టమాటో రసం | బెస్ట్ టొమాటో రసం చారు
గ్లాసులతో తాగేంత రుచిగా ఉండే బెస్ట్ టొమాటో రసం చారు కోసం చూస్తున్నారా అయితే నా స్టైల్ టొమాటో చారు బెస్ట్. బెస్ట్ & సింపుల్ టొమాటో చారు రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.
చారుతో నాలుగు ముద్దలైనా తిననిది భోజనానికి పరిపూర్ణత రాదు దక్షిణ భారత దేశం వారికి. చారులో ఎన్ని రకాలో. తమిళ వారైతే దాదాపుగా అన్నీ కాయ కూరలతో చారు కాస్తారు అనిపిస్తుంది, అన్నీ చారులున్నాయి వారికి.
నేను అందరికీ ఎంతో ఇష్టమైన టొమాటో చారు సింపుల్గా బెస్ట్ గా వచ్చే రెసిపీ చెప్తున్నా. ఇది ఆంధ్రా తమిళనాడు రాష్ట్రాల కలగలుపుగా నేనో తీరులో చేస్తాను చారు, ఆ చారే చెప్తున్న.
ఈ చారు వేడి అన్నంలో నెయ్యేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇంకా మాంసం వేపుళ్ళలోకి నంజుడుగా కూడా చాలా బాగుంటుంది.
చారు చేసే ముందు ఈ టిప్స్ తెలియడం చాలా అవసరం:

టిప్స్
టొమాటో:
-
నాటు ఎర్రని టొమాటోలు అయితేనే చారు రుచిగా ఉంటుంది. హైబ్రీడ్ టొమాటోలు వాడితే కొంచెం చింతపండు పులుసు ఎక్కువగా వేసుకోవాలి.
-
టొమాటోలు మిక్సీలో వేసి బరకగా రుబ్బేకంటే చేత్తో మెదిపి తీసే సారం రుచి చాలా బాగుంటుంది. మిక్సీలో వేస్తే టొమాటోల పైన ఉండే తోలు కూడా మెదిగి రసంలో కలిసిపోతుంది. అది తినేందుకు అంత రుచిగా అనిపించదు, ఇష్టపడే వారు మిక్సీ వేసుకోండి.
కొత్తిమీర:
చిన్న కొత్తిమీర కట్ట కాడలు టొమాటోతో పాటే గట్టిగా పిండితే సారం దిగుతుంది, ఆ దిగిన కొద్దిపాటి కొత్తిమీర సారం చారుకి ఎంతో రుచి సువాసన.
చారు మరిగించే తీరు:
-
చారుని పచ్చిమిర్చి చీలికలు మెత్తబడే దాకా మరిగిస్తే చాలు.
-
చారులో వేసిన మిరియాలు వెల్లులి ముద్ద ఒక పొంగు వచ్చేదాకా మారిగిస్తే చాలు అంత కంటే మరిగితే మిరియాల ఘాటు పోతుంది.
-
చారులో వేసే చింతపండు పులుపు టొమాటోల పులుపుని బట్టి రుచి చూసి వేసుకోండి
-
పులుసులకి రాళ్ళ ఉప్పు రుచిగా ఉంటుంది, మెత్తని ఉప్పు (Iodised) కంటే
-
వెల్లులి నచ్చని వారు వదిలేయవచ్చు
టమాటో రసం | బెస్ట్ టొమాటో రసం చారు - రెసిపీ వీడియో
Tomato Rasam | Easy Tomato Rasam Recipe | How to make Tomato Rasam | Quick & Easy Recipes
Prep Time 5 mins
Cook Time 15 mins
Total Time 20 mins
Servings 6
కావాల్సిన పదార్ధాలు
- 4 పండిన నాటు టొమాటోలు
- చిన్న కట్ట కొత్తిమీర కాడలు
- 1/2 liter నీళ్ళు
- 1 tsp జీలకర్ర
- 1.5 tbsp నల్ల మిరియాలు
- 10 వెల్లులి
- 1 కరివేపాకు
- 2 tbsp చింతపండు (గోళీ సైజు చింతపండు నుండి తీసినది)
- 2 పచ్చిమిర్చి చీలికలు
- 1/4 tsp పసుపు
- రాళ్ళ ఉప్పు
-
తాలింపు
- 2 tbsp నూనె
- 1 tsp ఆవాలు
- 1 tsp మినపప్పు
- 4 ఎండుమిర్చి
- ఇంగువ – చిటికెడు
- 1 రెబ్బ కరివేపాకు
విధానం
-
టొమాటో ముక్కల్లో కొత్తిమీర కాడలు వేసి గట్టిగా పిండుతూ రసాన్ని తీయండి, తరువాత మిగిలం పిప్పి తీసేసి రసం లో ½ లీటర్ నీళ్ళు పోసి ఉంచుకోండి.
-
జీలకర్ర , మిరియాలు, వెల్లులి, కరివేపాకు వేసి కచ్చపచ్చగా దంచుకోండి.
-
గిన్నెలో టొమాటో రసం పోసి అందులో పచ్చిమిర్చి చీలికలు వేసి మూతపెట్టి పచ్చిమిర్చి మెత్తబడే దాకా మరిగించాలి.
-
పచ్చిమిర్చి మగ్గగానే జీలకర్ర మిరియాల ముద్దా, పసుపు, ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్ మీద. ఒక పొంగు ఒక పొంగు రానిచ్చి స్టవ్ ఆపేయాలి.
-
తాలింపు కోసం నూనె వేడి చేసి అందులో ఆవాలు చిటచిట అన్నాక మిగిలిన పదార్ధాలన్నీ వేసి వేపి చారు లో కలిపేయండి. వేడి అన్నంతో తృప్తిగా తినండి.

Leave a comment ×
7 comments