ఉడుపి తీరు బీరకాయ సాంబార్

కమ్మని బీరకాయని ఉడికించి, మరిగించిన చింతపండు పులుసులో కందిపప్పు స్పెషల్ సాంబార్ ముద్ద వేసి మరిగించి వేరు సెనగగుళ్ళతో తాలింపు పెట్టి చేసే ఉడుపి తీరు సాంబార్ గుబాళింపు చెప్పేస్తుంది వీధిలోని వారికి మీ వంట సంగతి!!!

ఈ బీరకాయ సాంబార్ ఉడుపి వైపు ఎక్కువగా బ్రాహ్మణ పెళ్లిళ్లలో వడ్డిస్తారు. ఇందులో ఉల్లి వెల్లులి వేయరు. నచ్చితే మీరు వేసుకోవచ్చు. ఈ సాంబార్ ఘాటుగా, పుల్లగా కంటే కమ్మగా కొంచెం తియ్యగా ఉంటుంది.

దక్షిణ భారత దేశం వారికి సాంబార్ ఒక వంటకం కాదు ఒక ఎమోషన్!!! అందుకే సాంబార్ని తెగ ప్రేమించే తమిళవారికి ఊరికి ఇంటికి చేతికి కులానికి ఒక్కో రకం సాంబార్ రెసిపీ ఉంది.

సాంబార్లు కాయకూరకి తగినట్లుగా రోజుకో తీరుగా కాచుకోవచ్చు. కొన్ని రెడీమేడ్ సాంబార్ పొడి వేసి కాచేవి అయితే ఇంకొన్ని సాంబార్ పొడి అప్పటికప్పుడు చేసి కాచేవి అయి ఉంటాయి.

సాధారణంగా సాంబార్లు కాయకూర ముక్కలన్నీ వేసి కాచేవే తెలుసు. కానీ ఉడుపి సాంబార్లో కచ్చితంగా బ్యాడిగీ మిరపకాయలు గుంటూరు మిరపకాయాలు కలిపి వాడతారు. అందుకే చక్కటి ఎర్రటి రంగు బ్యాడిగీ మిరపకాయల పరిమళంతో ఉంటుంది.

అన్ని సాంబార్ల మాదిరే ఈ సాంబార్ కూడా కానీ వేరుశెనగగుండ్ల తాలింపు ఎంతో ప్రేత్యేకం!!! రెసిపీ చేసే ముందు టిప్స్ చదివి అవి పాటిస్తూ చేస్తే తప్పక గొప్ప సాంబార్ని మీరు ఆస్వాదిస్తారు!!!

Udupi Wedding style Ridge Gourd Sambar | Beerakaya Sambar

టిప్స్

బీరకాయ:

  1. చేదు లేని బీరకాయని కేవలం కణుపుల దగ్గర మాత్రమే చెక్కు తీసి పావు అంగుళం మందంగా ముక్కలు కోసుకోవాలి. కాయ మొత్తం చెక్కు తీస్తే సాంబారులో లేతగా ఉండే బీరకాయ గుజ్జుగా అయిపోతుంది.

బ్యాడిగి:

  1. బ్యాడిగి మిర్చీనే ఎక్కువగా కాశ్మీరీ మిర్చి పేరుతో అమ్ముతుంటారు. దాదాపుగా రెండు రకాల మిరపకాయలు ఒకేలాంటి రుచి పరిమళాన్నిస్తాయి. ఈ సాంబార్లో బ్యాడిగి మిర్చి ఎంతో ప్రేత్యేకం, కచ్చితంగా వాడుకోవాలి అని అర్దంచేసుకోండి. అందుబాటులో లేని వారు మరింకేదైనా మిర్చి వాడుకోండి

దాల్చిన చెక్క, లవంగాలు, యాలకలు, గసగసాలు:

  1. ఈ మసాలా దినుసులు ఎంతో కచ్చితంగా వేసుకోవాలి, అప్పుడే సాంబార్ ఎంతో రుచిగా ఉంటుంది. లేదంటే మసాలా పరిమళంతో ఉంటుంది.

చింతపండు:

  1. ఉడుపి సాంబార్లో పులుపు కాస్త తక్కువే వేస్తారు, నచ్చితే మీరు వేసుకోవచ్చు

కందిపప్పు:

  1. కందిపప్పు నానబెట్టి కొద్దిగా పసుపు వేసి మెత్తగా ఉడికిచున్నాక నేను పప్పుని వడకట్టి మిక్సీలో గ్రైండ్ చేసాను, చిక్కని మృదువైన సాంబార్ కోసం. మీరు మెత్తగా ఉడకబెట్టి సాంబార్ కాచుకోవచ్చు.
  2. కందిపప్పు బీరకాయ ఉడికించిన నీరు వడకట్టి సాంబార్లో పోసుకుని వాడుకోవచ్చు
  3. మీరు కందిపప్పుకి బాదులో పెసరపప్పు, సెనగపప్పుతో కూడా సాంబార్ చేసుకోవచ్చు.

బెల్లం:

  1. ఉడుపి సాంబారులో బెల్లం కొంచెం ఎక్కువగానే వేస్తారు, చెప్పను కదా ఈ సాంబార్ కమ్మగా ఉంటుంది అని. బెల్లం ఉప్పు కారం పులుపుని చక్కగా బాలన్స్ చేస్తుంది.

ఆఖరుగా:

  1. కచ్చితంగా సాంబార్ బాగా నిదానంగా మరగాలి. అప్పుడే సాంబార్ రుచిగా ఉంటుంది.
  2. సాంబార్ మరిగేప్పుడు ఒక్కసారి రుచి చూసి ఉప్పు పులుపు కారం మీకు తగినట్లుగా వేసుకోండి.
  3. చల్లారాక సాంబార్ చిక్కగా అనిపిస్తే కాసిని వేడి నీళ్లు కలిపి పలుచన చేసుకోండి.

ఉడుపి తీరు బీరకాయ సాంబార్ - రెసిపీ వీడియో

Udupi Wedding style Ridge Gourd Sambar | Beerakaya Sambar

Sambar - Rasam Recipes | vegetarian
  • Prep Time 1 hr
  • Cook Time 40 mins
  • Total Time 1 hr 40 mins
  • Servings 8

కావాల్సిన పదార్ధాలు

  • సాంబార్ పేస్ట్ కోసం:
  • 1 tbsp మినపప్పు
  • 6-7 బ్యాడిగీ మిరపకాయాలు
  • 7 - 8 గుంటూరు మిర్చి
  • 2 tbsp ధనియాలు
  • 2 యాలకలు
  • 3 లవంగాలు
  • 1 inch దాల్చిన చెక్క
  • 1 tsp జీలకర్ర
  • 1/2 cup పచ్చికొబ్బరి ముక్కలు
  • 1 tsp గసగసాలు
  • పప్పు ఉడికించుకోడానికి
  • 1/2 cup కందిపప్పు (గంటసేపు నానబెట్టినవి)
  • 1/2 tsp పసుపు
  • ఉప్పు
  • 1.5 cup నీళ్లు
  • బీరకాయ ఉడికించుకోడానికి
  • 300 gm బీరకాయ ముక్కలు
  • సాంబార్ కోసం
  • 1 tbsp నూనె
  • మెంతులు - చిటికెడు
  • 1/2 tsp ఆవాలు
  • 2 చిటికెళ్లు ఇంగువ
  • 2 కరివేపాకు - రెబ్బలు
  • 300 ml చింతపండు పులుసు (70gm చింతపండు నుండి తీసినది)
  • 750 ml నీళ్లు
  • ఉప్పు
  • తాలింపు కోసం:
  • 2 tbsp నూనె
  • 4 tbsp వేరుశెనగ గుండ్లు
  • 1/2 tsp ఆవాలు
  • 2 ఎండుమిర్చి
  • 2 కరివేపాకు - రెబ్బలు
  • కొత్తిమీర - కొద్దిగా

విధానం

  1. నానబెట్టుకున్న కందిపప్పులో ఉప్పు పసుపు నీళ్లు పోసి కుక్కర్ మూతపెట్టి మెత్తగా ఉడికించుకోండి. నచ్చితే పప్పు వడకట్టి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవచ్చు.
  2. సాంబార్ పేస్ట్ కోసం ఉంచిన పదార్ధాలన్నీ ఒక్కోటిగా వేస్తూ మాంచి సువాసన వచ్చేదాకా వేపుకోండి సన్నని సెగ మీద. ఆఖరున గసగసాలు వేసి చిట్లనిచ్చి దింపి చల్లార్చి మెత్తని పేస్ట్ చేసుకోండి.
  3. బీరకాయని చేదు లేకుండా చూసుకుని కణుపుల దగ్గర చెక్కు తీసిన ముక్కలు 2 కప్పుల నీళ్లలో 80% ఉడికించి దింపేసుకోండి.
  4. సాంబార్ కోసం నూనె వేడి చేసి మెంతులు ఆవాలు ఇంగువ కరివేపాకు ఒక్కోటిగా వేస్తూ వేపుకోవాలి.
  5. వేగిన తాలింపు లో టమాటో ముక్కలు వేసి ఒక నిమిషం వేపుకోండి, తరువాత చింతపండు పులుసు పోసి ఒక పొంగురానివ్వాలి.
  6. పొంగిన పులుసులో సాంబార్ ముద్ద, కందిపప్పు ముద్ద, ఉప్పు, బీరకాయని ఉడికించుకున్న నీరు, నీళ్లు, ఉప్పు, బెల్లం వేసి కలిపి మూతపెట్టి 20 నిమిషాలు మరగనివ్వాలి.
  7. తాలింపు కోసం నూనె వేడి చేసి అందులో వేరుశెనగగుండ్లు, ఆవాలు ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి తాలింపుని ఎర్రగా వేపుకోవాలి. దింపే ముందు కొత్తిమీర తరుగు చల్లి 20 నిమిషాలుగా మరుగుతున్న సాంబార్లో కలిపేసుకోవాలి.
  8. దింపేముందు ఒక్క సారి ఉప్పు పులుపు రుచి చూసి అడ్జస్ట్ చేసుకోండి. చింతపండు పులుపు వేస్తే ఒక పొంగు రానిచ్చి దింపేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

Udupi Wedding style Ridge Gourd Sambar | Beerakaya Sambar