దోసకాయ ఎండుమిర్చి పచ్చడి | దోసకాయ పచ్చడి

దోసకాయ ఎండుమిర్చి పచ్చడి- వేయించిన ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, వెల్లులి, పల్లీలు, చింతపండు వేసి మెత్తని పేస్ట్ చేసి అందులో తరిగిన దోసకాయ ముక్కలు వేసి కలిపి గుభాళించేలా తాలింపు పెట్టి చేసే పలనాడు స్పెషల్ దోసకాయ పచ్చడి వేడి అన్నంతో అద్భుతంగా ఉంటుంది. 

కారంగా పుల్లగా అక్కడక్కడా పంటికింద కరకరలాడే పుల్లని దోసకాయ ఉల్లిపాయ ముక్కలతో ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది పలనాడు స్పెషల్ దోసకాయ ఎండుమిర్చి పచ్చడి. 

ఈ సింపుల్ పచ్చడిలో ఉప్పు కారం పులుపుని రుచానుసారం సరిచూసుకుని వేసుకుంటే చాలు చాలా బాగా కుదురుతుంది. 

టిప్స్

దోసకాయ:

  1. గట్టిగా కొబ్బరి ముక్కలా ఉండే దోసకాయ వాడుకోగలిగితే చాలా రుచిగా ఉంటుంది పచ్చడి తినడానికి.
  2. సాధారణంగా దోసకాయ చెక్కు గింజలు తీసేసి చిన్న ముక్కలుగా తరుక్కుంటే అన్నంతో కలుపుకుని తినేందుకు బాగుంటుంది.
  3. దోసకాయ వాడేముందు ఒక సరి చేదు చూసి వాడుకోవడం మర్చిపోకండి.

కారం:

  1. ఈ పచ్చడిలో ఎండుమిర్చి వేసి చేశాను, ఇదే పచ్చడి నచ్చితే పచ్చిమిర్చి వేసి కూడా చేసుకోవచ్చు.

దోసకాయ ఎండుమిర్చి పచ్చడి | దోసకాయ పచ్చడి - రెసిపీ వీడియో

Yellow Cucumber Dry Chilli Chutney | Cucumber Chilli Pickle

Pickles & Chutneys | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 10 mins
  • Total Time 15 mins
  • Servings 8

కావాల్సిన పదార్ధాలు

  • 750 gms కొబ్బరి ముక్కాలా గట్టిగా ఉండే దోసకాయ
  • 4 tbsp నూనె
  • 2 tbsp వేరుశెనగ గుండ్లు
  • 1 tsp జీలకర్ర
  • ½ tbsp ధనియాలు
  • 10-12 Cloves వెల్లులి
  • చింతపండు (నిమ్మకాయంత)
  • 1 ఉల్లిపాయ
  • ఉప్పు (రుచికి సరిపడా)
  • పసుపు (కొద్దిగా)
  • తాలింపు కోసం:
  • 4 tbsp నూనె
  • 1 tsp ఆవాలు
  • 1 tsp సెనగపప్పు
  • 1 tsp మినపప్పు
  • 1 sprig కరివేపాకు (ఒక రెబ్బ)
  • ½ tsp జీలకర్ర
  • 1 ఎండుమిర్చి
  • కొత్తిమీర (కొద్దిగా)

విధానం

  1. గట్టిగా కొబ్బరి ముక్కలా ఉన్న దోసకాయ చెక్కు తీసి లోపలి గింజలు కూడా తీసేసి చిన్న చిన్న ముక్కలు తరిగి ఉంచుకోండి.
  2. నూనె వేడి చేసి అందులో వేరుశెనగ గుండ్లు వేసి చిట్లనిచ్చి ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, వెల్లులి వేసి ఎండుమిర్చి పొంగి రంగు మారే దాకా వేపుకొండి.
  3. వేగిన మిర్చి పల్లీల మిక్సర్ జార్లోకి తీసుకుని అందులోనే నానబెట్టిన చింతపండు, పసుపు, ఉప్పు వేసి మెత్తని పేస్ట్ చేసుకోండి.
  4. మెత్తని పేస్ట్ లో పిడికెడు దోసకాయ ముక్కలు వదిలేసి మిగిలిన దోసకాయ ముక్కలు, ఒక ఉల్లిపాయ వేసి రెండు మూడు సార్లు పల్స్ చేస్తూ బరకగా గ్రైండ్ చేసుకోండి.
  5. రుబ్బుకున్న పచ్చడిలో మిగిలిన దోసకాయ ముక్కలు వేసి కలుపుకోండి.
  6. తాలింపు కోసం నూనె వేడి చేసి అందులో తాలింపు సామాగ్రీ ఒక్కోటి వేసుకుంటూ తాలింపుని ఎర్రగా వేపుకుని పచ్చడి తాలింపులో కలిపి పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకుని దింపేసుకోండి.
  7. ఈ పచ్చడి వేడిగా నెయ్యి వేసిన అన్నంతో చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

1 comments

  • L
    laxminarsimha
    కావల్సిన పదార్థాల్లో ఎండు మిర్చి ఏదీ?