పెసర పునుకులు అల్లం పచ్చడి | పెసర పునుకులు అల్లం పచ్చడితో | పెసర పునుకులు | అల్లం పచ్చడి

పెసర పునుకులు అల్లం పచ్చడి- నానబెట్టిన పెసలలో పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, ఉప్పు వేసి మెత్తగా రుబ్బుకుని అందులో కరివేపాకు, వంటసోడా వేసి బాగా కలిపి నూనెలో బోండాలుగా వేసి తీసే ఈ పునుకులు ఆంధ్ర కోనసీమ ప్రాంతం స్పెషల్ రెసిపీ. 

ప్రత్యేకించి కోనసీమలో సాయంత్రాలు ఈ పెసరపునుకులు ఏ వీధి చివర్న బండి దగ్గరికి వెళ్లినా అల్లం పచ్చడితో ఇస్తారు. వేడి మీద ఒకటి తినడం మొదలెడితే ఇంకా ఎన్ని తింటామో అంతే ఉండదు అంత రుచిగా ఉంటాయి. 

ఈ రెసిపీలో నేను బండ్ల మీద అమ్మే పెసర పునుకులతో పాటు ఇచ్చే అల్లం పచ్చడి రెసిపీ కూడా చెబుతున్నాను. తప్పక ట్రై చేయండి చాలా నచ్చేస్తుంది మీకు. 

టిప్స్

పెసరపప్పు:

  1. నేను ముడి పెసలు వాడుతున్నాను, మీరు కావాలంటే పొట్టులేని ఛాయా పెసరపప్పు కూడా వాడుకోవచ్చు.

  2. నిజానికి బండ్ల మీద అమ్మే పెసరపునుకులు ఛాయా పెసరపప్పుతోనే చేస్తారు, కాకపోతే వారు చాలా ఎక్కువగా వంట సోడా వేసి చేస్తారు.

  3. నిజానికి చూడ్డానికి ఛాయ పెసరపప్పుతో చేసే పునుకులు ఆకర్షణీయంగా ఉంటాయి, పొట్టు పప్పుతో చేసే పునుకులు మాత్రం తినడానికి కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి.

పునుకులు గుల్లగా రావాలంటే:

  1. పప్పుని మెత్తగా రుబ్బుకోవాలి. నిజానికి మిక్సీలో రుబ్బుకోవడం కంటే గ్రైండర్లో రుబ్బుకుంటే చాలా బాగా వస్తాయి.

  2. నేను మిక్సీలో రుబ్బాను అందుకే ఎక్కువసేపు బాగా వేగంగా బీట్ చేశాను. మిక్సీలో రుబ్బుకునే వారు తప్పక బాగా బీట్ చేసుకోవాలండి అప్పుడే పిండి తేలికపడి గుల్లగా కరకరలాడుతూ వస్తాయి పునుకులు. 

  3. ఎంత బాగా బీట్ చేసుకున్నా కొద్దిగ వంట సోడా వేసుకుంటే పునుకులు మరింత రుచిగా ఉంటాయండి. 

అల్లం పచ్చడి:

  1. సాధారణంగా పెసరపునుకులతో మరింకేదైనా పచ్చడి కంటే అల్లం పచ్చడి చక్కని జోడి.

  2. ఈ అల్లం పచ్చడిలో కేవలం పచ్చిమిర్చి అల్లం చింతపండు బెల్లం ఉప్పు వేసి చేస్తారు. నిజానికి ఈ పచ్చడికి నిర్దిష్టమైన కొలత అంటూ ఏమి లేదు. ఏదో చెప్పడానికి చెబుతాము కానీ, రుచి చూసి కారానికి తగినట్లు ఉప్పు పులుపు బెల్లం సరిచేసుకోవాలి.

పెసర పునుకులు అల్లం పచ్చడి | పెసర పునుకులు అల్లం పచ్చడితో | పెసర పునుకులు | అల్లం పచ్చడి - రెసిపీ వీడియో

Pesarapunukulu with Allam Pachadi | Moongdal Punukulu With Ginger Chutney | Moongdal Fritters

Street Food | vegetarian
  • Prep Time 5 mins
  • Soaking Time 3 hrs
  • Cook Time 20 mins
  • Total Time 3 hrs 25 mins
  • Servings 6

కావాల్సిన పదార్ధాలు

  • పెసర పునుకుల కోసం:
  • 1 cup పెసలు
  • 3 పచ్చిమిర్చి
  • కరివేపాకు తరుగు (కొద్దిగా)
  • 1 tsp జీలకర్ర
  • ఉప్పు (సరిపడా)
  • నీరు (పప్పుని రుబ్బుకోడానికి)
  • ¼ tsp వంట సోడా
  • నూనె (వేపుకోడానికి)
  • అల్లం పచ్చడికి:
  • ¼ kg మీడియం కారంగల పచ్చిమిర్చి
  • 50 gms అల్లం
  • 50 gms బెల్లం
  • 15 gms ఉప్పు
  • 50 gms చింతపండు
  • 1 tbsp శెనగపప్పు
  • 3 tbsp నూనె
  • ½ tsp ఆవాలు
  • ½ tsp జీలకర్ర
  • 2 ఎండుమిర్చి
  • 2 sprigs కరివేపాకు (2 రెబ్బలు)
  • ½ tsp మినపప్పు
  • నీరు (పచ్చడిని రుబ్బుకోడానికి)

విధానం

  1. నానబెట్టుకున్న పెసల్లో పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం, ఉప్పు వేసి తగినన్ని నీరు వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
  2. రుబ్బుకున్న పిండిలో కరివేపాకు తరుగు, వంట సోడా వేసి కనీసం 5-6 నిమిషాలు బాగా బీట్ చేసుకోవాలి, అప్పుడు పిండి తేలికపడి పునుకులు లోపల ఉండ ఏర్పడకుండా కరకరలాడుతూ వస్తాయి.
  3. పిండిని బాగా బీట్ చేసుకున్నాకా చేతికు తడి చేసుకుని నిమ్మకాయంత పిండి ముద్దల్ని మరిగే వేడి నూనెలో వేసి ఎర్రగా వేపి తీసుకోవాలి.
  4. నూనె వేడి చేసి అందులో శెనగపప్పు వేసి ఎర్రగా వేపుకోవాలి. ఆ తరువాత అల్లం ముక్కలు వేసి వేపుకోండి.
  5. అల్లం కాస్త వేగాక పచ్చిమిర్చి, ఉప్పు వేసి కేవలం మిర్చీ పైన మచ్చలు ఏర్పడే వరకు వేపుకుంటే సరిపోతుంది.
  6. వేగిన అల్లం మిర్చి అన్నీ మిక్సీలో వేసుకోండి ఇందులోనే చింతపండు బెల్లం కొద్దిగా నీరు వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి.
  7. మిగిలిన నూనెలో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి ఎర్రగా వేపండి ఆ తరువాత రుబ్బుకున్న పచ్చడివేసి కలిపి స్టవ్ ఆపేయండి.
  8. ఈ పచ్చడి మీకు ఫ్రిజ్లో కనీసం వారం పైనే నిలువ వుంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.