ఆంధ్రా పనీర్ బటర్ మసాలా

ఫ్రెష్ క్రీమ్స్, కాశ్మీరీ కారం ఇవేవి వేయకుండా పనీర్ని ఎర్రగా వేపి ఘాటైన ఆంధ్రా స్టైల్ ఘాటైన టమాటో గ్రేవీలో వేసి చేసే వెడ్డింగ్ స్టైల్ పనీర్ బటర్ మసాలా పంజాబీ పనీర్ బటర్ మసాలాకి ధీటుగా ఉంటుంది.

కారం ప్రియులు తెలుగు వారు. ఎందులోనైనా కారం కాస్త దండిగా ఉంటేనే తృప్తి. కమ్మగా పాల మీగడ వేసి చేసే పంజాబీ పనీర్ బటర్ మసాలా అంత సులభంగా తెలుగు వారికి నచ్చదు. మీకు తెలుగు రాష్ట్రాల్లో పనీర్ బటర్ మసాలా పేరుతో దొరికే రెసిపీ అసలైన పంజాబీ తీరులో ఉండదు. తెలుగు వారి పనీర్ బటర్ మసాలా ఘాటుగా కారంగా ఉంటుంది. కమ్మటి కూరలు అంతగా ఇష్టపడరు తెలుగు వారు.

అందుకే తెలుగు కేటరర్స్ తెలుగు వారికి నచ్చే తీరులో పనీర్ బటర్ మసాలా మార్చేసి పెళ్లిళ్లలో రోటీతో వడ్డిస్తున్నారు. తెలుగు వారి పనీర్ బటర్ మసాలా రోటీలతోనే కాదు అన్నంతో కూడా చాలా రుచిగా ఉంటుంది.

తెలుగు వారి పనీర్ బటర్ మసాలాలో పంజాబీ తీరుకి మల్లె కాశ్మీరీ కారం, ఆఖరున ఫ్రెష్ క్రీమ్ లాంటివి ఏవీ వేయరు, ఇంకా కొద్దిగా టమాటో కెట్చప్ కూడా వేస్తారు. పనీర్ని కూడా నూనెలో లేత బంగారు రంగు వచ్చేదాకా వేపి గ్రేవీలో వేస్తారు.

నిజం చెప్పేదా...నాకూ పంజాబీ తీరు కంటే తెలుగు వారి పనీర్ బటర్ మసాలా రోటీలు పూరిలతో చాలా రుచిగా అనిపిస్తుంది. తెలుగు వారి తీరు కూడా దాదాపుగా పంజాబీ పనీర్ బటర్ మసాలాలానే, కానీ వేసే పదార్ధాలు వాటి కొలతలు భిన్నం, చేతికో రుచి అంటుంటారు కదా ఆలా ఇది కూడా!!!

మీరు ఈ రెసిపీని కూడా ఇష్టపడవచ్చుగోంగూర పనీర్

టిప్స్

పనీర్:

  1. పనీర్ని లేత బంగారు రంగు వచ్చే దాకా మాత్రమే వేపి తీసుకోండి. మరీ ఎర్రగా వేగితే పనీర్లోకి ఫ్లేవర్స్ ఇంకవు.
  2. ఏ కారణం చేతనైన పనీర్ ఎక్కువగా వేగిపోతే వెంటనే ఉప్పేసిన నీళ్లలో పనీర్ ముక్కలు వేసి వదిలేయండి గట్టి పడిన పనీర్ కాస్త మెత్తబడుతుంది. గ్రేవీ తయారయ్యాక పనీర్ని నెమ్మదిగా పిండి కూరలో వేస్తే మసాలాలని పీలుస్తుంది.

గ్రేవీ:

గసగసాలు:

  1. తెలుగు వారి పనీర్ బటర్ మసాలా అంటే కచ్చితంగా జీడిపప్పుతో పాటు గసగసాలు, ఎండు కొబ్బరి ఉండాల్సిందే!!! గసగసాలు లేని వారు జీడిపప్పు ఇంకొంచెం పెంచుకోండి.

**గ్రేవీ గ్రైండింగ్:**

  1. గ్రేవీ నీళ్లతో వెన్న అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే బటర్లా ఉంటుంది గ్రేవీ. ఒక వేళా గ్రేవీ బరకగా అనిపిస్తే టీ జల్లెడలో వేసి వడకట్టి గ్రేవీ తీసుకోండి.

బటర్:

  1. ఉంటె బటర్ లేదా నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఏది ఏమైనా ఆఖరున కసూరి మేథీ మాత్రం నలిపి వేసి తీరాలి.

ఇంకొన్ని:

  1. నేను పూర్తిగా కేటరింగ్ వారి తీరులో చేయడం లేదు. అంటే టమాటో సాసలాంటివి ఏవీ వేయడం లేదు. నచ్చితే మీరు కొద్దిగా వేసుకోవచ్చు. కర్రీ టమాటో సాస్ వేస్తే ఒక రుచి వేయకపోతే మరో రుచి.
  2. పెళ్లిళ్ల భోజనాలంటేనే స్పెషల్, అందుకే కొద్దిగా రంగు వేస్తారు, నేనూ వేశాను. కూరలో కచ్చితంగా వేసి తీరాలని లేదు. మీకు కూరకి మాంచి రంగు రావాలంటే ఎర్రని బాగా పండిన టమాటోలు వాడుకోండి.

ఆంధ్రా పనీర్ బటర్ మసాలా - రెసిపీ వీడియో

Andhra Paneer Butter Masala | Paneer Butter Masala | How to make Paneer Butter Masala

Curries | vegetarian
  • Prep Time 5 mins
  • Cook Time 25 mins
  • Total Time 30 mins
  • Serves 5

కావాల్సిన పదార్ధాలు

  • For the Paneer:
  • 2 tbsp బటర్/నెయ్యి
  • 200 gms పనీర్
  • 1 pinch పసుపు
  • For the Gravy:
  • 3 tbsp నూనె
  • 15 జీడిపప్పు
  • 1 tbsp కర్భూజా గింజలు
  • బెత్తెడు ఎండు కొబ్బరి ముక్కలు
  • 1 inch దాల్చిన చెక్క
  • 3 లవంగాలు
  • 2 యాలకలు
  • 1/2 cup ఉల్లిపాయ తరుగు
  • 1 tbsp గసగసాలు
  • 2 పండిన టమాటో
  • For the Curry:
  • 2 tbsp నూనె
  • 3 tbsp బటర్/ నెయ్యి
  • 1 tbsp జీలకర్ర
  • 1 tbsp అల్లం వెల్లులి పేస్ట్
  • ఉప్పు
  • 1 tbsp ధనియాల పొడి
  • 1 tbsp వేపిన జీలకర్ర పొడి
  • 1 1/2 tbsp కారం
  • 275 ml నీళ్లు
  • 2 pinches రెడ్ ఫుడ్ కలర్ (అషనల్)
  • 1 tbsp కసూరి మేథీ
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా (తరుగు - కొద్దిగా)

విధానం

  1. బటర్ కరిగించి అందులో చిటికెడు పసుపు వేసి పనీర్ ముక్కలు వేసి లేత బంగారు రంగు వచ్చేదాకా వేపి తీసుకోండి
  2. మరో మూకుడులో నూనె వేడి చేసి అందులో జీడిపప్పు కర్భూజా గింజలు దాల్చిన చెక్క, లవంగాలు, యాలకలు వేసి వేపుకోండి
  3. తరువాత ఉల్లిపాయ తరుగు వేసి బంగారు రంగు వచ్చేదాకా వేపుకోవాలి. ఉల్లిపాయ వేగిన తరువాత గసాలు వేసి చిట్లనివ్వాలి
  4. చిట్లిన గసగసాలల్లో టమాటో ముక్కలు వేసి టమాటో మెత్తబడే దాకా మగ్గించి దింపి నీళ్లతో మెత్తని పేస్ట్ చేసుకోవాలి. అవసరమైతే జల్లెడలో వేసి వడకట్టుకోండి.
  5. కర్రీ కోసం నూనె 2 tbsp బటర్/నెయ్యి కరిగించి అందులో జీలకర్ర వేసి చిట్లనివ్వాలి. తరువాత అల్లం వెల్లులి ముద్ద వేసి ఎర్రగా వేపుకోవాలి
  6. తరువాత ఉప్పు, ధనియాల పొడి, కారం జీలకర్ర పొడి వేసి మసాలాలు మాడకుండా కొద్దిగా నీళ్లు పోసి నూనె పైకి తేలేదాక వేపుకోవాలి.
  7. నూనె పైకి తేలాక గ్రైండ్ చేసుకున్న గ్రేవీ పేస్ట్ నీళ్లు పోసి నూనె పైకి తేలేదాక నెమ్మదిగా కలుపుతూ చిక్కబడనివ్వాలి.
  8. నూనె పైకి తేలాక వేపుకున్న పనీర్ ముక్కలు, నిలిపిన కసూరి మేథీ మిగిలిన బటర్ వేసి నెమ్మదిగా కలిపి ఒకటి రెండు నిమిషాలు ఉడికించి దింపేసుకోండి
  9. తెలుగు వారి పనీర్ బటర్ మసాలా రోటీలతోనే కాదు, అన్నంతో కూడా చాలా రుచిగా ఉంటుంది.

Leave a comment

Rate this Recipe:
Your email address will not be published.

11 comments