ముల్లంగి సాంబార్
మగ్గించిన ముల్లంగి ముక్కల్లో కందిపప్పు చింతపండు పులుసు, సాంబార్ పొడి వేసి చేసే ఘుమఘుమలాడే సాంబార్ ఉంటె చాలు భోజనానికి ఒక పరిపూర్ణత. ఈ సింపుల్ ముల్లంగి సాంబార్ బాచిలర్స్ ఇంకా ఇప్పుడిప్పుడే వంట నేర్చుకునే వారు కూడా అద్భుతంగా చేసేస్తారు!
దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే తమిళులు ఎక్కువగా సాంబార్ని ఇష్టపడతారు, అందుకే వారికి ఎన్ని రకాల సాంబారులో. తెలుగు రాష్ట్రాల్లో సాంబార్ అంటే కాయకూర ముక్కలు వేసి చేసే సాంబార్, ఇంకా తెలుగు వారి సింపుల్ పప్పుచారు. కానీ తమిళ వారు దాదాపుగా ప్రతీ కాయకూరతో సాంబార్ చేస్తారు, సాంబార్లు అన్నీ చేసే తీరు ఒక్కటే అయినా వేసే పదార్ధాలు కాస్త భిన్నం, అక్కడే ఉంది మరి అసలైన రుచి. ఇంకా తెలుగు వారు కాచే సాంబార్కి తమిళుల సాంబార్ రుచికి వ్యత్యాసం ఉంది. తెలుగు వారి సాంబార్ ఘాటుగా పుల్లగా కారంగా ప్రతీ రుచి తెలిసేలా ఉంటుంది. తమిళుల సాంబార్ తెలుగు వారికి కాస్త చప్పగా అనిపిస్తుంది.
నేను ఈ ముల్లంగి సాంబార్ తమిళుల తీరులో చేస్తున్నా. తమిళులు కందిపప్పుని మెత్తగా వెన్నలా ఉడికించి ఎనపకుండా సాంబార్ కాస్తారు, తెలుగు వారు ఉడికించిన పప్పుని మెత్తగా ఎనిపి సాంబార్ కాస్తారు. ఇంకా తమిళుల సాంబార్ చిక్కగా ఉంటుంది.
ముల్లంగి సాంబార్ సింపుల్గా సాంబార్ పొడి వేసీ చేసుకోవచ్చు లేదా సాంబార్ పొడి అప్పటికప్పుడు చేసుకుని కూడా చేసుకోవచ్చు. నేను సింపుల్గా రెడీమేడ్ సాంబార్ పొడి వేసి చేస్తున్నా. అయినా చాలా రుచిగా ఉంటుంది. వేడిగా అన్నం అప్పడాలు వడియాలు ఉంటె చాలు సుష్టుగా భోజనం చేస్తారు!
Try these recipes: Pesarapappu Pulusu and Mangalore Dosakaya Sambar

టిప్స్
కందిపప్పు:
-
పప్పు కడిగి గంట సేపు నానబెట్టి కుక్కర్లో 5-6 విజిల్స్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్ మీద ఉడికిస్తే పప్పు వెన్నలా మెత్తగా ఉడికిపోతుంది.
-
మీకు నచ్చితే తెలుగు వారిలా ఉడికిన పప్పుని మెత్తగా ఎండుపుకోవచ్చు. నేను మెత్తగా ఉడికిన పప్పుతో సాంబార్ కాస్తున్నా
బెస్ట్ సాంబార్కి కొన్ని టిప్స్:
-
సాంబార్లో అతి ముఖ్యమైనది ఉప్పు పులుపు, కారం ఇవి జాగ్రత్తగా రుచి చూసి మీకు తగినట్లుగా వేసుకోండి. ఎందుకంటె నా కొలత కారం మీరు వాడే కారం క్వాలిటీ ఒకటి కాదు కాబట్టి.
-
సాంబార్ ఎప్పుడూ బాగా ఎక్కువసేపు మరగాలి, అప్పుడే సాంబార్కి రుచి సువాసనా.
-
సాంబార్ పొడి వేసాక బాగా కలిపి సన్నని సెగ మీద 30 నిమిషాలు పైన మరగనివ్వాలి.
-
సాంబార్ చల్లారాక లేదా ఎప్పుడైనా చిక్కగా అనిపిస్తే కాసిని వేడి నీళ్లు పోసి పలుచన చేసి 5-6 నిమిషాలు మరిగిస్తే చాలు.
ముల్లంగి సాంబార్ - రెసిపీ వీడియో
Radish Sambar | Mullangi Sambar
Prep Time 5 mins
Soaking Time 1 hr
Cook Time 45 mins
Total Time 1 hr 50 mins
Servings 8
కావాల్సిన పదార్ధాలు
- 1 cup కందిపప్పు
- 3 cups నీళ్లు
- 1/2 tsp పసుపు
- 1/4 tsp ఇంగువ
-
సాంబార్ కోసం
- 2 tbsp నూనె
- 1 tsp ఆవాలు
- 4 ఎండుమిర్చి
- 1 tsp జీలకర్ర
- 7 - 8 వెల్లులి
- 2 రెబ్బలు కరివేపాకు
- 2 ఉల్లిపాయల చీలికలు
- 3 పచ్చిమిర్చి చీలికలు
- 200 gms ముల్లంగి ముక్కలు
- 1 cup టమాటో ముక్కలు
- 1 tbsp ధనియాల పొడి
- 1 tbsp కారం
- 1/2 cup చిక్కని చింతపండు పులుసు (60 gm చింతపండు నుండి తీసినది)
- 1 tbsp సాంబార్ పొడి
- కొత్తిమీర - చిన్న కట్ట
- 1/4 cup పచ్చికొబ్బరి తురుము
- 750 ml నీళ్లు
విధానం
-
నానబెట్టిన కందిపప్పుని, పసుపు ఇంగువ నీళ్లు కుక్కర్లో పోసి మీడియం ఫ్లేమ్ మీద 5-6 విజిల్స్ వచ్చేదాకా మెత్తగా ఉడికించుకోవాలి.
-
మరో గిన్నెలో నూనె వేడి చేసి అందులో ఆవాలు ఎండుమిర్చి జీలకర్ర వెల్లులి కరివేపాకు వేసి వేపుకోవాలి.
-
వేగిన తాలింపులో ఉల్లిపాయ చీలికలు, ఉప్పు వేసి బాగా కలిపి 2-3 నిమిషాలు మూత పెట్టి మగ్గిస్తే చాలు.
-
మగ్గిన ఉల్లిపాయల్లో ముల్లంగి ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేసి 2 నిమిషాలు పసరు వాసన పోయేదాకా వేపుకోవాలి, ఆ తరువాత మూత పెట్టి ముల్లంగి ముక్కలు సగం పైన మగ్గనివ్వాలి.
-
మగ్గిన ముల్లంగిలో కారం ధనియాల పొడి కాసిని నీళ్లు పోసి వేపుకుంటే కారం మాడదు.
-
వేగిన కారంలో టమాటో ముక్కలు చింతపండు పులుసు పోసి టొమాటోలు పులుసుని బాగా మరగనివ్వాలి.
-
మరుగుతున్న పులుసులో మెత్తగా ఉడికించుకున్న పప్పు, నీళ్లు పోసి బాగా కలిపి హాయ్ ఫ్లేమ్ మీద ఉడుకుపట్టనివ్వాలి.
-
మరుగుతున్న సాంబార్లో పచ్చికొబ్బరి తురుము, సాంబార్ పొడి, కొత్తిమీర తరుగు వేసి కలిపి మూతపెట్టి సన్నని సెగ మీద 40 నిమిషాలు వదిలేయండి, అప్పుడు సాంబార్ ఘుమఘుమలాడుతుంది. ముల్లంగి సాంబార్ వేడి అన్నం, అట్టు ఇడ్లీతో చాలా రుచిగా ఉంటుంది.
(ఈ సింపుల్ సాంబార్ చేసే ముందు టిప్స్ చూసి చేయండి)

Leave a comment ×
6 comments