కంది పొడి
ఇడ్లీ, అట్టు, గారే,అన్నం, ఆవకాయ దేనితో అయినా సరే పర్ఫెక్ట్ ఆంధ్రుల కంది పొడి. కమ్మని సువాసనతో ఘుమఘుమలాడిపోతూ ఎంతో రుచిగా ఉంటుంది. కనీసం 2 నెలల పైన తాజా ఉంటుంది.
ఎన్ని కురాలున్నా వేడి అన్నంలో నెయ్యి ఆంధ్రుల కంది పొడి వేసి నాలుగు ముద్దలు తిన్నా చాలు అంటారు ఆంధ్రులు. కంది పొడి లేని ఇల్లు రుచి చూడని తెలుగు వారు ఉండరు. అందుకే మీరు ఆంధ్రుల హోటల్స్ ఎక్కడికి వెళ్లినా పచ్చళ్ళతో పాటు కంది పొడి, నెయ్యి కూడా టేబుల్ మీద కనిపిస్తుంది.
ఈ పొడి వేడి నెయ్యి అన్నంతో పాటు వేపుడు కూరలలో ఆఖరున వేసి దింపినా చాలా రుచిగా ఉంటుంది. రెసిపీ చాలా సులభం. బ్యాచిలర్స్కి ఎంతో ఉపయోగపడుతుంది. ఇంకా రోజూ టిఫిన్స్లోకి చట్నీలు కాకుండా ఈ పొడి కాస్త వేసి చిన్నా చాలా రుచిగా ఉంటుంది.
కంది పొడి తెలుగు సంప్రదాయ పొడి. అందుకే ఈ కంది పొడి ఇంటింటికి వారి అభిరుచికి తగినట్లుగా మారిపోతుంది. నిజానికి కంది పొడి అంటే ఎక్కువ శాతం కందిపప్పు వాడి చేయాలి, కానీ ఈ రెసిపీ మా ఇంటి రెసిపీ ఇదీ కంది పొడి లాగానే కానీ వేసే పదార్ధాలు వాటి కొలతలు భిన్నం అంతే!
సింపుల్ రెసిపీనే అయినా టిప్స్ తెలుసుకుని చేస్తే ఎప్పుడు చేసినా ఒకే రుచి వస్తుంది.

టిప్స్
పప్పులు:
నిజానికి సంప్రదాయ పద్ధతిలో చేసే కందిపొడికి 80% కందిపప్పు మిగతావి మిగిలిన పప్పులు అంటే మినపప్పు సెనగపప్పు కొద్దిగా వేసి చేస్తారు. నేను నాలుగు రకాల పప్పులతో చేసాను. అన్నీ సమానంగా తీసుకున్న ఒక్క మినపప్పు తప్ప. నచ్చితే మీరు మరింకేదైనా పప్పుని తగ్గించి మినపప్పు పెంచుకోండి.
వేపే తీరు:
ఈ సింపుల్ రెసిపీకి ఎంతో ముఖ్యమైనది పప్పులు వేపడం. పప్పులు కేవలం సన్నని సెగ మీదే మాంచి సువాసన వచ్చేదాకా లేత బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి. ఇది చాలా ముఖ్యం. అప్పుడే పప్పు లోపలి దాకా వేగి మాంచి సువాసనతో ఉంటుంది పొడి.
కారం:
-
నేను చేస్తున్న కొలతకి గుంటూఋ మిరపకాయలు అయితే 50గ్రాములు సరిపోతాయ్, మీరు వాడే మిరపకాయల ఘాటుని బట్టి వేసుకోండి
-
సాధారణంగా కందిపొడిలో శొంఠి వేయరు, మా ఇంట్లో మేము శొంఠి వేస్తాము. చాలా రుచిగా ఉంటుంది, అల్లం ఘాటుతో, వేసి చుడండి.
గ్రైండ్ చేసే విధానం:
పప్పులు పూర్తిగా చల్లారిన తరువాత గ్రైండ్ చేసుకోవాలి అప్పుడు ముద్దకట్టదు పొడి. పొడిని మరీ ఫేస్ పౌడర్ అంత మెత్తగా కాకుండా ఒక్క పిసరు బరకగా ఉంచుకుంటే బాగుంటుంది. లేదంటే కాస్త నెయ్యి తగ్గినా నోరు చుట్టుకుంటుంది.
ఇంకొన్ని విధానాలు:
-
నచ్చితే ఎండుకొబ్బరి కొద్దిగా వేపి వేసుకోవచ్చు.
-
నచ్చితే వెల్లులి పొడి అంతా గ్రైండ్ చేసాక ఆఖరున పొట్టుతోనే వేసి గ్రైండ్ చేసి తీసుకోండి
కంది పొడి - రెసిపీ వీడియో
Toor Dal Spice Powder | Idly Powder | Kandi Podi
Prep Time 1 min
Cook Time 20 mins
Total Time 21 mins
Servings 20
కావాల్సిన పదార్ధాలు
- 1/2 cup కందిపప్పు
- 1/2 cup సెనగపప్పు
- 1/2 cup పెసరపప్పు
- 1/4 cup మినపప్పు
- 50 gm ఎండు మిరపకాయలు
- 2 tbsp జీలకర్ర
- 2 tbsp శొంఠి
విధానం
-
పాన్లో ఒక్కో పప్పు వేసి సన్నని సెగ మీద మాంచి సువాసన రంగు వచ్చే దాకా వేపి తీసి చల్లార్చుకోండి.
-
ఎండు మిరపకాయలు కూడా కాస్త రంగు మారే దాకా వేపి తీసుకోండి.
-
జీలకర్ర వేపి తీసుకోండి.
-
మిక్సీలో ముందు మిరపకాయాలు జీలకర్ర గ్రైండ్ చేసి మిగిలిన పప్పులు వేసి శొంఠి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి( గ్రైండ్ ఎలా చేసుకోవాలో టిప్స్ చుడండి).
-
ఈ పొడి గాలి పోనీ డబ్బాలో పెడితే రెండు నెలలు నిలవుంటుంది. కొబ్బరి వేస్తే తక్కువ నిలవుంటుంది.

Leave a comment ×
2 comments