బెండకాయ వెల్లులి కారం
ఒక సింపుల్ ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అన్నట్లు ఒక సింపుల్ రెసిపీ ఆ పూట భోజనాన్ని తృప్తిగా ముగించేలా చేస్తుంది, అదే ఆంధ్రా స్టైల్ బెండకాయ వెల్లులి కారం వేపుడు. ఈ సింపుల్ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.
బెండకాయ వేపుడు అంటే ఎవరికి ఇష్టత ఉండదు, వేడిగా నెయ్యి అన్నంతో చాలా రుచిగా ఉంటుంది. ఈ బెండకాయ వెల్లులి వేపుడు ఆంధ్రాలో ఇంకా చెప్పాలంటే మా ఇంట్లో చాలా ఎక్కువగా చేస్తాము. ఈ వేపుడు పప్పు పప్పుచారుతో నంజుడుగా లేదా వేడిగా నెయ్యి వేసిన అన్నంతో చాలా రుచిగా ఉంటుంది.
ఆంధ్రా స్టైల్ బెండకాయ వేపుడు రెసిపీ కనీసం 3 రోజుల పైన నిలవుంటుంది. బాచిలర్స్ ఇంకా ఉద్యోగస్థులకి చాలా ఉపయోగపడుతుంది.

టిప్స్
-
బెండకాయలు లేతవి అయితే గింజలు తక్కువగా ఉండి వేపుడు చాలా రుచిగా ఉంటుంది వేపుడు.
-
బెండకాయలు కడిగి తుడిచి గాలికి ఆరబెట్టి ఆ తరువాత అంగుళం సైజు ముక్కలు కోసుకోవాలి. బెండకాయలు ఆరాక ముక్కలు కోస్తే జిగురు తక్కువగా ఉంటాయ్, ఇంకా అంగుళం సైజు ముక్కలు ఉంటే వేగాక ముక్కలు మరీ చిన్నవిగా కుంచించుకుపోవు.
-
వెల్లులి కారం ఉప్పు వేసి బరకగా రుబ్బు కోవాలి, లేదంటే ముద్దగా అవుతుంది వెల్లులి కారం అప్పుడు వేపుడులో సరిగా కలవదు.
-
బెండకాయలు వేపుకున్నక మిగిలిన నూనె తాళింపులకి లేదా ఆమ్లెట్లు వేసుకోవచ్చు.
బెండకాయ వెల్లులి కారం - రెసిపీ వీడియో
Okra Garlic Fry | Lehsuni Bhindi | How to make Bhindi Fry
Prep Time 5 mins
Cook Time 15 mins
Total Time 20 mins
Servings 6
కావాల్సిన పదార్ధాలు
- 1/2 kilo బెండకాయ ముక్కలు
- 1/4 cup వేరు శెనగపప్పు
- 2 రెబ్బలు కరివేపాకు
- ఉప్పు
- 1 tbsp కారం
- 7 - 8 వెల్లులి
- 1 tsp జీలకర్ర
- నూనె వేపుకోడానికి
విధానం
-
నూనె వేడి చేసి అందులో అంగుళం సైజు బెండకాయ ముక్కలు కొద్దిగా కొద్దిగా వేసి ఎర్రగా వేపి తీసుకోండి. (మరీ ఎర్రగా అప్పడాల్లా వేపితే చల్లారేపాటికి చేదుగా అవుతాయ్).
-
మిక్సీలో వెల్లులి, జీలకర్ర, ఉప్పు, కారం వేసి బరకగా రుబ్బుకుని వేడిగా ఉన్న వేపిన బెండకాయ ముక్కల్లో కలుపుకోవాలి.
-
బెండకాయలు వేపిన నూనెలోనే వేరుశెనగపప్పు కరివేపాకు వేపి వేపిన బెండకాయ ముక్కల్లో కలుపుకోవాలి.
-
వేపుడు పైన 2-3 గంటల సేపు ప్లేట్ కాకుండా జల్లెడ పెడితే క్రిస్పీగా ఉంటాయ్, ప్లేట్ పెడితే మెత్తబడతాయ్.

Leave a comment ×
1 comments