మద్రాస్ వెన్ పొంగల్ రెసిపీ | కట్టు పొంగలి రెసిపీ | పొంగల్ రెసిపీ తెలుగులొ

బియ్యం పెసరపప్పుని మెత్తగా ఉడికించి నేతిలో మిరియాలు జీడిపప్పు ఇంగువ కరివేపాకు జీలకర్ర వేసి తాలింపు పెట్టి చేసే వెన్నలాంటి మద్రాస్ పొంగల్ ఒక రెసిపీ కాదు ఒక ఎమోషన్!!!

పొంగల్ దక్షిణాది వారికి ఎంతో ఇష్టమైన వంటకమే, కానీ పొంగల్ తెలుగు వారికి కన్నడిగులకి కేరళ వారికి ఆలయాల్లో ఇచ్చే ప్రసాదం, కానీ తమిళ వారికి మాత్రం పొద్దున్నే తినే టిఫిన్. అందుకే తమిళ వారికి ఏర్పడిన నిర్దిష్టమైన కొలత కచ్చితమైన తీఋ మరే రాష్ట్రాల వారికి ఏర్పడలేదు.

తెలుగు వారు కూడా కాలానుగుణంగా పొంగల్ టిఫిన్స్గా తినడానికి అలవాటు పడ్డారు కానీ తమిళవారంతా కచ్చితమైన తీరు కొలతలు మాత్రం లేవు. తెలుగు వారు పొంగల్ చాలా జారుగా ఉంటుంది. ఇవే వేయాలి ఇలాగే ఉండాలి లాంటివి లేవు, అందుకే కొందరు ఎక్కువెక్కువ మిరియాలు దండిగా అల్లం తరుగు పచ్చిమిర్చి చీలికలు వేస్తారు ఇంకొందరు ఆవాలు వేసి తాలింపు పెట్టె చిత్రమైన తీరుని చూశాను. అసలు పొంగల్కి ఆవాల తాలింపు అంటే ఒక దారుణం అనే అనాలి.

కానీ మద్రాస్ పొంగల్ చాలా కచ్చితమైన తీరులో ఉంటుంది. పొంగల్ వేడి వేడిగా వడ్డించాలి, హల్వా మాదిరి ముద్దగా నిలిచి ఉండాలి, సాంబార్ వడ కొబ్బరి పచ్చడి నంజుకుంటూ తినాలి. మద్రాస్ పొంగల్లో పచ్చిమిర్చి దండిగా మిరియాలు వేయరు. మరిన్ని వివరాలు కింద టిప్స్లో చుడండి బెస్ట్ మద్రాస్ వెన్ పొంగల్ని ఆశ్వాదించండి.

టిప్స్

బియ్యం:

చల్లారిన బిరుసెక్కాని మృదువైన పొంగల్ కోసం కొత్త బియ్యం వాడుకోవాలి. లేదా తెలుగు వారు దోశల బియ్యం అంటుంటారు ఇవి రేషన్లో ప్రభుత్వాలు ఇస్తుంటాయి ఏవైనా వాడుకోవాలి అప్పుడే పొంగల్ మృదువుగా ఉంటుంది. పాత బియ్యం వాడినా బాగానే ఉంటుంది కాకపోతే చల్లారాక బిరుసెక్కుతుంది. బియ్యంని కడిగి కనీసం గంట సేపు నానబెట్టుకోవాలి. అప్పుడు పొంగల్ చాలా మృదువుగా ఉంటుంది.

పెసరపప్పు:

ఏ కొలతకి చేసుకున్నా బియ్యంలో సగం పెసరపప్పు ఉండాలి. చాలా మంది పెసరపప్పుని కొద్దిగా వేపి పొంగల్ చేస్తారు, ఆ తీరులోనూ చేసుకోవచ్చు, కాకపోతే వేపిన పెసరపప్పుతో పొంగల్ బిరుసెక్కుతుంది, అంతే!!!

నీరు:

కప్పుకి నాలుగు కప్పుల నీరు అవసరమవుతుంది. ఒక వేళా ఏ కారణం చేతనైన పొంగల్ బిరుసెక్కితే వేడి నీరు పోసి పలుచన చేసుకోవచ్చు.

ఉప్పు:

పొంగల్ కి అన్నం ఉడికేప్పుడే ఉప్పు వేస్తే పట్టుకుంటుంది.

నెయ్యి:

అసలైన పెళ్లిపై తీరు పొంగల్ చేయాలంటే పెసరపప్పు నెయ్యి జీడిపప్పు కొలత సమానంగా ఉండాలి. పొంగల్ మృదుత్వం అంతా నీరు కంటే కూడా నెయ్యితో ఉండాలంటారు తమిళవారు.

జీడిపప్పు:

జీడిపప్పు ప్రతీ రెండు ముద్దలకి ఒక పలుకైనా నోట్లో నలగాలంటారు తమిళవారు. కాబట్టి జీడిపప్పు మీకు నచ్చిన కొలతల్లో వేసుకోండి. నిజానికి ఎంత ఎక్కువ ఉన్నా రుచిగానే ఉంటుంది.

మిరియాలు:

మిరియాలు ముందుగా నేతి చిట్లాలి అప్పుడే మిరియాల ఘాటు తగ్గుతుంది, ఇంకా నమిలి తినగలిగేలా ఉంటుంది.

తాలింపు:

పొంగలి కి తాలింపు ఊపిరి లాంటిది అందుకే కమ్మని నెయ్యిలో ఇంగువ కరివేపాకు దట్టించి నిదానంగా వేపుకుంటే బెస్ట్ పొంగల్ని మీరు ఆశ్వాదించగలుగుతారు.

మద్రాస్ వెన్ పొంగల్ రెసిపీ | కట్టు పొంగలి రెసిపీ | పొంగల్ రెసిపీ తెలుగులొ - రెసిపీ వీడియో

Madras Ven Pongal Recipe | Ven Pongal Recipe | Pongal Recipe in Telugu | How to make Pongal

Breakfast Recipes | vegetarian
  • Prep Time 1 min
  • Soaking Time 1 hr
  • Cook Time 20 mins
  • Total Time 1 hr 21 mins
  • Servings 5

కావాల్సిన పదార్ధాలు

  • 1 cup కొత్తబియ్యం
  • 1/2 cup పెసరపప్పు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • 5 sprigs ముదురు కరివేపాకు
  • 4.5 cups నీరు
  • 1/2 cup నెయ్యి
  • 1/2 cup జీడీపప్పు
  • 1/2 tbsp మిరియాలు
  • 1.5 tbsp అల్లం తురుము
  • 1/2 tbsp జీలకర్ర
  • 1/2 tsp ఇంగువ

విధానం

  1. బియ్యం పెసరపప్పు తెల్లగా మారే దాకా కడిగి నాలుగున్నర కప్పుల నీరు పోసి కనీసం గంటసేపు నానబెట్టుకోవాలి
  2. గంట తరువాత కుక్కర్లో నానిన బియ్యం, పప్పు నీరు ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్ మీద 4 కూతలు వచ్చేదాకా ఉడికించుకోవాలి.
  3. పొంగల్ ఉడికాక రెండు చెంచాల నెయ్యి రెండు రెబ్బలు కరివేపాకు వేసి బాగా కలిపి పక్కనుంచుకోండి .
  4. నెయ్యి వేడి చేసి ముందుగా మిరియాలు వేసి చిట్లనివ్వాలి. మిరియాలు చిట్లిన తరువాత అల్లం తురుము వేసి వేపుకోండి
  5. వేగిన అల్లం తురుముతో జీలకర్ర వేసి చిట్లనివ్వాలి. చిట్లిన జీలకర్రలో జీడిపప్పు వేసి లేత బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి. వేగిన పప్పులో కరివేపాకు ఇంగువ వేసి ఎర్రగా వేపుకోండి.
  6. వేగిన తాలింపుని పొంగల్లో వేసి కలుపుకోండి. ఆఖరుగా పైన రెండు చెంచాల నెయ్యి వేసి కలపకుండా మూతపెట్టి వదిలేస్తే తాలింపు పరిమళం అంతా పొంగల్ పట్టుకుంటుంది.
  7. పది నిమిషాల తరువాత వేడి వేడి మద్రాస్ వెన్ పొంగల్ కరకరలాడే వడ సాంబార్ కొబ్బరి పచ్చడితో ఆశ్వాదించండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments

  • K
    Krishna Swamy M B
    Recipe Rating:
    That's so lovely... Pls share the recipe of the gravy used here along with Pongal