కాల్చిన వంకాయ దోసకాయ పచ్చడి
మెత్తగా కాల్చిన వంకాయ గుజ్జులో పచ్చి దోసకాయ పచ్చిమిర్చి చింతపండు వేసి వేపకుండా కచ్చా పచ్చాగా దంచి చేసే ఈ పచ్చడి వేడి నెయ్యి అన్నంతో ఎంతో రుచిగా ఉంటుంది.
తెలుగు వారి పెళ్లిళ్ల స్పెషల్ దోసకాయ వంకాయ పచ్చడి. మిగిలిన ప్రాంతాల సంగతి ఎలా ఉన్నా ఆంధ్రాలోని గుంటూరు ప్రకాశం జిల్లాల వైపు కచ్చితంగా పెళ్ళిళ్ళకి లేదా మరింకేదైనా శుభకార్యంకి వడ్డిస్తారు. అయితే ఆ తీరు దోసకాయ వంకాయ పచ్చడి రుచికి ఇలా కాల్చిన వంకాయ దోసకాయ కలిపి చేసే పచ్చడికి చిన్న వ్యత్యాసం ఉంది.
ఈ పచ్చడిలో చుక్క నూనె కూడా ఉండదు. నచ్చితే తాలింపు వేసుకోవచ్చు గాని, నిజానికి తాలింపు కూడా అవసరం లేదు. వంకాయని మాత్రం నూనె పూసి కాల్చుకోవాలి, మిగిలిన వన్నీ పచ్చివే! అనుకుంటాము గాని అన్ని నూనెలు పోసి వేపనవసరం లేదు, కొన్ని పచ్చిగా ఉంటెనే రుచిగా ఉంటుంది.

టిప్స్
వంకాయ:
వంకాయకి నూనె పూసి గాట్లు పెట్టి సన్నని సెగ మీద తిప్పుకుంటూ మెత్తబడే దాకా మగ్గించుకోవాలి. హై ఫ్లేమ్ మీద కాలిస్తే రంగొస్తుంది కానీ, లోపల వంకాయ మగ్గదు.
నచ్చితే వంకాయకి గాట్లు పెట్టిన చోట వెల్లులిని పెట్టి కూడా కాల్చుకోవచ్చు.
దోసకాయ:
గట్టిది నాటు దోసకాయ అయితే పచ్చడికి రుచి. నేను దోసకాయ చెక్కు గింజలు తీసేసాను. పచ్చిగ చేసే పచ్చడి కదా గింజలు అంత రుచిగా ఉండవు.
దోసకాయ ముందు చేదు చూసి వాడుకోవాలని గుర్తుంచుకోండి.
పచ్చిమిర్చి:
పచ్చిమిర్చి నచ్చితే వంకాయతో పాటు నూనె పూసి కాల్చుకుని వాడుకోవచ్చు, లేదా నాలా పచ్చిగా వంకాయతో పాటు మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు.
చింతపండు:
చిన్న ఉసిరికాయంత చింతపండు ఉంటె పుల్లగా బాగుంటుంది పచ్చడి. లేదా మీరు నిమ్మరసం కూడా పిండుకోవచ్చు.
ఆఖరుగా:
పచ్చడి కలిపాక 30 నిమిషాలైనా ఊరాలి అప్పుడే పచ్చడికి రుచి.
నచ్చితే ఆవాలు సెనగపప్పు ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టుకోవచ్చు.
కాల్చిన వంకాయ దోసకాయ పచ్చడి - రెసిపీ వీడియో
Roasted Brinjal Cucumber Chutney
Prep Time 2 mins
Cook Time 15 mins
Total Time 17 mins
Servings 6
కావాల్సిన పదార్ధాలు
- 300 gms 1 - పెద్ద వంకాయ
- 150 gms 1 - పెద్ద దోసకాయ
- 7 - 8 పచ్చిమిర్చి
- 1 tsp జీలకర్ర
- ఉప్పు
- గోలీ సైజు నానబెట్టిన చింతపండు
- 4 - 5 వెల్లులి
- కొత్తిమీర - కొద్దిగా
- 1 tsp నూనె
విధానం
-
నూనె పూసి వంకాయని సన్నని సెగ మీద మెత్తబడే దాక కాల్చుకోవాలి.
-
కాల్చుకున్న వంకాయ మీద నీళ్లు చల్లి పొట్టు తీసుకోండి. వంకాయ లోపల గింజలు తీసేయండి.
-
వంకాయ గుజ్జు, పచ్చి మిర్చి, జీలకర్ర, చింతపండు, వెల్లులి, ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
-
గ్రైండ్ చేసుకున్న వంకాయ గుజ్జులో చెక్కు గింజలు తీసేసిన దోసకాయ ముక్కలు వేసి కలిపి 30 నిమిషాలు నానబెట్టుకోవాలి.
- ఈ పచ్చడి నెయ్యి వేసిన అన్నంతో, పెరుగన్నంతో చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment ×
1 comments