కొబ్బరి లవుజు | కోకోనట్ బర్ఫీ | ఆంధ్రా స్టయిల్ కొబ్బరి లవుజు | కొబ్బరి మిఠాయి

పచ్చికొబ్బరిని పంచదార పాకం లో దగ్గరగా ఉడికించి చేసే ఈ కొబ్బరి లవుజు తిన్న కొలది తినాలనిపించడమే కాదు ఎక్కువ రోజులు నిలవుంటాయ్ కూడా.

కేవలం మూడే పదార్ధాలతో తయారయ్యే ఈ స్వీట్ ఏ తెలుగు వారిని కదిపినా ఎన్నో జ్ఞాపకాలు అనుభూతులు పంచుకుంటారు. ఇప్పుడంటే ఏవేవో స్వీట్లు వచ్చేశాయ్ కానీ ఒకప్పుడు ప్రతీ ఇంట్లో చేసుకునే తీపి పదార్ధాల్లో ఇదీ ఒకటి.

కొన్నేళ్ల క్రితం వరకు కూడా చాల మంది హాస్టల్స్ లో చదువుకునే స్టూడెంట్స్ ఇవే పట్టుకెళ్ళేవారు, నేను కూడా అనుకోండి.

ఈ రెసిపీ కావలసినవి మూడే పదార్ధాలు కానీ పాకం పట్టె తీరు పంచదార కొలత మీద ఆధారపడి ఉంటుంది ఏ కొబ్బరి లవుజు అయినా, ఆ తీరులన్నీ ఈ వంటకంలో వివరంగా రాసి ఉంచాను చుడండి.

టిప్స్

పచ్చికొబ్బరి:

  • ఈ మిఠాయికి ముదురు పచ్చికొబ్బరి వాడుకోగలిగితే ఎంతో రుచిగా ఉంటుంది.

  • మీకు ఓపిక ఉంటె పచ్చి కొబ్బరిని సన్నగా తురుముకోవచ్చు, లేదా నాలా కాస్త బరకగా మిక్సీ కూడా పట్టుకోవచ్చు.

పంచదార:

సాధారణంగా కొబ్బరి పంచదార సమానంగా వేస్తారు, కానీ నేను మాత్రం ½ కప్పు తక్కువగా వేస్తున్నాను. సమానంగా వేసే పంచదార ఒక్క ముక్క తిన్నానా వెగటుగా అనిపిస్తుంది తీపి. అందుకే నేను కాస్త తక్కువగా పంచదార వేస్తున్నాను.

పాకం:

  • పాకం ఒక తీగ రాగానే పచ్చికొబ్బరి వేసి తెల్లని పాల నురగ మాదిరి వచ్చేదాకా మరిగించాలి.

  • పాకం ఎక్కువగా మరిగితే పొడిపొడిగా అయిపోతుంది, తక్కువగా అయితే మెత్తగా ఉంటుంది. కాబట్టి పాకం తెల్లని ముదురు పాల పొంగు మాదిరి వచ్చిన తరువాత వెంటనే తీసి మౌల్డ్ లో పోసేసుకోండి.

ఇంకొన్ని విషయాలు:

  • వెనుకటికి నెల మీద నెయ్యి రాసి పాకం పోసి ముక్కలు చేసేవారు. మీరు ఆ పద్ధతీ పాటించొచ్చు, లేదా ఏదైనా పళ్లెంలో బటర్ పేపర్ వేసి దాని మీద పాకం పోసుకుని తీసుకుంటే చాలా సులభంగా వచ్చేస్తాయి ముక్కలు.

  • పాకం పళ్లెంలో పోసుకున్నాక వేడి మీదే ముక్కలుగా గాట్లు పెట్టుకోవాలి లేదంటే చల్లారిన తరువాత అడ్డదిడ్డంగా వస్తాయి ముక్కలు.

  • ఏ కారణం చేతనైన పాకం ఎక్కువగా మరిగి పొడిపొడిగా అయిపోతే ఇంకొన్ని నీరు పోసి పాకం పలుచన చేసి పళ్లెంలో ఆరబెట్టుకోండి.

కొబ్బరి లవుజు | కోకోనట్ బర్ఫీ | ఆంధ్రా స్టయిల్ కొబ్బరి లవుజు | కొబ్బరి మిఠాయి - రెసిపీ వీడియో

Kobbari Lauzu | Coconut Burfi | Andhra Style Coconut Barfi

Bachelors Recipes | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 20 mins
  • Resting Time 1 hr
  • Total Time 1 hr 25 mins
  • Servings 12

కావాల్సిన పదార్ధాలు

  • 2 ½ cups ముదురు పచ్చికొబ్బరి
  • 2 cups పంచదార
  • ½ tsp యాలకల పొడి
  • 1 tsp నెయ్యి
  • ½ cup నీళ్లు

విధానం

  1. ముదురు కొబ్బరిని మిక్సీలో రుబ్బుకోండి లేదా తురుముకోండి.
  2. ఒక పళ్లెంలో నెయ్యి రాసి ఉంచుకోండి లేదా బటర్ పేపర్ వేసి ఉంచుకోండి.
  3. పంచదారలో నీరు పోసి ఒక తీగ పాకం వచ్చేదాక మరిగించండి.
  4. తీగ పాకం వచ్చిన పచ్చికొబ్బరి వేసి చిక్కని పాల పొంగు మాదిరి పాకం వచ్చేదాక మరగనివ్వండి.
  5. పాకం చిక్కబడుతున్నప్పుడు యాలకలు పొడి, నెయ్యి వేసి కలిపి నెయ్యి రాసుకున్న పళ్లెంలో పోసేసుకోండి.
  6. పాకం పళ్లెంలో పోసుకున్నాక వేడి మీదే ముక్కలుగా కోసుకోండి, పూర్తిగా చల్లారిన తరువాత ముక్కలు విరుపుకోండి.
  7. ఇవి కనీసం మీకు నెల రోజులు నిలవుంటాయి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.