అరటికాయ అల్లం ఉల్లికారం
ఉడికించిన అరటికాయలో ఉల్లి, అల్లం నూరిన ముద్ద వేసి, గుబాళించే తాలింపు దట్టించి చేసే గుంటూరు స్పెషల్ అరటికాయ అల్లం ఉల్లి కారం రోజు వారి చేసుకునే కూరలకి పర్ఫెక్ట్!
అరటికాయతో కూరాలంటే ఎక్కువగా ఇష్టపడరు. కానీ గుంటూరు వారి తీరులో అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ గుజ్జు వేసి చేసే తీరులో చేసి చుడండి తప్పక నచ్చేస్తుంది. బ్యాచిలర్స్కి లేదా అరటికాయతో ఏదైనా కొత్తగా సింపుల్గా చేసుకోవాలంటే గుంటూరు స్టైల్ అరటికాయ అల్లం ఉల్లికారం చాలా బాగుంటుంది.
అరటికాయ ఉల్లికారం నా చిన్నతనంలో గుంటూరులో చాలా ఎక్కువగా చేసేవారు. ఇప్పటికి కొన్ని కుటుంబాల్లో చేస్తున్నారు. ఈ మధ్య గుంటూరులోని మా బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు వారింట్లో తిన్నప్పుడు మళ్ళీ చిన్నతనం గుర్తొచ్చింది. మీకు నా చిన్నతనంలో నేను ఎంతగానో ఇష్టంగా తిన్న రెసిపీని మీకు పరిచయం చేస్తున్నాను.
ఇదే తీరులో ఇంకొన్ని కూరలతో చేసుకోవచ్చు. వాటి కోసం టిప్స్ చుడండి.

టిప్స్
అరటికాయ: పచ్చి అరటికాయని 80% మాత్రమే ఉడికించాలి. 80% అంటే ఉడికిన అరటికాయని పుల్లని గాని, ఫోర్కుని గాని గుచ్చితే సులభంగా లోపలి వెళ్ళిపోవాలి. పుల్లని పట్టి నిలిచి ఉండాలి. అది 80% అంటే! అరటికాయని మరీ మెత్తగా ఉడికిస్తే కూరలో వేగేపాటికి పేస్ట్లా అయిపోతుంది.
ఉల్లి అల్లం పచ్చిమిర్చి ముద్ద: ఈ కూరలో ఎండు కారం వేయరు. పచ్చిమిర్చినే వాడతారు. ఉల్లి ముద్ద నూనెలో బాగా వేగాలి అప్పుడే రుచి.
నూనె: ఈ కూరకి కాస్త నూనె ఉంటేనే రుచి ముద్ద కూర కదా అన్నంలో సరిగా కలవాడు నూనె లేకపోతే
ఈ కాయకూరల్తో ఇదే తీరులో చేసుకోవచ్చు: ఇదే తీరులో బంగాళా దుంప, చేమగడ్డ, కందతో చేసుకోవచ్చు!!!
అరటికాయ అల్లం ఉల్లికారం - రెసిపీ వీడియో
Raw Banana Onion Fry Curry | Guntur Style Aratikaya Allam Ulli Karam
Prep Time 2 mins
Cook Time 20 mins
Total Time 22 mins
Servings 4
కావాల్సిన పదార్ధాలు
- 2 పచ్చి ఆరటికాయలు
- 1/2 liter నీళ్లు
- ఉప్పు- కొద్దిగా
- పసుపు - కొద్దిగా
-
అల్లం ఉల్లి ముద్ద కోసం
- 2 ఉల్లిపాయ తరుగు
- 4-5 పచ్చిమిర్చి
- 1/2 inch అల్లం
-
కూర కోసం
- 4 tbsp నూనె
- 1 tsp ఆవాలు
- 1 tsp జీలకర్ర
- 2 ఎండుమిర్చి
- 1 tsp పచ్చి సెనగపప్పు
- 1 tsp మినపప్పు
- 2 రెబ్బలు కరివేపాకు
- ఉప్పు
- 1/4 tsp పసుపు
- కొత్తిమీర - కొద్దిగా
- 1 tsp నిమ్మరసం
విధానం
-
మరిగే నీళ్లలో సగానికి కోసుకున్న అరటికాయ ముక్కలు ఉప్పు పసుపు వేసి 80% ఉడికించి దింపేసుకోవాలి.
-
చల్లారాక అరటికాయ తొక్క తీసి ఫోర్క్తో కచ్చా పచ్చాగా ఎనుపుకోవాలి.
-
మిక్సీలో ఉల్లిపాయ అల్లం పచ్చిమిర్చి వేసి మెత్తని పేస్ట్ చేసుకోవాలి.
-
నూనె వేడి చేసి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర సెనగపప్పు మినపప్పు వేసి ఎర్రగా వేపుకోవాలి.
-
వేగిన తాలింపులో ఉల్లి ముద్ద ఉప్పు పసుపు కరివేపాకు వేసి నూనె పైకి తేలేదాక వేపుకోవాలి.
-
వేగిన ఉల్లి ముద్దలో ఎనుపుకున్న అరటికాయ ముద్దా వేసి నెమ్మదిగా ఉల్లి ముద్ద పట్టించాలి. తరువాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 7-8 నిమిషాలు మగ్గనివ్వాలి.
-
దింపే ముందు కొత్తిమీర తరుగు నిమ్మరసం చల్లి కలిపి దింపేసుకోవాలి.

Leave a comment ×
3 comments