట్ రుచి గురించి ఎంత చెప్పినా తక్కువే ఎంత తిన్నా తక్కువే అనిపిస్తుంది.
సంప్రదాయ రవ్వ కేసరి పరిమళం రుచికి కాస్త భిన్నం ఈ ఫ్రూట్ రవ్వ కేసరి. నాకు ఎంతో ఎంతో ఇష్టం. ఫ్రూట్ రవ్వ కేసరి అంటే తాజా పండ్లు వేసి చేసే రెసిపీ కాదు, డ్రై ఫ్రూట్స్ ఇంకా ఫ్రూట్ ఎసెన్స్ వేసి చేసే కేసరి.
ఈ స్వీట్ని ప్రసాదంగా నేను ప్రతిపాదించను గాని ఏదైనా పార్టీకి లేదా తీపి తినాలనిపించినప్పుడు చేసుకోదగ్గ స్వీట్గా చెప్తాను.

టిప్స్
రవ్వ-సెనగపిండి :
రవ్వని సన్నని సెగ మీద మాంచి సువాసన వచ్చే దాకా వేపుకోవాలి.
నేను సెనగపిండి కూడా వేసాను నచ్చితే మీరు అచ్చంగా రవ్వతోనే చేసుకోవచ్చు.
డ్రై ఫ్రూట్స్:
జీడిపప్పు, బాదాం, పిస్తాతో పాటు టూటీ ఫ్రూటీ ఉంటె డ్రై చేసిన పైనాపిల్, కివి, చెర్రీ ముక్కలు కూడా వేసుకోవచ్చు
ఎసెన్స్:
కచ్చితంగా ఇందులో 4-5 చుక్కలు పైనాపిల్ ఎసెన్స్ వేసుకోవాలి. అంత కంటే ఎక్కువ వేస్తే రుచి పాడవుతుంది, వెగటుగా అనిపిస్తుంది.
నెయ్యి:
నెయ్యి నేను మధ్యస్థంగా వేసాను, నచ్చితే మీరు నెయ్యి డోస్ పెంచుకోవచ్చు
ఫ్రూట్ రవ్వ కేసరి - రెసిపీ వీడియో
Fruit Rava Kesari | Ravva Kesari | How to Make Fruit Rava Kesari
Prep Time 1 min
Cook Time 25 mins
Total Time 26 mins
Servings 5
కావాల్సిన పదార్ధాలు
- 1/2 cup రవ్వ
- 1/2 cup సెనగపిండి
- 1 cup పంచదార
- 1 cup నీళ్లు
- 1 1/4 cup పాలు
- 3 యాలకలు
- 2 tbsp టూటీ ఫ్రూటీ (ఎల్లో రెడ్ కలర్వి లేదా ఇంకేదైనా కలర్)
- 10 బాదాం
- 15 జీడిపప్పు
- 7 - 8 పిస్తా
- 1/2 cup నెయ్యి
- 4 - 5 చుక్కలు పైనాపిల్ ఎసెన్స్
- 1 tsp ఎల్లో ఫుడ్ కలర్
విధానం
-
పావు కప్పు నెయ్యి కరిగించి అందులో జీడిపప్పు బాదాం పిస్తా వేసి ఎర్రగా వేపి తీసుకోండి.
-
మిగిలిన నెయ్యిలో యాలకలు(దంచకండి) రవ్వ సెనగపిండి వేసి మాంచి సువాసన వచ్చేదాకా కలుపుతూ వేపుకోండి.
-
వేగిన రవ్వలో నీళ్లు పాలు పోసి దగ్గర పడనివ్వాలి.
-
దగ్గర పడుతున్న రవ్వలో ఎసెన్స్ పంచదార ఎల్లో ఫుడ్ కలర్ వేసి పంచదారని కరగనివ్వాలి.
-
కరిగిన పంచదారలో టూటి ఫ్రూటీ, డ్రై ఫ్రూట్స్ నెయ్యి వేసి కలిపి దింపేసుకోండి.

Leave a comment ×
1 comments