పొట్లి సమోసా | సమోసానే కాస్త కొత్తగా ఇంకాస్త రుచిగా చూడడానికి కూడా ఇంపుగా చేస్తే తయారయ్యేదే పొట్లి సమోసా
ఎప్పుడూ తినే ఆలూ సమోసానే కాస్త కొత్తగా ఇంకాస్త రుచిగా, చూడడానికి కూడా ఇంపుగా చేస్తే తయారయ్యేదే పొట్లి సమోసా. ఈ సింపుల్ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.
సమోసా అందరికీ తెలిసినదే, ఇష్టంగా తినేదే. కానీ, అదే సమోసా ఇంకాస్త అందంగా ముద్దుగా ముచ్చటగా ఉంటే టక్కున తినేయాలనిపిస్తుంది, ఆలాంటి రుచికరమైన సమోసా ఈ పొట్లి సమోసా!!!
చూడడానికి పొట్లం కట్టినట్లు ఉండే ఈ సమోసా నేను మొదటి సారి హైదరాబాద్లోని పార్క్ హోటల్లో తిన్నాను. చూడడానికి కొత్తగా ముచ్చటగా అనిపించాయ్. నేను అక్కడ తిన్నది ఖీమా పొట్లి సమోసా, దాన్నే నేను వెజ్ సమోసాగా మార్చా!
ఈ పొట్లి సమోసాలో నేను దక్షిణ భారత దేశం వంటింట్లో ఉండే పదార్ధాలు వాడి చేశాను. అంటే చాట్ మసాలా, జీరా పొడి ఇవేవీ వాడలేదు. ఇంకా బంగాళాదుంపలతో పాటు, కాలీఫ్లవర్, కేరట్, బటానీ వాడాను. నచ్చితే మీరు మారినకేదైన స్టఫ్ఫింగ్ మార్చి చేసుకోవచ్చు.

టిప్స్
స్టఫ్ఫింగ్ :
-
సమోసాలోని స్టఫ్ఫింగ్ ఎంత చెమ్మ తక్కువగా ఉంటే అంత ఎక్కువ సేపు క్రిస్పీగా ఉంటాయ్. అందుకే ఆలూ మిగిలిన కూరలని చెమ్మ తగ్గి గట్టి ముద్దగా అయ్యేదాక వేపుకోవాలి
-
స్టఫ్ఫింగ్ పూర్తిగా చల్లారాక మాత్రమే పిండిలో స్టఫ్ చేసి గట్టిగా సీల్ చేసుకోవాలి, లేదంటే స్టఫ్ఫింగ్ నీరు వదులుతుంది, సమోసాలు మెత్తగా అవుతాయ్.
-
స్టఫ్ చేసుకున్నాక సమోసాని గాలికి 20 నిమిషాలు ఆరనిస్తే స్టఫ్ఫింగ్లోని చెమ్మ, పై పిండి పీల్చి లోపలి స్టఫ్ఫింగ్లోని చెమ్మ తగ్గుతుంది, అప్పుడు వేపాక ఎక్కువ సేపు క్రిస్పీగా ఉంటాయ్ సమోసా
-
నచ్చితే వేపిన జీడిపప్పు, ఉడికించిన స్వీట్ కార్న్, చాట్ మసాలా కూడా కలుపుకోవచ్చు.
పొట్లి సమోసా | సమోసానే కాస్త కొత్తగా ఇంకాస్త రుచిగా చూడడానికి కూడా ఇంపుగా చేస్తే తయారయ్యేదే పొట్లి సమోసా - రెసిపీ వీడియో
Potli Samosa Recipe | Veg Potli Samosa | Vegetable Samosa | How to make Samosa
Prep Time 5 mins
Cook Time 20 mins
Resting Time 30 mins
Total Time 55 mins
Servings 12
కావాల్సిన పదార్ధాలు
-
స్టఫ్ఫింగ్ కోసం
- 2 ఆలూ
- 1 cup కాలీఫ్లవర్
- 1 cup కేరట్
- నీళ్ళు ఉడికించడానికి
- 2 tbsp నూనె
- 1 tsp జీలకర్ర
- 1 రెబ్బ కరివేపాకు
- 1/2 cup తాజా బటానీ
- 1 tbsp అల్లం వెల్లులి పేస్ట్
- 2 చిటికెళ్లు పసుపు
- 1 tsp కారం
- 1 tsp ధనియాల పొడి
- ఉప్పు
-
సమోసా షీట్స్ కోసం
- 2 cup మైదా
- 2 tsp నెయ్యి
- ఉప్పు
- నీళ్ళు తగినన్ని
- నూనె సమోసాలు వేపుకోడానికి
విధానం
-
కుక్కర్లో ఆలూ, కేరట్, కాలీఫ్లవర్ నీళ్ళు పోసి హై ఫ్లేమ్ మీద రెండు విసిల్స్ రానిచ్చి స్టీమ్ పోనివ్వాలి
-
స్టీమ్ పోయాక కూరకాయలని వడకట్టి జల్లేడలోనే పూర్తిగా చల్లారనిచ్చి కచ్చాపచ్చాగా ఏనుపుకోవాలి
-
నూనె వేడి చేసి అందులో జీలకర్ర, కరివేపాకు వేసి వేపి, బాటానీ వేసి రంగు మారి మెత్తబడే దాకా వేపుకోవాలి.
-
తరువాత మిగిలిన మాసాలు వేసి వేపి ఏనుపుకున్న ఆలూ మిశ్రమం వేసి నీరు ఇగిరిపోయి దగ్గర పడేదాకా కలుపుతూ వేపుకోవాలి. గట్టి ముద్దగా అయ్యాక గాలికి పూర్తిగా చల్లారచాలి
-
మైదా పిండిలో నెయ్యి ఉప్పు వేసి బ్రెడ్ పొడి మాదిరి వేళ్ళతో నిమురుతూ కలుపుకుని తగినన్ని నీళ్ళు చేరుస్తూ పిండి గట్టిగా పగుళ్లు లేకుండా వచ్చేదాక ఎక్కువసేపు వత్తుకుని తడిగుడ్డ కప్పి 30 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి.
-
30 నిమిషాల తరువాత పిండిని చిన్న ఉసిరికాయ సైజు ఉండలుగా చేసి పొడి పిండి అద్ది కాస్త మందంగా వత్తుకోవాలి
-
వత్తుకున్న రోటీ మధ్యలో చల్లారిన ఆలూ మిశ్రమం పెట్టి అంచులకి నీళ్ళని పూసి మూతకట్టినట్లుగా పిండి ఒక దగ్గరికి చేర్చి అంచులని గట్టిగా సీల్ చేయాలీ. చేసుకున్న సమోసాలని గాలికి ఆరనివ్వాలి.
-
ఆరిన సమోసాలని బాగా వేడెక్కిన నూనెలో లో వేసి స్టవ్ ఆపేసి వదిలేస్తే 2 నిమిషాలకి పైకి తెలుతాయ్, పైకి తేలాక అప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా కరకరలాడేట్టు వేపుకోవాలి. లేదా గోరు వెచ్చని నూనెలో సమోసాలు వేసి సన్నని సెగమీదే బంగారు రంగు వచ్చి కరకరలాడేట్టు వేపుకుని తీసుకోవచ్చు.
-
వేడిగా ఈ పొట్లి సమోసా పుదీనా చట్నీ లేదా టొమాటో సాస్తో చాలా రుచిగా ఉంటాయ్.

Leave a comment ×
2 comments