బెస్ట్ దాల్ ఖమన్
స్నాక్ అనే అనండి బ్రేక్ఫాస్ట్ అనే అనుకోండి లేదా పార్టీ స్టార్టర్ అనండి ఎప్పుడైనా పర్ఫెక్ట్ గుజరాత్ స్పెషల్ దాల్ ఖమన్. పుల్లగా కారంగా తియ్యగా మృదువుగా చాలా రుచిగా ఉంటుంది. అసలు గుజరాతీ ఖమన్ తినడానికి ఒక సమయం సందర్భం అవసరం లేదు ఎప్పుడైనా పర్ఫెక్ట్ అంటారు గుజరాతీలు.
ఖమన్-ఢోక్లా పేర్లలో గుజరాతేతరులకి చిన్న సందేహం ఉంటుంది. ఢోక్లా , ఖమన్ రెండూ పూర్తిగా భిన్నం. ఢోక్లా తెల్లగా ఉంటుంది, బియ్యం కొద్దిగా మినపప్పు కలిపి చేస్తారు. ఖమన్ శెనగపప్పు లేదా శెనగపిండితో చేస్తారు. గుజరాతీలకి తప్ప దాదాపుగా ఖమన్ ఢోక్లాకి వ్యత్యాసం తెలియదు. మిగిలిన వారు అన్నింటినీ ఢోక్లా అనే అంటారు. నేను కూడా అందరికీ సులభంగా అర్ధమవడానికి “ఢోక్లా” అనే టైటిల్ పెట్టాను
“దాల్ ఖమన్తో” ఎందరో గుజారాతీల రోజు మొదలవుతుంది అంటే ఆశ్చర్యం లేదు. దక్షిణభారత దేశం వారికి ఇడ్లీ అట్టు ఇడియప్పంతో ఎలా రోజు మొదలో వారికి ఖమన్, ఫాఫ్డా, ఘాటియా, జీలేబీతో రోజు మొదలవుతుంది.
దాల్ ఖమన్ ఒక రకంగా ఇడ్లీ లాంటిదే. కాకపోతే శెనగపప్పు చేసే ఇడ్లీ అనాలి. శెనగపిండితో చేసే ఖమన్ రుచి, దాల్ ఖమన్ రుచి భిన్నం. దేనికదే ప్రేత్యేకం. దాల్ ఖమన్కి పిండిని పులియబెట్టి చేస్తారు. దాల్ ఖమన్ చేయడంలో చిన్నవే అయినా పొరపాటు జరిగితే ఖమన్ మృదువుగా ఉండదు. తింటున్నప్పుడు గొంతు చుట్టుకుంటుంది. అలా అవ్వకుండా పర్ఫెక్ట్ ఖమన్ కోసం చిన్న చిట్కాలు కొలతలు పాటిస్తూ చేయండి. 100% బెస్ట్ ఖమన్ వచ్చి తీరుతుంది.

టిప్స్
గ్రైన్డింగ్ టిప్స్:
-
శెనగపప్పు, బియ్యం మినపప్పుని సన్నని రవ్వలా రుబ్బుకోవాలి.
-
రుబ్బిన పిండిని బాగా బీట్ చేయాలి అప్పుడే పిండిలోకి గాలి చేరి బాగా పొంగుతుంది.
-
పిండి ఐదు గంటలు పులిస్తే చాలు. చలికాలంలో అయితే రాత్రంతా పులిసినా పర్లేదు. వేసవిలో రాత్రంతా వదిలేస్తే మరీ ఎక్కువగా పులిసిపోతుంది. అప్పుడు వంట సోడా వేయకండి.
-
పిండిలో నూనె వేసి కలపడం వల్ల ఖమన్ ఎంతో మృదువుగా వస్తుంది, లేదంటే గొంతుకి చుట్టుకుంటుంది
నిమ్మ ఉప్పు:
నిమ్మ ఉప్పు ఖమన్కి నిమ్మరసం కంటే చక్కని పులుపుని ఇస్తుంది.
పంచదార:
గుజరాతీలు పులుపు తీపి కారం కాలగలపుని ఇష్టంగా తింటారు. తీపి ఇష్టపడని వారు వదిలేవచ్చు.

బెస్ట్ దాల్ ఖమన్ - రెసిపీ వీడియో
Vati Dal Khaman | Dhokla | Chana Dal Dhokla | Surti Khaman | How to make Spongy Dal Dhokla recipe
Prep Time 2 mins
Soaking Time 4 hrs
Cook Time 20 mins
Resting Time 1 hr 30 mins
Total Time 5 hrs 52 mins
Servings 8
కావాల్సిన పదార్ధాలు
-
ఖమన్ కోసం
- 1.5 cups పచ్చి శెనగపప్పు (4 గంటలు నానబెట్టినది)
- 2 tbsp బియ్యం (4 గంటలు నానబెట్టినది)
- 2 tbsp మినపప్పు (4 గంటలు నానబెట్టినది)
- 1/2 cup పెరుగు
- నీళ్ళు – రుబ్బుకోడానికి
- ఉప్పు – తగినంత
- 2 tbsp నూనె
- 1 tbsp ఈనొ
- 1/4 tsp వంట సోడా
- 1/2 tsp పసుపు
- 3 tbsp నూనె (పులిసిన పిండిలో కలుపుకోడానికి)
- 3 - 4 నీళ్ళు (పిండి పలుచన చేసుకోడానికి)
- కొత్తిమీర – కట్ట సన్నని తరుగు
- 3 tbsp పచ్చి కొబ్బరి తురుము
- 1 అల్లం పచ్చిమిర్చి పేస్ట్
- 5 మీడియం కారం పచ్చిమిర్చి
- 3 మీడియం కారం పచ్చిమిర్చి
- 1 ఇంచ్ అల్లం
- 1/8 tsp నిమ్మ ఉప్పు
- 1 tbsp నిమ్మరసం
- 10 - 12 వెల్లులి
-
తాలింపు కోసం
- 2 tbsp నూనె
- 1.5 tsp ఆవాలు
- 5 పచ్చిమిర్చి
- ఉప్పు కొద్దిగా
- 2 చిటికెళ్లు ఇంగువ
- 3 కరివేపాకు రెబ్బలు
- 1/2 cup నీళ్ళు
- 1.5 tbsp పంచదార
విధానం
-
4 గంటలు నానిన శెనగపప్పు, బియ్యం మినపపప్పుని మిక్సీలో వేసి పెరుగుతో సన్నని రవ్వలా రుబ్బుకోవాలి
-
రుబ్బుకున్న పిండిలో ఉప్పు నూనె వేసి 2-3 నిమిషాలు బాగా బీట్ చేసుకుని మూత పెట్టి 5 గంటలు వదిలేయాలి
-
మిక్సీ జార్లో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కోసం ఉంచిన పదార్ధాలన్నీ వేసి బరకగా రుబ్బుకోండి
-
కేక్ మౌల్డ్ని నూనెతో గ్రీస్ చేసి పక్కనుంచుకోండి
-
ఐదు గంటల తరువాత పిండిలో పసుపు నూనె అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి మరో 2 నిమిషాలు బీట్ చేసుకోవాలి
-
తరువాత వంట సోడా, ఈనో వేసి ఈనో పైన నిమ్మరసం పిండి ఒకే వైపు బాగా కలుపుకుంటే పిండి పొంగుతుంది
-
పొంగిన పిండిని మౌల్డ్లో పోసి కుక్కర్లో ఒక స్టాండ్ పెట్టి స్టాండ్ మీద ఖమన్ మౌల్డ్ పెట్టి మూత పెట్టి ఆవిరి మీద 8 నిమిషాలు హై ఫ్లేమ్ మీద 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద స్టీమ్ చేసుకోవాలి ( ఇడ్లీల మాదిరి)
-
8 నిమిషాల తరువాత టూత్పిక్ గుచ్చి క్లీన్గా వస్తే క్లాత్ కప్పి పూర్తిగా చల్లరనివ్వాలి
-
చల్లారిన ఖమన్ని ముక్కలుగా కోసుకోవాలి
-
తాలింపు కోసం నూనె వేడి చేసి ఆవాలు చిటచిటలాడించాక పచ్చిమిర్చి ముక్కలు ఇంగువ ఉప్పు కరివేపాకు వేసి వేపి నీళ్ళు పంచదార వేసి హై-ఫ్లేమ్ మీద ఒక పొంగు రానిచ్చి దింపేసుకోండి
-
తాలింపు నీళ్ళుతో ఖమన్ ముక్కలని తడుపుకోండి. పైన సన్నని కొత్తిమీర తరుగు, కొబ్బరి తురుము చల్లి పుదీనా చట్నీ లేదా టొమాటో సాస్తో సర్వ్ చేసుకోండి.

Leave a comment ×