కడప కారం దోశ
అట్లు ఎన్ని రకాలున్నా ఉన్నా నాలుక మీద చుర్రు మనిపించే కడప కారం దోశ రుచి ప్రేత్యేకం. ఆంధ్రాలోని కడప జిల్లాలో పొద్దున్నే ఏ వీధిలో చూసినా “కడప కారం దోశ” అంగడులు తారాసపడతాయ్. హోటల్స్లో కంటే ఎక్కువగా కారం దోశ రోడ్ల పక్క అమ్మే బండ్ల మీదే తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు. నిజానికి బండ్ల మీద వచ్చే రుచి హోటల్స్లో రాదు.
ఎర్రని ఘాటైన కారం పూసి, పైన పప్పుల పొడి నెయ్యి వేసి కరకరలాడేట్టు కాల్చే అట్టు పుల్లని బొంబాయ్ చట్నీలో నంజుకు తింటుంటే ఆ మజా మాటల్లో వర్ణించలేనిది. కడప కారం దోశకి ఉన్న అభిమానులు అంతా ఇంతా కాదు అందుకే ఇప్పుడు కడప కారం దోశ ఇప్పుడు హైదరాబాద్ లాంటి నగరాల్లో కూడా బండ్ల మీదే దొరుకుతుంది.
రాయలసీమ ఫేమస్ కడప కారం దోశ రెసిపీలో నేను పర్ఫెక్ట్ అట్ల పిండి, ఘాటైన కడప స్టైల్ ఎర్ర కారం, పప్పుల పొడి బొంబాయ్ చట్నీ రెసిపీ వివరంగా చెప్తున్నా.
ప్రస్తుతానికి కారం దోశ రకరకాల రుచులతో దొరుకుతుంది అవన్నీ కూడా వివరంగా కింద టిప్స్లో ఉంది చూడండి.

టిప్స్
దోశ పిండి/స్ట్రీట్ స్టైల్లో అట్టు కాల్చే తీరు :
-
దోశ పిండి మామూలు తెలుగు వారు చేసుకునే దోశ కొలతే కప్పు మినపప్పుకి 3 కప్పుల అట్ల బియ్యం కాసిని మెంతులు.
-
పప్పు బియ్యం నాలుగు గంటలు నాని తరువాత ఎక్కువసేపు మెత్తగా రుబ్బుకుని 16 గంటలు పులియబెట్టగలిగితే పిండి బాగా పులిసి అట్టు ఇంకా రుచిగా ఉంటుంది.
-
స్ట్రీట్ స్టైల్ అట్టులా కరకరలాడలంటే అట్టు పిండి కాసింత చిక్కగా కలుపుకోవాలి. ఇంకా పెనం చివరిదాకా కాకుండా పెనానికి మంట ఎక్కడ దాకా తగులుతుందో అక్కడి దాకా మాత్రమే పిండి స్ప్రెడ్ చేసుకుంటే అట్టు సమంగా ఒకే తీరుగా కాలుతుంది.
-
అట్టు బండ్ల మీద దొరికే తీరులో కరకరలాడాలంటే మాత్రం పిండి కాస్త చిక్కగా ఉండాలి కాసింత ఎక్కువ నూనె నెయ్యిలో నిదానంగా కాలాలి అప్పుడు నీరుగా ఉండే ఎర్రకారం పూసిన అట్టు మెత్తబడదు.
ఎర్ర కారం:
-
వెనుకటికి అట్లకి పూసే కడప ఎర్రకారం అంటే వట్టి ఎండుమిర్చి, వెల్లులి, ఉప్పు వేసి మెత్తగా రోట్లో నూరే వారు. కానీ ఇప్పుడు కొందరు కాసింత చింతపండు కూడా వేస్తున్నారు నచ్చితే మీరు వేసుకోవచ్చు. నేను వెల్లులి కూడా కారంలో వేయలేదు పప్పుల పొడిలో వెల్లులి సరిపోతుందని. నచ్చితే కొంచెం వేసుకోండి
-
కారం ఎప్పుడు కూడా అట్టు ఎర్రగా రెండు వైపులా కాలాక తిప్పి పూసుకోవాలి. అట్టు ఒక వైపు ఎర్రబడ్డాక పూస్తే అట్టు అంత రుచిగా ఉండదు.
పప్పుల పొడి:
- మామూలుగా చేసుకునే పప్పుల పొడిలో చింతపండు ఎండుమిర్చి వెల్లులి వేస్తారు. కానీ కారం దోశలో చల్లే పొడికి వట్టి వెల్లులి వేసి మెత్తని పొడి చేస్తారు.
బొంబాయ్ చట్నీ:
-
దక్షిణ భారత దేశంలో ఎక్కువగా ఈ బొంబాయ్ చట్నీ చేస్తారు. అందులోనూ ఆంధ్రాలో చాలా ఎక్కువగా చేస్తారు. ఈ చట్నీ రాష్ట్రానికి ఒక్కో తీరుగా చేస్తారు. ఆంధ్రుల తీరు చింత పులుసులో శెనగపిండి వేసి మరిగించి పల్చగా దింపుతారు.
-
బొంబాయ్ చట్నీ ఒక్క పొంగు రాగానే దింపేసుకోవాలి లేదంటే చల్లారాక చిక్కబడుతుంది. ఒక వేళ చల్లారాక చిక్కబడితే వేడి నీళ్ళు కొద్దిగా ఉప్పు వేసి పలుచన చేసుకోవచ్చు.
ఇంకొన్ని విధానాలు:
-
ఈ మధ్య కొందరు బొంబాయ్ చట్నీ అట్టు మీదే పోసి ఇస్తున్నారు. నాకు అట్టు మీద బొంబాయ్ చట్నీ పోసుకుని తినడం అంతగా నచ్చలేదు కాబట్టి, నేను విడిగా నంజుకు తినేలా ఉంచాను. నచ్చితే కారం పూసక చిక్కని బొంబాయ్ చట్నీ అట్టు మీద పోసుకుని వెంటనే తేసేయాలి లేదంటే అట్టు మెత్తగా అవుతుంది
-
నచ్చితే అట్టు మీద కారం పూశాక గుడ్డు కొట్టి వేసి కాల్చుకుని తీసుకోవచ్చు. కానీ గుడ్డు వేసుకోవాలంటే అట్టు ఒకవైపు కాలితే చాలు
-
అట్టు అచ్చంగా నెయ్యితోనే కాల్చుకోవచ్చు, లేదా నాలా అంచుల వెంట నూనె మధ్యన నెయ్యితో కాల్చుకోవచ్చు. ఈ అట్టుకి నూనె ఎక్కువగా ఉంటేనే రుచి.

కడప కారం దోశ - రెసిపీ వీడియో
Kadapa Karam Dosa | Spicy Dosa | Perfect Red Chilli Dosa
Prep Time 5 mins
Cook Time 20 mins
Total Time 25 mins
Servings 25
కావాల్సిన పదార్ధాలు
-
అట్ల పిండి కోసం:
- 1 cup మినపప్పు
- 3 cups బియ్యం
- 1 tsp మెంతులు
- నీళ్ళు – పిండి రుబ్బుకోడానికి
- ఉప్పు పిండిలో కలుపుకోడానికి
-
ఎర్ర కారం కోసం
- 20 - 25 ఎండు మిరపకాయలు
- ఉప్పు
- 1 tsp జీలకర్ర
- 2 ఉల్లిపాయ - పెద్దవి
- నీళ్ళు – రుబ్బుకోడానికి
- వేడి నీళ్ళు మిరపకాయలు నానబెట్టడానికి
-
పప్పుల పొడి
- 5 - 6 వెల్లులి
- 1/2 cup వేపిన శెనగపప్పు /పుట్నాల పప్పు
- ఉప్పు
-
బొంబాయ్ చట్నీ
- చింతపండు- నిమ్మకాయంత
- 2 tbsp శెనగపిండి
- ఉప్పు
- 1/4 tsp పసుపు
- 1/2 tsp ఆవాలు
- 1 tsp మినపప్పు
- 1/2 tsp జీలకర్ర
- 2 tsp నూనె
- 1/2 tsp అల్లం
- 1 tsp పచ్చిమిర్చి తరుగు
- 2 రెబ్బలు కరివేపాకు
- 350 ml నీళ్ళు
విధానం
-
నాలుగు గంటలు నానబెట్టిన మినపప్పు బియ్యం మెంతులని మెత్తగా రుబ్బుకుని కనీసం 12 గంటలు పులియబెట్టాలి. (టిప్స్ చూడండి).
-
పులసిన పిండిలో కొద్దిగా ఉప్పు అవసరానికి తగినట్లు నీళ్ళు కలిపి పక్కనుంచుకోండి.
-
ఎర్ర కారం కోసం మిరపకాయలలో వేడి నీళ్ళు పోసి 15 నిమిషాలు నానబెట్టుకోండి.
-
నానిన మిరపకాయలు ఉప్పు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి (మరో పద్ధతి కోసం టిప్స్ చూడండి).
-
పప్పుల పొడి కోసం వెల్లులి పుట్నాలు వేసి మెత్తని పొడి చేసుకోండి.
-
బొంబాయ్ చట్నీ కోసం నానబెట్టిన చింతపండు నుండి రసాన్ని తీయండి, అందులో శెనగపిండి, నీళ్ళు, ఉప్పు వేసి చేత్తో గడ్డలు లేకుండా బాగా కలిపి పక్కనుంచుకోండి.
-
పాన్లో నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినపప్పు వేసి ఎర్రగా వేపుకోండి తరువాత ఎండుమిర్చి ముక్కలు జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, పసుపు వేసి వేపుకోండి.
-
వేగిన తాలింపు మంట తగ్గించి శెనగపిండి నీళ్ళు పోసి గడ్డలు లేకుండా బాగా కలిపి ఒక పొంగు రానివ్వాలి.
-
ఒక పొంగు రాగానే ఉప్పు రుచి చూసి దింపేసుకోండి (పర్ఫెక్ట్ బొంబాయ్ చట్నీ కోసం టిప్స్ చూడండి).
-
పెనాన్ని బాగా వేడి చేసి పెద్ద గరిటేడు పిండి పోసి కొద్ది మందంగా పిండి స్ప్రెడ్ చేసుకోండి.
-
పిండి అంచుల వెంట 1.5 tbsp నూనె వేసి కాల్చుకోవాలి. అట్టు మధ్యన ఎర్రబడుతుండగా నెయ్యి వేసి అట్టు అంతా పూసి మంట తగ్గించి నిదానంగా ఎర్రగా కాల్చుకోవాలి (అట్టు ఎర్రగా కాల్చడానికి టిప్స్ చూడండి).
-
అట్టు ఎర్రగా కాలాక అట్టుని తిరగతిప్పి 30 సెకన్లు కాల్చి మళ్ళీ తిరగతిప్పి ఎర్ర కారం 1 tbsp వేసి అట్టు అంతా పూయాలి ఆ పైన పప్పుల పొడి చల్లి అట్టుని మధ్యకి మడిచి బొంబాయ్ చట్నీ, కొబ్బరి పచ్చడితో వేడి వేడిగా ఆనందించండి.

Leave a comment ×
1 comments