అల్లం నిమ్మకాయ చారు
చారులు ఎన్ని ఉన్నా గ్లాసులతో తాగేంత రుచిగా ఉండే చారు “అల్లం నిమ్మకాయ చారు”. ఈ సింపుల్ చారు రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.
దక్షిణ భారతదేశం వారికి “చారు” తో ఒక్క ముద్దైనా తింటేగాని భోజనానికి పరిపూర్ణత ఉండదు, అందుకే ఎన్ని రకాల చారులో. ఒక చారు అన్నంతో మరో చారు ఇడ్లీతో ఇంకో చారు పల్చగా సూప్లా తాగేలా ఉంటుంది.
ఈ “అల్లం నిమ్మకాయ చారు” సూప్లా కూడా తాగొచ్చు, ఇంకా ఇడ్లీలో పోసుకుని తొనొచ్చు. చంటి పిల్లలకి మిరియాలు తగ్గించి పెట్టవచ్చు. నోరు బాగలేనప్పుడు, జ్వరం, జలుబు వచ్చి నోటికి ఏ రుచీ తెలియనప్పుడు ఈ చారుతో అన్నం చాలా రుచిగా అనిపిస్తుంది.
వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇడ్లీతో వేడిగా అన్నంతో పుల్లగా ఘాటుగా చాలా రుచిగా ఉంటుంది అల్లం నిమ్మకాయ చారు.

టిప్స్
-
ఈ చారు మిరియాల ఘాటుతో ఉంటే బాగుంటుంది, కారం కావాలనుకుంటే రెండు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవచ్చు.
-
చారు ఒక పొంగు రాగానే దింపేసుకోవాలి, అంత కంటే మరిగితే చారు ఘాటు తగ్గుతుంది.
-
నేను కందిపప్పు వాడాను, కావాలంటే పెసరపప్పు కూడా వాడుకోవచ్చు. పప్పు ఏదైనా నానబెట్టి వాడితే మెత్తగా ఉడికిపోతుంది
-
నిమ్మరసం 3 tbsp వాడాను, మీరు రుచి చూసి తగినట్లుగా ఎప్పుడైనా సరిచేసుకోవచ్చు.
-
వెల్లులి తిననివారు వదిలేవచ్చు.
అల్లం నిమ్మకాయ చారు - రెసిపీ వీడియో
Ginger - Lemon Rasam | Rasam Recipe | Allam Nimakaya Rasam | How to make Ginger Rasam
Prep Time 5 mins
Cook Time 20 mins
Total Time 25 mins
Servings 4
కావాల్సిన పదార్ధాలు
- కందిపప్పు – పిడికెడు (30 నిమిషాలు నానబెట్టినవి)
- 5 - 6 కరివేపాకు కాడలు
- 1 టొమాటో
- 1/8 tsp పసుపు
- 1/2 liter నీళ్ళు
-
చారు పొడి కోసం
- 1 tsp మిరియాలు
- 1 ఇంచు అల్లం
- 5 - 6 వెల్లులి
- 1 tsp జీలకర్ర
-
చారు కోసం
- రాళ్ళ ఉప్పు – రుచికి సరిపడా
- 3 tbsp నిమ్మరసం
- 1 కొత్తిమీర – చిన్న కట్ట
-
చారు తాలింపు కోసం
- 1 tbsp నూనె
- 1/2 tsp ఆవాలు
- 2 చిటికెళ్లు మెంతులు
- 2 ఎండు మిర్చి
- 1 చిటికెడు ఇంగువ
- 2 రెబ్బలు కరివేపాకు
విధానం
-
కుక్కర్ లో నానబెట్టిన కందిపప్పు, పసుపు, టొమాటో, నీళ్ళు కరివేపాకు కాడలు నలిపి వేపి వేసి మెడియం ఫ్లేమ్ మీద నాలుగు విసిల్ రానివ్వాలి కుక్కర్ లో నానబెట్టిన కందిపప్పు, పసుపు, టొమాటో, నీళ్ళు కరివేపాకు కాడలు నలిపి వేపి వేసి మెడియం ఫ్లేమ్ మీద నాలుగు విసిల్ రానివ్వాలి
-
ఆవిరిపోయాక పప్పుని మెత్తగా మెదుపుకోవాలి, తరువాత జల్లెడలో వేసి గరిటతో ఎనిపితే పప్పు మొత్తం దిగిపోతుంది
-
మిక్సీలో చారు పొడికి ఉంచిన పదార్ధాలన్నీ వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి
-
పప్పు నీళ్ళు గిన్నెలో పోసి రుచికి సరిపడా రాళ్ళ ఉప్పు వేసి ఒక పొంగురానిచ్చి, నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేసి దింపేసుకోండి
-
తాలింపు కోసం నూనె వేడి చేసి ఆవాలు మెంతులు వేసి చిటచిటలాడించి ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ కూడా వేసి వేపి చారులో కలుపుకుంటే ఘాటైన చారు రెడీ.

Leave a comment ×
1 comments