గోంగూర పులుసు | పాతకాల పద్ధతిలో గోంగూర పులుసు
తిన్నకొద్దీ తినాలనిపించే పాతకాలం వంట ఆంధ్రా స్టైల్ గోంగూర పులుసు. పుల్లగా కారంగా ఘాటుగా ఎంతో రుచిగా ఉండే గోంగూర పులుసు స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.
గోంగూర పులుసు ప్రతీ తెలుగు వారింట్లో సాధారణంగా చేసే రెసిపీనే. కావాల్సిన పదార్ధాలన్నీ వేసి ఉడికించి తాలింపు పెట్టె తీరు అందరికీ తెలిసినది. నా పద్ధతి కూడా దాదాపుగా అంతే అయినా ఇంకొంచెం రుచిగా చిక్కగా చాలా రుచిగా ఉంటుంది. పైగా ఈ పులుసుకి ఒక్క tbsp నూనె చాలు అంతే!
ఈ పులుసు అన్నం, రాగి సంగటి. జొన్న రొట్టెలతో చాలా రుచిగా ఉంటుంది. ఈ సింపుల్ రెసిపీ స్టెప్ బై స్టెప్ ఇమేజెస్ ఇంకా వీడియోతో ఉంది చూడండి.

టిప్స్
గోంగూర:
గోంగూర రెండు రకాలుగా దొరుకుతుంది. తెల్లగోంగూర, ఎర్ర గోంగూర. ఎర్ర గోంగూర ఎక్కువ పుల్లగా ఉంటుంది. ఎర్ర గోంగూర వాడితే చింతపండు కొద్దిగా తగ్గించుకోవచ్చు.
చింతపండు:
గోంగూర ఎంత పుల్లగా ఉన్నా, చిన్న పిక్క చింతపండు వేస్తేనే రుచి చాలా బాగుంటుంది. ఆ పులుపుని కారం బాలన్స్ చేస్తుంది. పులుపు ఎక్కువ అవుతుంది అనుకునే వారు చింతపండు తగ్గించుకోవచ్చు.
మెంతులు, ఆవాలు:
ఆవాలు, మెంతులు ఎర్రగా వేగాలి అప్పుడే రుచి. ఈ మెంతి కారం బాగా మరగాలి అప్పుడే రుచి పులుసుకి. పులుసులో మెంతులు ఎక్కువైతే చేదుగా ఉంటుంది. కాబట్టి మెంతులు ఎక్కువ కాకుండా వేసుకోండి.
బెల్లం:
ఆఖరున వేసే బెల్లం పులుసులోని చేదు, పులుపు, కారాన్ని బాలన్స్ చేస్తుంది. నచ్చని వారు వదిలేయవచ్చు.
శెనగపిండి:
పులుసు చిక్కబడడానికి ఇంకా రుచి కోసం కొద్దిగా శెనగపిండి నీళ్ళు పోస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ శెనగపిండికి బదులు బియ్యం పిండి కూడా వాడుకోవచ్చు.
ఉల్లిపాయలు:
నేను సాంబార్ ఉల్లిపాయలు వాడాను, అవి పులుసుకి ప్రేత్యేకమైన రుచినిస్తాయ్. లేని వారు ఉల్లిపాయ పెద్ద పాయలు వేసుకోండి. ఉల్లిపాయ పంటికి తగుతుంటేనే రుచి.
పులుసు:
నేను పులుసు విడిగా గిన్నెలో వండాను, మీరు కావాలంటే కుక్కర్లో అన్నీ వేసి మూడు కూతలు హై-ఫ్లేమ్ మీద రానిస్తే చాలు.

గోంగూర పులుసు | పాతకాల పద్ధతిలో గోంగూర పులుసు - రెసిపీ వీడియో
Sorrel leaves Stew | Gongura Stew | How to make Gongura Pulusu Recipe
Prep Time 5 mins
Cook Time 20 mins
Total Time 25 mins
Servings 5
కావాల్సిన పదార్ధాలు
-
పులుసు కోసం
- 250 gms గోంగూర ఆకు
- 1/4 cup పచ్చిశెనగపప్పు
- 1/2 liter నీళ్ళు
- 10 సాంబార్ ఉల్లిపాయలు (లేదా పెద్ద ఉల్లిపాయ చీలికలు)
- 5 పచ్చిమిర్చి (చీలికలు)
- 2 pinches చిటికెళ్లు పసుపు
- 2 tsp శెనగపిండి
- 1.5 tbsp బెల్లం
- 300 ml చింతపండు పులుసు (నిమ్మకాయ సైజు చింతపండు నుండి తీసినది)
-
మెంతి కారం కోసం
- 1 tsp ఆవాలు
- 1 tsp మెంతులు
- 6 - 7 ఎండు మిర్చి
- ఇంగువా – చిటికెడు
- 1 tbsp నూనె
విధానం
-
పులుసు కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి మూతపెట్టి శెనగపప్పు మెత్తగా ఉడకనివ్వాలి.
-
నూనెలో మెంతులు, ఆవాలు వేసి మెంతులు రంగు మారి ఆవాలు చిటచిట అనేదాక వేపి ఎండుమిర్చి, ఇంగువ వేసి వేపుకోండి.
-
వేగిన మెంతులు ఆవాలని మెత్తని పొడి చేసుకోండి
-
శెనగపప్పు మెత్తగా ఉడికికాక చింతపండు పులుసు, మెంతి కారం, ఉప్పు వేసి బాగా కలిపి సన్నని సెగ మీద 5 నిమిషాలు ఉడికిస్తే మెంతికారం పరిమళం రుచి పులుసుకి పడుతుంది.
-
శెనగపిండిలో నీళ్ళుపోసి గడ్డలు లేకుండా బాగా కలిపి పులుసులో పోసి కలిపి మరో 5 నిమిషాలు ఉడికిస్తే పులుసు చిక్కబడుతుంది
-
దింపే ముందు బెల్లం వేసి కలిపి దింపేసుకోండి.
-
ఈ పులుసు అన్నం, రాగి సంగటి. జొన్న రొట్టెలతో చాలా రుచిగా ఉంటుంది

Leave a comment ×