ఉల్లి వెల్లులి లేని బీరకాయ పాలు పోసిన కూర | బీరకాయ కూర
బీరకాయ పాలు పోసిన కూర- ఉల్లి వెల్లులి లేకుండా బీరకాయని చెక్కు తీసి కొబ్బరి పాలు పోసి కారం తక్కువ కమ్మదనం ఎక్కువగా ఉండే తెలుగువారి సింపుల్ కూర!!!
ఈ పాల బీరకాయ కూర అందులోకి ఇందులోకి అనే మాటే లేదు ఎందులోకైనా అద్భుతంగా అనిపించే ఈ కూర నా తీరులో చిన్న మార్పుతో చేస్తున్నా!!!
సాధారణంగా తెలుగు వారిళ్లలో ఇంకా చెప్పాలంటే ఆంధ్రుల ఇళ్లలో చాలా ఎక్కువగా పాలు పోసి కూరలు చేస్తుంటారు. అవి చాలా కమ్మగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే బాలింతలకు పెడతారు. పత్యం కూరలు అంటుంటారు, రుచి కూడా చాలా బాగుంటుంది. కానీ ఉల్లి పాలు ఉప్పు విరుద్ధ ఆహారాలు అంటుంది ఆయుర్వేదం.
అందుకే ఆ కూర రుచి ఎలా ఉన్నా జంతువు పాలకి బదులు నేను కొబ్బరి పాలు వాడి చేస్తున్నాను. ఈ కూర జంతువు పాలు పోసి చేసిన కూరంత కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. కానీ చిన్న మార్పుతో నా తీరులో చేస్తున్నాను ఒక సారి చేసి ఆశ్వాదించి చెప్పండి.

టిప్స్
బీరకాయ:
- ఈ కూరలో బీరకాయలు లేతగా ఉంటె చాలా రుచిగా ఉంటుంది. ఇంకా బీరకాయ పైన చెక్కుని కణుపుల దగ్గర కాకుండా కాస్త లోతుగా నున్నగా తీసుకుంటే నోట్లోకి వెన్నలా జారిపోతుంది కూర. చెక్కుని మీరు కావాలంటే నూనెలో మగ్గించి మామూలు రోటి పచ్చళ్ల మాదిరి పచ్చిమిర్చి వేసి పచ్చడి చేసుకోండి.
కొబ్బరి పాలు:
- కొబ్బరి పాల కోసం పచ్చికొబ్బరి ముక్కల్లో కొద్దిగా నీరు వేసి మెత్తగా రుబ్బి వస్త్రం వేసి గట్టిగా పిండితే చిక్కని కొబ్బరి పాలు వస్తాయి.
ఇంకో తీరు:
-
ఈ కూరని మీరు కావాలంటే ఎండు కారం పసుపు అల్లం వెల్లులి ఇంకా మసాలాలు వేసి కూడా చేసుకోవచ్చు.
-
ఇదే కూర మీరు మునక్కాడ, సొరకాయ, గుమ్మడికాయ, పొట్లకాయ, గోరుచిక్కుడు కాయ వేసి కూడా చేసుకోవచ్చు.
ఉల్లి వెల్లులి లేని బీరకాయ పాలు పోసిన కూర | బీరకాయ కూర - రెసిపీ వీడియో
Ridge Gourd Curry Without Onion and Garlic | Ridge Gourd Milk Curry
Prep Time 5 mins
Cook Time 20 mins
Total Time 25 mins
Servings 5
కావాల్సిన పదార్ధాలు
- 300 gms చెక్కు తీసుకున్న బీరకాయ ముక్కలు
- 2 tbsp నూనె
- 1 tsp ఆవాలు
- ½ tsp జీలకర్ర
- 1 sprig కరివేపాకు (1 రెబ్బ)
- ¾ cup కొబ్బరి పాలు
- ఉప్పు (తగినంత)
-
కొబ్బరి పేస్ట్ కోసం:
- ¼ cup పచ్చి కొబ్బరి ముక్కలు
- 1 tsp గసగసాలు
- 1 tbsp జీడిపప్పు
- 1-2 పచ్చిమిర్చి
- దాల్చిన చెక్క (చిన్న ముక్క )
- ½ cup కొబ్బరి పాలు
విధానం
-
కొబ్బరి పేస్ట్ కోసం ఉంచిన పదార్ధాలన్నీ కొబ్బరి పాలల్లో కనీసం ముప్పై నిమిషాలు నానబెట్టుకోండి.
-
నానిన కొబ్బరి సామగ్రీ అంతటిని మెత్తని పేస్ట్ చేసుకోండి. పేస్ట్ వెన్నంత మృదువుగా ఉండాలి.
-
నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర వేసి చిట్లనిచ్చి కరివేపాకు వేసి వేపుకోండి.
-
వేగిన తాలింపులో నున్నగా చెక్కుతీసి తరుకున్న బీరకాయ ముక్కలు వేసి కలిపి మూతపెట్టి 8-10 నిమిషాలు మగ్గనివ్వండి.
-
మగ్గిన బీరకాయ ముక్కల్లో కొబ్బరి పాలు పోసి పాలల్లో ముక్కలని కాస్త ఇగరబెట్టండి.
-
ఇగిరిన పాలల్లో కొబ్బరి ముద్దా, ఇంకో ½ కప్పు నీరు పోసి సన్నని సెగ మీద 10 నిమిషాలు మగ్గనిచ్చి దింపబోయే ముందు ఉప్పు, కాస్త కొత్తిమీర తరుగు చల్లి దింపేసుకోండి.
-
ఈ కూర అన్నం రోటీలతో చాలా బాగుంటుంది.

Leave a comment ×
2 comments