కలగూర పులుసు రెసిపీ | కలగూర పులుసు

కలగూర పులుసు- గుభాళించే తాలింపు పెట్టి రకరకాల ఆకు కూరలని కలిపి ఉడికించి అందులో చింతపులుసు వంకాయ ముక్కలు వేసి దగ్గరగా ఉడికించి చేసే చిక్కని కమ్మని పులుసు.

కనీసం మూడు రకాల ఆకుకూరలు వేసి చేసే ఈ కమ్మని పులుసు వేడి అన్నం చపాతీతో ఎంతో రుచిగా ఉంటుంది. ఈ పులుసునే కలగలుపు పులుసు అని కూడా అంటారు. 

సాధారణంగా సంక్రాంతికి తెలుగు వారు ఆకు కూరలు గుమ్మడి, మునక్కాడ, చిలకడదుంప ఇలా అందుబాటులో ఉన్న కాయగూరలని కలిపి పులుసు చేస్తారు, ఇది కేవలం ఆకు కూరలతో చేసే కమ్మని పులుసు రెసిపీ. 

టిప్స్

ఆకు కూరలు:

  1. నేను తోటకూర, చుక్కకూర, మెంతి కూర తీసుకున్నాను. మీరు మీకు అందుబాటులో ఉండే ఆకుకూరలు కలిపి చేసుకోవచ్చు. ఆకు కూర వేసుకునేప్పుడు ఒక్కో ఆకు ఒక్కో రుచితో ఉండేవి వేసుకోండి. అంటే మెంతి కూర చేదు చుక్క కూర పులుపు తోటకూర తెలిసీతెలియని వగరుతో ఉంటుంది ఇలా మీరు ఆకుకూరల్ని ఎంపిక చేసుకుని చేసుకుంటే రుచితో పాటు ఎంతో ఆరోగ్యం కూడా. 

వంకాయ:

  1. సాధారణంగా మా ఇంట్లో ఒక్క వంకాయ ముక్కలైనా వేస్తారు ఆకు కూరకి కొత్త రూపాన్ని రుచిని ఇస్తుంది అని. ఇక్కడ మీరు కావాలంటే వంకాయకి బదులు బెండకాయ కూడా వాడుకోవచ్చు. వంకాయ బెండకాయ ఏదైనా పులుసులో ఊరి చాలా రుచిగా ఉంటుంది. 

శెనగపప్పు:

  1. నేను తాలింపులో శెనగపప్పు వేసి వేపి చేసేశాను. మీరు పప్పుని కనీసం అరగంటైనా నానబెట్టుకుని ఆకుకూరలతో కలిపి ఉడికించుకుంటే చాలా రుచిగా ఉంటుంది. 

పులుసు చిక్కదనం కోసం:

  1. సాధారణంగా పులుసు జారిపోతుంది పలుచగా అందుకని ఆఖరున కొద్దిగా బియ్యం పిండి లేదా శనగపిండి నీరు వేసుకుని మరిగిస్తే పులుసు చిక్కబడుతుంది, అన్నంతో కలుపుకుని తినేందుకు రుచిగా ఉంటుంది. 

కలగూర పులుసు రెసిపీ | కలగూర పులుసు - రెసిపీ వీడియో

Kalagura Pulusu Recipe | Mixed Greens Curry | Kalagoora Pulusu | Pulusu Recipe

Bachelors Recipes | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 20 mins
  • Total Time 25 mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • 3 tbsp నూనె
  • 2 ఎండుమిర్చి
  • 1 tsp ఆవాలు
  • 3-4 tbsp పచ్చిశెనగపప్పు
  • 1 tsp జీలకర్ర
  • 8-10 cloves దంచిన వెల్లుల్లి
  • 2 pinches ఇంగువ ( 2 చిటికెళ్లు)
  • 2 sprigs కరివేపాకు (2 రెబ్బలు)
  • ¾ cup ఉల్లిపాయ తరుగు
  • 2 tbsp పచ్చిమిర్చి తరుగు
  • ⅓ cup టమాటో తరుగు
  • 1 tsp కారం
  • ఉప్పు (రుచికి సరిపడా)
  • ¼ tsp పసుపు
  • 1 tsp ధనియాల పొడి
  • 5 వంకాయ ముక్కలు
  • 1.5 cups నీరు
  • 2 cups తోటకూర
  • 1 cup మెంతి కూర
  • 1.5 cups చుక్క కూర / గోంగూర
  • ½ cup పలుచని చింతపులుసు (ఉసిరికాయంత చింతపండు నుండి తీసినది)
  • 3 tbsp శెనగపిండి/ బియ్యం నీరు
  • కొత్తిమీర (కొద్దిగా)

విధానం

  1. నూనె వేడి చేసి తాలింపు సామాగ్రీ అంతా వేసి ఎర్రగా వేపుకోండి.
  2. వెల్లుల్లి ఎర్రగా వేగి కరివేపాకు మగ్గిన తరువాత ఉల్లిపాయ తరుగు, ఉప్పు, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయని ఒక్క నిమిషం వేపుకోండి.
  3. మగ్గిన ఉల్లిలో టమాటో ముక్కలు, పసుపు, కారం, ధనియాల పొడి, కొద్దిగా నీరు వేసి మెత్తగా గుజ్జుగా అయ్యేదాకా వేపుకోండి.
  4. గుజ్జుగా అయిన టమాటోలో వంకాయ ముక్కలు వేసి వంకాయ మెత్తబడేదాకా మూత పెట్టి మగ్గించండి.
  5. మగ్గిన వంకాయలో ఆకుకూరలన్నీ వేసి నూనె పైకి తేలేదాకా వేపండి.
  6. ఆకులోని పసరు వాసన పోయాక నీరుపోసి దగ్గరగా ఉడికించండి.
  7. ఆఖరుగా చింతపండు పులుసు, శెనగపిండి లేదా బియ్యం పిండి నీరు పోసి చింతపులుసు పచ్చివాసన పోయేదాకా ఉడికించండి.
  8. దింపే ముందు కొత్తిమీర తరుగు వేసి కలిపి ఉప్పు కారాలు రుచి చూసుకుని దింపేసుకుంటే గొప్ప రుచిగా ఉండే కలగూర పులుసు తయారు.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.