కర్నూల్ స్పెషల్ ఉగ్గాని

కొన్ని రెసిపీస్ పుట్టిన చోట కంటే ఎక్కువమంది ఇష్టపడే చోటే ఆదరణ ఎక్కువ, అలాంటిదే కర్ణాటక స్పెషల్ రెసిపీ వాగ్గాని, అదే ఆంధ్రప్రదేశ్లో ఉగ్గానిగా మారింది.

కర్ణాటక రాష్ట్రానికి పక్కనే ఉన్న కర్నూల్ అనంతపూర్ జిల్లాల వారు బొరుగులతో చేసే ఈ వంటకాన్ని ఎంతో ఇష్టంగా తింటారు. నిజానికి ఉగ్గాని వారికి ఏదో ఉదయాన్నే సులభంగా చేసుకునే రెసిపీ కాదు, ఒక అనుబంధం అని చెప్పాలి.

ఉగ్గానితో మిరపకాయ బజ్జీ నంజుకుంటూ ఆంధ్రాలోని రాయలసీమ ప్రాంతం అంతా చాలా ఇష్టంగా తింటారు. ముఖ్యంగా కర్నూల్ అనంతపూర్ జిల్లాల వారు. ఇంకా ఆ జిల్లాలకి పక్కనే ఉన్న తెలంగాణాలోని గద్వాల్ వైపు కూడా ఉదయాన్నే తింటారు.

బొరుగులు ఉల్లిపాయ టొమాటో ముక్కల తరుగు వేసి చేసే ఈ ఉగ్గాని చూడడానికి ఆకర్షణీయంగా చేయడానికి సులభంగా ఉంటుంది. రెసిపీ 15 నిమిషాల్లో తయారవుతుంది, కానీ కొన్ని టిప్స్ పాటిస్తే సరిగ్గా రాయలసీమ వారు చేసే తీరు ఉగ్గాని రుచి వస్తుంది. దాని కోసం టిప్స్ చూడండి.

టిప్స్

బొరుగులు/మరమరమరాలు :

  1. ఉగ్గానికి పల్చని బొరుగులు పనికి రావు. తెలుగు రాష్ట్రాలలో ప్రేత్యేకించి కర్నూల్ బొరుగులు అని దొరుకుతాయ్ అవే వాడాలి. ఆ బొరుగులు అయితేనే నీళ్ళలో నానినా బరువు తగ్గవు. అందుబాటులో ఉండే మరో రకం బొరుగులు కూడా వాడుకోవచ్చు, కానీ బొరుగులు నీళ్ళలో వేసిన 2 నిమిషాలకే పిండి తీసేయాలి. లేదంటే మెత్తగా అయిపోతాయ్.

  2. బొరుగులు కొద్దికొద్దిగా తీసుకుని నీళ్ళలో వేసి 2 నిమిషాలు బాగా తడిపి నీళ్ళని పిండి జల్లెడలో వేయాలి. ఒకే సారి బొరుగులన్నీ వేసినా సరిగా నీళ్ళలో నానబెట్టకపోయినా ఉగ్గాని అంత రుచిగా అనిపించదు.

  3. బొరుగుల నుండి నీరు పిండిన వెంటనే ఉప్పు వేసి ఉంచితే ఉప్పు బొరుగులు బాగా పట్టుకుంటాయ్.

మరికొన్ని టిప్స్:

  1. ఉగ్గాని ఇంటికో తీరుగా చిన్న చిన్న మార్పులతో చేస్తారు. నేను కర్నూల్లో అందరికీ తెలిసినది, చేసే తీరులో చేస్తున్నా.

  2. నేను పప్పుల పొడి వేసి చేశాను, ఇంకొందరు అచ్చంగా కొబ్బరి పొడి చల్లి కూడా చేస్తారు.

  3. ఉగ్గానిలో సాధారణంగా పులుపు వేయరు. కొందరు వేసుకుంటారు నిమ్మకాయ పిండే వారు ఆఖరున పిండుకుంటారు. చింతపండు పులుసు అయితే టొమాటో ముక్కల్లో ఉడికిస్తారు.

  4. ఉగ్గాని లో వేసే ఉల్లి, టొమాటో ముక్కలు ఏవీ మెత్తగా మగ్గిపోకూడదు. పచ్చి వాసన పోతే చాలు.

  5. ఉగ్గానిలో నచ్చితే పచ్చిమిర్చి తరుగు వేసుకోవచ్చు, నేను పచ్చిమిర్చి దంచి వేశాను. ఇలా దంచి వేస్తే రుచి చాలా బాగుంటుంది. ఇంకా రంగు కోసం కొద్దిగా కారం వేశాను. కావాలంటే కారం వేయకపోయిన పర్లేదు.

కర్నూల్ స్పెషల్ ఉగ్గాని - రెసిపీ వీడియో

Uggani | Rayalaseema Kurnool Special Uggani | Vaggani | Tossed Puff Rice

Breakfast Recipes | vegetarian
  • Cook Time 15 mins
  • Total Time 15 mins
  • Servings 3

కావాల్సిన పదార్ధాలు

  • 200 gm బొరుగులు
  • 1 ఉల్లిపాయ – పెద్దది ఒకటి
  • 1/2 cup టొమాటో ముక్కలు
  • 5 పచ్చిమిర్చి
  • 2 రెబ్బలు కరివేపాకు
  • 1 tsp ఆవాలు
  • 1 tsp జీలకర్ర
  • 2 ఎండు మిర్చి
  • ఉప్పు
  • 1/2 tsp కారం
  • 2.5 tbsp నూనె
  • 1/2 cup పుట్నాల పప్పు
  • 2 ఎండుమిర్చి
  • 2 tbsp ఎండుకొబ్బరి పొడి
  • కొత్తిమీర – చిన్న కట్ట

విధానం

  1. బొరుగులు కొద్దికొద్దిగా నీళ్ళలో వేసి 3 నిమిషాలు నానబెట్టి గట్టిగా నీరు పిండి ఒక గిన్నెలో వేసుకోండి.
  2. బొరుగులలో కొద్దిగా ఉప్పు కలిపి పక్కనుంచండి.
  3. పచ్చిమిర్చి కరివేపాకు వేసి దంచి పక్కనుంచుకోండి.
  4. పుట్నాల పప్పు ఎండుమిర్చి ఎండుకొబ్బరి పొడి మిక్సీలో మెత్తని పొడి చేసుకోండి.
  5. తాలింపు కోసం నూనె వేడి చేసి అందులో ఆవాలు ఎండుమిర్చి ముక్కలు జీలకర్ర కరివేపాకు వేసి వేపుకోవాలి.
  6. ఉల్లిపాయ తరుగు, ఒక రెబ్బ కరివేపాకు వేసి 2 నిమిషాలు వేపండి చాలు.
  7. ఆ తరువాత టొమాటో ముక్కలు, పసుపు, పచ్చిమిర్చి ముద్ద, కారం వేసి వేసి టొమాటోలోని పచ్చి వాసన పోయేదాకా వేపుకోవాలి.
  8. టొమాటో మగ్గిన తారువత నానబెట్టిన బొరుగులు, గ్రైండ్ చేసుకున్న పప్పులపొడి 2 tsp కొత్తిమీర తరుగు, ఉప్పు వేసి హై-ఫ్లేమ్ మీద టాస చేసి పచ్చిమిరపకాయ బజ్జీలతో సర్వ్ చేసుకోండి.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

5 comments