వెనీలా ఐస్క్రీమ్ బర్ఫీ
స్వీట్ షాప్స్లో దొరికే కొన్ని స్వీట్స్ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఎవ్వరైనా బెస్ట్గా చేయవచ్చు అనడానికి ఉదాహరణ వెనీలా ఐస్క్రీమ్ బర్ఫీ రెసిపీ. రెసిపీ పేరు వినడానికి చాలా కొత్తగా ఆకర్షణీయంగా అనిపించవచ్చు. కానీ, చాలా సింపుల్ రెసిపీ. వెనీలా ఫ్లేవర్తో నోట్లో వేసుకుంటే ఐస్క్రీమ్లా కరిగిపోతుంది ఈ ఐస్క్రీమ్ బర్ఫీ.
ఈ బర్ఫీ తింటుంటే వెనీలా ఐస్క్రీమ్ తింటున్నట్లు ఉండదు కానీ, ఐస్క్రీమ్ అంత మృదువుగా కరిగిపోయేలా ఉంటుంది. రెసిపీ కొంచెం మిల్క్ మైసూర్ పాక్కి దగ్గరగా ఉంటుంది, కానీ ఆ రుచి ఈ బర్ఫీకి రాదు.
ఎంతో సులభమైన ఈ బర్ఫీ రంగు సాధ్యమైనంత తెల్లగా ఉండాలి, నోట్లో పెట్టుకుంటే మృదువుగా ఉండాలి. అలా అవన్నీ కచ్చితంగా రావాలంటే తప్పక టిప్స్ చూడండి.

టిప్స్
పర్ఫెక్ట్ బర్ఫీకి కొన్ని టిప్స్:
-
బర్ఫీ ఎంత తెల్లగా ఉంటే అంత పర్ఫెక్ట్గా తయారైనట్లు. అలాగే ఎంత మృదువుగా ఉంటే పాకం అంత కచ్చితంగా పట్టినట్లు. ఈ ఐస్క్రీమ్ బర్ఫీకి ఈ రెండు ఎంతో ప్రధానమైనవి.
-
పాకం ముదిరితే బర్ఫీ గట్టిగా అయిపోయి మృదుత్వనాన్ని కోల్పోతుంది. రుచి బాగానే ఉన్నా అసలైన బర్ఫీలా ఉండదు.
బర్ఫీ రంగు మారకుండా ఉండాలంటే:
-
నాన్ స్టిక్ పాన్ వాడడం మేలు. ఇంకా ముకుడులో పాల పిండి ముద్ద వేశాక సన్నని సెగ మీద ముకుడు అంతా అన్నీ వైపులా బర్ఫీ తయారయ్యేదాకా తిప్పుతూనే ఉండాలి. అప్పుడే రంగు మారదు.
-
ఇంకా బర్ఫీని హై ఫ్లేమ్ మీద కలిపితే అడుగుపట్టి రంగు మారుతుంది. బర్ఫీ ఉండ కట్టేదాకా సన్నని సెగ మీద కలపాలి.
-
బర్ఫీలోంచి చిన్న ముద్ద వేళ్ళ మధ్యన నలిపితే ఉండ కట్టాలి, అలా ఉండ కడితే బర్ఫీ తయారైనట్లే. ఆ తరువాత స్టవ్ ఆపేసి మరో రెండు నిమిషాలు తిప్పితే వేడి వదిలి మౌల్డ్లో పోసాక కూడా రంగు మారదు.
వెనీలా షుగర్:
- ఐస్క్రీమ్ బర్ఫీ రంగు మారకుండా ఉపయోగపడే పదార్ధం వెనీలా షుగర్. ఈ వెనీలా షుగర్ సూపర్ మార్కెట్స్లో చాలా సులభంగా దొరికేస్తుంది. ఒక వేళ లేనట్లైతే వెనీలా ఎసెన్స్ వేసుకోండి, కానీ కాస్త రంగు మారుతుంది బర్ఫీ.
ఐస్క్రీమ్ బర్ఫీ గురుంచి కొన్ని విషయాలు:
- ఐస్క్రీమ్ బర్ఫీకి తీపి కొంచెం ఎక్కువగానే ఉంటుంది, కావాలంటే తీపి తగ్గించుకోండి. కానీ నెయ్యి తగ్గితే గట్టిగా ఉంటుంది బర్ఫీ .
వెనీలా ఐస్క్రీమ్ బర్ఫీ - రెసిపీ వీడియో
Vanilla Ice Cream Burfi | Home made Ice Cream Barfi | Perfect Ice cream Burfi Recipe with Tips
Prep Time 5 mins
Cook Time 25 mins
Resting Time 6 hrs
Total Time 6 hrs 30 mins
Pieces 22
కావాల్సిన పదార్ధాలు
- 200 gm తీపి పాల పిండి
- 200 gm పెరిన నెయ్యి
- 250 gm పంచదార
- 150 ml నీళ్ళు
- 1 tbsp వెనీలా షుగర్
- 2 tbsps పిస్తా పలుకులు
విధానం
-
ముందుగా ట్రేలో 8*6 అంగుళాల ట్రేలో బటర్ పేపర్ వేసి పిస్తా పలుకులు చల్లి పక్కనుంచుకోండి.
-
పాల పిండిలో నెయ్యి వేసి బాగా కలిపి ముద్దగా చేసి పక్కనుంచుకోండి.
-
పంచదారలో నీళ్ళు పోసి ఒక తీగ పాకం వచ్చేదాక మరించాలి.
-
తీగపాకం రాగానే స్టవ్ ఆపేసి, కలిపి ఉంచుకున్న పాలపిండి ముద్ద వేసి పాకంలో కరిగిపోయేదాక కలపాలి.
-
చిన్న ఉండ తీసి వేళ్ళ మధ్య నలిపితే బర్ఫీ ఎంత చిక్కబడింది తెలుస్తుంది. తరువాత మళ్ళీ స్టవ్ మీద పెట్టి వెనీలా షుగర్ వేసి సన్నని సెగ మీద మూకుడు అంతా తిప్పుకుంటూ ఉడికించాలి.
-
4 నిమిషాల తరువాత బర్ఫీ చిన్న ముద్ద వేళ్ళ మధ్యపెట్టి నలిపితే ఉండకట్టాలి, ఉండ కడితే స్టవ్ ఆపేసి దింపి బర్ఫీని ముకుడులో మరో 3 నిమిషాలు బాగా కలుపుకోవాలి.
-
3 నిమిషాల తరువాత బర్ఫీని పిస్తా పలుకులు చల్లుకున్న ట్రేలో పోసి స్పాటులాతో చదును చేసి ఆరు గంటలు లేదా రాత్రంతా చల్లారనివ్వాలి.
-
6 గంటల తరువాత చల్లారిన బర్ఫీని బోరలిస్తే సులభంగా వచ్చేస్తుంది. అప్పుడు సన్నగా పొడవుగా ముక్కలుగా కోసుకోండి. ఇవి ఫ్రిజ్లో అయితే నెలరోజులు నిలవ ఉంటాయ్.

Leave a comment ×
11 comments