వెల్లులి చారు
ఘాటుగా పుల్లగా ఘుమఘుమలాడుతూ గ్లాసులతో తాగేంత రుచిగా ఉండే సూపర్ చారు ఈ వెల్లులి చారు. నోరు బాగోలేనప్పుడు లేదా వేపుడులతో నంజుడుగా లేదా మాంచి నాన్ వెజ్ వేపుడు-ఇగురుతో నంజుడుగా ఎంతో రుచిగా ఉండే రసం వెల్లులి రసం.
ఘాటైన ఘుమఘుమలాడే చారుతో ముగించని భోజనం భోజనమే కాదు అనే దక్షిణాది వారున్నారు అంటే అర్ధం చేసుకోవచ్చు చారు ఎంత ఇష్టపడతారో దక్షిణ భారతీయులు. చారులు ఎన్ని రకాలుగా ఉన్నా అన్నీ దాదాపుగా ఒకే తీరుగా ఒకే పదార్ధాలతో ఉంటుంది. చేసే చారుని బట్టి ఆ పదార్ధాన్ని ఎక్కువగా వేసి వండే తీరులో ఉంది రుచి.
టొమాటో చారు అంటే మిగిలిన పదార్ధాలు తగ్గించి టొమాటో రుచి తెలిసేట్టు చేస్తారు. నిజానికి వెల్లులి చారు నేను ఇది వరకు చేసిన టొమాటో చారుకి దగ్గగా ఉంటుంది వేసే పదార్ధాలు కూడా అవే, కానే వేసే మోతాదు మారుతుంది. వెల్లులి చారు అంటే వెల్లులి ఘాటు సువాసన వచ్చేలా కాచాలి, మిగిలిన పదార్ధాలు తగ్గించాలి. ఆ తగ్గించడం పెంచడంలోనే ఉంది అసలైన చారు రుచి.
వెల్లులి చారు రుచిగా ఉంటాయ్ కానీ వెళ్ళు చారు రుచితో పాటు ఘుమఘుమలాడిపోతుంటుంది. వెల్లులి చారుని తమిళవారు మరో తీరులో చేస్తారు అది నేను మరో సారి చెప్తాను. చప్పను కదా చారులు ఇంటికో తీరుగా ఉంటాయని. నాకు మాత్రం వెల్లులి చారు చేసిన రోజున అప్పడాలు లేదా వేపుడు ఉండాల్సిందే!

టిప్స్
-
నచ్చితే చారుకి మామూలు నీళ్ళకంటే కందిపప్పు ఉడికించిన పలుచని నీళ్ళు పోసుకోవచ్చు. అప్పుడు చారు కాస్త చిక్కగా ఉంటుంది.
-
వెల్లులి మరీ ఎక్కువ వేస్తే చారు రుచి బాగుండదు. కాబట్టి నేను వేసిన కొలతలోనే వేయండి వెల్లులి.
-
తాలింపులో ఆఖరున వేసే వెల్లులి పొట్టుతో దంచి వేసి వేపితేనే బాగుంటుంది.
-
కొందరు దింపే ముందు కొద్దిగా బెల్లం వేస్తారు. నచ్చితే వేసుకోవచ్చు. నాకు వెల్లులి చారుకి బెల్లం వేయడం ఇష్టం ఉండదు.
-
చారు దింపే ముందు కచ్చితంగా ఉప్పు రుచి చూసి దింపుకోండి. చారులకి పులుసులకి రాళ్ళ ఉప్పు రుచిగా ఉంటుంది.
-
మరో ముఖ్యమైన విషయం చారు ఎక్కువగా మరగకూడదు. అలా మరిగితే సువాసన తగ్గిపోతుంది.
వెల్లులి చారు - రెసిపీ వీడియో
Garlic Rasam | Velluli charu
Prep Time 2 mins
Cook Time 12 mins
Total Time 14 mins
Servings 4
కావాల్సిన పదార్ధాలు
- 1 tsp మిరియాలు
- 1 tsp జీలకర్ర
- 20 - 25 వెల్లులి (35 grams)
- 4 పచ్చిమిర్చి చీలికలు
- 2 రెబ్బలు కరివేపాకు కాడలుతో సహా
- 1/4 tsp పసుపు
- ఉప్పు
- 1 cup టొమాటో ముక్కలు
- 1/2 cup చింతపండు రసం (50 గ్రాముల చింతపండు నుండి తీసినది)
- 800 ml నీళ్ళు
- 1.5 tsp నూనె
-
తాలింపు
- 1 tbsp నూనె
- 1 tsp ఆవాలు
- 1/4 tsp జీలకర్ర
- 2 ఎండుమిర్చి
- 2 చిటికెళ్లు ఇంగువ
- 2 రెబ్బలు కరివేపాకు
- కొత్తిమీర – చిన్న కట్ట
- 5 పొట్టుతో దంచిన వెల్లులి
విధానం
-
మిరియాలు జీలకర్ర వెల్లులిని కచ్చా పచ్చగా దంచుకోండి.
-
నూనె వేడి చేసి అందులో పచ్చిమిర్చి చీలికలు కరివేపాకు రెబ్బలు కాడలతో సహా దంచిన వెల్లులి మిరియాల ముద్ద వేసి వెల్లులి లేత బంగారు రంగు వచ్చేదాక వేపుకోవాలి.
-
వేగిన వెల్లులిలో టొమాటో ముక్కలు పసుపు ఉప్పు వేసి టొమాటోలని 2 నిమిషాలు ఉడికించుకుంటే చాలు.
-
చింతపండు పులుసు పోసి 2-3 పొంగులు రానివ్వాలి. పొంగిన పులుసులో నీళ్ళు పోసి హై ఫ్లేమ్ మీద పచ్చిమిర్చి మెత్తబడే దాకా మరిగించాలి, తరువాత దింపేయాలి. (చారు సాంబార్కి మల్లె ఎక్కువగా మరగకూడదు).
-
తాలింపు కోసం నూనె వేడి చేసి అందులో తాలింపు సామగ్రి అంతా ఒక్కోటిగా వేసుకుంటూ పొట్టుతో ఉన్న వెల్లులి ని ఎర్రగా వేపి దింపే ముందు కొత్తిమీర వేసి కలిపి చారులో పొసెయ్యండి. అంతే ఘుమఘుమలాడే చారు తయారు.

Leave a comment ×
3 comments