పెసరపప్పు పులుసు | పెసర కట్టు | రాచిప్పలో అమ్మలకాలం నాటి పెసరపప్పు పులుసు
చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ఇష్టంగా తినే సింపుల్ రెసిపీ ఆంధ్రా పెసరపప్పు పులుసు. ఈ సింపుల్ రెసిపీ ఎప్పుడు చేసినా సూపర్ హిట్. రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.
రోజూ పులుసులు మరగని ఇల్లు ఉండదేమో దక్షిణ భారతదేశంలో. ప్రాంతానికి, కులానికి, మతానికి ఎన్నేసి రకాల పులుసులో. కొన్ని వందల రకాల పులుసుల్లో ఒకటి ఈ ఆంధ్రా స్టైల్ పెసరపప్పు పులుసు. దీన్నే తెలుగు వారు “పెసర కట్టు” అని కూడా అంటారు. పెసరపప్పు, నిమ్మరసం వేసి పలుచగా కాచే సింపుల్ పులుసు.
అన్నీ పులుసులు మాదిరిగా ఇందులో చింతపండు పులుసు ఉండదు నిమ్మరసం ఉంటుంది. వేసవిలో ఇంకా నోరుబాగలేనప్పుడు, తేలికగా ఏదైనా తినాలనుకున్నప్పుడు వేడిగా అన్నం నెయ్యితో కలిపి తింటే చాలా బాగుంటుంది ఈ పెసరపప్పు పులుసు పర్ఫెక్ట్.

టిప్స్
-
సాధారణంగా చాలా మంది పెసరపప్పు కడిగి ఉడికించేస్తారు. నేను పెసరపప్పు వేపి మెత్తగా ఉడికిస్తాను. వేపి ఉడికించిన పులుసు రుచి చాలా బాగుంటుంది. టైమ్ లేనప్పుడు పప్పుని కడిగి వాడేసుకోవచ్చు
-
ఈ పులుసు లో పచ్చిమిర్చితో వచ్చే కారం రుచి బాగుంటుంది. ఎండు కారం కంటే. నచ్చితే అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది
-
కొందరు నెయ్యి తాలింపు పెడతారు. నచ్చితే అలా కూడా చేసుకోవచ్చు.
-
నేను చిన్న సాంబార్ ఉల్లిపాయలు వాడాను మీరు కావాలంటే ఉల్లిపాయ చీలికలు కూడా వాడుకోవచ్చు.
పెసరపప్పు పులుసు | పెసర కట్టు | రాచిప్పలో అమ్మలకాలం నాటి పెసరపప్పు పులుసు - రెసిపీ వీడియో
Moong Dal Sambar | Pesarapappu Pulusu | Easy Moong Dal Sambar Recipe | How to make Moongdal Sambar
Prep Time 5 mins
Cook Time 20 mins
Total Time 25 mins
Servings 6
కావాల్సిన పదార్ధాలు
- 1/2 cup పెసరపప్పు
- 1/2 cup సాంబార్ ఉల్లిపాయలు/ఉల్లిపాయ చీలికలు
- 6 పచ్చిమిర్చి
- ఉప్పు
- 1/2 tsp పసుపు
- 1/2 liter నీళ్ళు
- 2.5 tbsp నిమ్మరసం
-
తాలింపు కోసం
- 2 tsp నూనె/నెయ్యి
- 2 ఎండు మిర్చి
- 1 tsp ఆవాలు
- 1 tsp జీలకర్ర
- 1 రెబ్బ కరివేపాకు
- ఇంగువా – చిటికెడు
- కొత్తిమీర – చిన్న కట్ట
విధానం
-
పెసరపప్పుని సన్నని సెగ మీద మాంచి సువాసన వచ్చే దాకా వేపి కడిగి 2.5 కప్పుల నీళ్ళతో మెత్తగా ఉడికించుకోవాలి.
-
గిన్నెలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి , పసుపు, ఉప్పు, నీళ్ళు పోసి ఉల్లిపాయలు మెత్తగా ఉడికేదాక మూతపెట్టి ఉడికించుకోవాలి.
-
ఉల్లిపాయలు మెత్తగా ఉడికాక మెత్తగా ఉడికించుకున్న పెసరపప్పుని ఉల్లిపాయాల్లో పోసి కలుపుకోండి. పులుసుని 3-4 నిమిషాలు మరగనివ్వాలి (చిక్కగా అనిపిస్తే కొద్దిగా నీళ్ళు పోసుకోవచ్చు ).
-
మరిగిన పులుసులో నిమ్మరసం కలిపి స్టవ్ ఆపేయండి.
-
తాలింపు కోసం ఉంచిన పదార్ధాలన్నీ ఒక్కోటిగా వేసి వేపి పులుసులో కలిపేయండి, ఆఖరున కొత్తిమీర తరుగు వేసి కలుపుకోండి.
-
అన్నం, ఇడ్లీ అట్టు తో చాలా రుచిగా ఉంటుంది ఈ సింపుల్ పెసరపప్పు పులుసు.

Leave a comment ×
8 comments