రాగి ఉల్లిపాయ పకోడీ
ఉల్లిపాయ చీలికల్లో రాగిపిండి వేపిన పల్లీలు ఎండుమిర్చీ వేసి వేపి చేసే కరకరలాడే పకోడీ బెస్ట్ టీ టైం స్నాక్ అవుతుంది. ఒక మంచి విషయం ఏంటంటే ఈ పకోడీ మామూలు సెనగపిండి పకోడీ మాదిరి అస్సలు నూనె పీల్చవు ఇంకా మరింత కరకరలాడుతూ ఉంటాయి.
సాధారణంగా సెనగపిండి వేసి చేసే పకోడీ అందరికి సరిపడదు, కానీ ఇలా రాగి పిండి వేసి చేసే పకోడీ కొత్తగా ఉంటుంది, ఆరోగ్యం ఇంకా అందరికీ నచ్చేస్తుంది. ఉల్లిపాయలు సెనగపిండి వేసి చేసే గట్టి పకోడీ అందరికీ తెలిసినదే, ఈ పకోడీ కూడా దాదాపుగా అంతే, కొన్ని కచ్చితమైన టిప్స్ పాటిస్తూ చేస్తే బెస్ట్ రాగి ఉల్లిపాయ పకోడీ వస్తుంది.
కాబట్టి చేసే ముందు కింద టిప్స్ పాటిస్తూ చేయండి.

టిప్స్
ఉల్లిపాయ:
ఈ పకోడీకి ఉల్లిపాయల నుండి వచ్చే నీరు దాదాపుగా సరిపోతుంది, అవసరమనిపిస్తే కొద్దిగా చిలకరించుకోవాలి అంతే!
పకోడీ పిండి కలిపే తీరు:
పకోడీ పిండి తడిపొడిగా ఉండాలి, ముద్దగా ఉండకూడదు. పిండి అంతా తడి అయిపోతే పకోడీ ఎక్సట్రా క్రిస్పీగా వేగదు.
పకోడీ వేపే తీరు:
రాగి పకోడీని నెమ్మదిగా మీడియం ఫ్లేమ్ మీద వేపుకోవాలి. రాగి పిండి కారణంగా పకోడీ మాడింది లేనిది తెలియదు.
కాబట్టి నూనెలో పకోడీ వేశాక, బుడగలు తగ్గేదాకా వేపుకోవాలి. ఏ మాత్రం ఎక్కువగా వేపినా చాల్లారేపాటికి మాడిపోతుంది పకోడీ.
ఇంకా వేగుతున్న పకోడీని తీసి చేత్తో నొక్కినా తెలిసిపోతుంది పకోడీ ఎంత క్రిస్పీగా వేగినది తెలియడానికి.
రాగి ఉల్లిపాయ పకోడీ - రెసిపీ వీడియో
Ragi Peanut Pakodi | Ragi Palli Pakoda | Ragi Onion Pakodi
Prep Time 2 mins
Cook Time 15 mins
Total Time 17 mins
Servings 3
కావాల్సిన పదార్ధాలు
- 1/2 cup రాగి పిండి
- 1/2 cup వేపిన పల్లీలు
- 7 ఎండుమిర్చి
- ఉప్పు - రుచికిసరిపడా
- 1 tsp జీలకర్ర
- 250 gms ఉల్లిపాయ చీలికలు
- నూనె వేపుకోడానికి
విధానం
-
పల్లీలు ఎండుమిర్చి మిక్సీలో బరకగా పొడి చేసుకోవాలి.
-
గిన్నెలో ఉల్లిపాయ చీలికలు, ఉప్పు వేసి ముందు ఉల్లిపాయల్ని పిండుతూ బాగా కలుపుకోవాలి.
-
పిండిన ఉల్లిపాయల్లో రాగి పిండి గ్రైండ్ చేసుకున్న పల్లీ పొడి జీలకర్ర వేసి బాగా కలుపుకోండి. పిండి మరీ పొడిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు చిలకరించుకుని తడిపొడిగా పిండి కలుపుకోండి.
-
కలుపుకున్న పిండిని వేడి నూనెలో కొద్దిగా కొద్దిగా వేసి మీడియం ఫ్లేమ్ మీద బుడగలు తగ్గేదాకా వేపుకుని తీసుకోండి. (ఒక్క సారి వేపే టిప్స్ చూడగలరు) తీసిన పకోడీ జల్లెడ వేసి ఉంచాలి.
-
పూర్తిగా చల్లారాక పకోడీ మరింత గట్టి పడుతుంది.

Leave a comment ×
4 comments